BRS Formation Day | తెలంగాణ భవన్‌లో భారత్ రాష్ట్ర సమితి(BRS) ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నేటికీ 22 సంవత్సరాలు పూర్తి చేసుకొని.. 23 వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ తరుణంలో గులాబీ బాస్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి, ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కేసీఆర్ అమరవీరులకు వినమ్రపూర్వక నివాళులు అర్పించారు.
అనంతరం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో బాగా పనిచేసేవారికే టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని.. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టంమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ హెచ్చరించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు కలిపి మొత్తంగా 279 మంది హాజరు అయినట్లు తెలుస్తోంది.