Khammam | ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా కల్లూరు చేరుకున్న మంత్రులకు స్థానిక ఎమ్మెల్యే సండ్రవెంకట వీరయ్య స్వాగతం పలికారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.కల్లూరు మండల కేంద్రంలో రూ.10.50 కోట్లతో నిర్మితం కానున్న 50 పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కల్లూరులో రూ.1.93 కోట్లతో నూతనంగా నిర్మించనున్న పర్యవేక్షక ఇంజనీర్, నీటి పారుదల శాఖ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. ఆతర్వాత కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులతో పాటుగా… ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీలు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవించంద్ర, బండి పార్థసారథి రెడ్డి తదితరులు ఉన్నారు.