స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్రంలో కొత్తగా మరో ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇస్తూ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, మెదక్, ములుగు, వరంగల్ జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒక్కో కళాశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజాగా అనుమతులు ఇచ్చిన మెడికల్ కాలేజీలతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య సుమారు పదివేలకు చేరువకానున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ఎనిమిది వైద్య కళాశాలలతో కలిపి తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 10 వేలకు చేరువకానుంది. మారుమూల ప్రాంతాలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే లక్ష్యంతో జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయనున్నట్టు గతంలో సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా ఆదేశాల నేపథ్యంలో స్థానిక విద్యార్థులు మరింత ప్రయోజనం పొందనున్నారు. మెడికల్ కాలేజీలు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.