స్వతంత్ర వెబ్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి భారత దేశం అంతా అభిమానులే. కెప్టెన్ కూల్ గా ఎన్నో విజయాలను అందించాడు మన మహేంద్ర సింగ్ ధోని. భారత క్రికెట్ చరిత్రలో ఐసీసీ ట్రోఫీల పరంగా మహేంద్ర సింగ్ ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్‍గా నిలిచాడు. ‘మిస్టర్ కూల్’ ధోనీ సారథ్యంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలిచింది. మూడు ఐసీసీ టైటిళ్లను సాధించిన ఏకైక భారత కెప్టెన్‍గా కీర్తి దక్కించుకున్నాడు ధోనీ. 2020లో అంతర్జాతీయ క్రికెట్‍కు గుడ్‍బై చెప్పిన ధోనీ.. ఐపీఎల్‍లో ఆడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‍లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మరోసారి విజేతగా నిలిపాడు. జట్టుకు ఐదో టైటిల్ అందించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా ఎంఎస్ ధోనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ధోనీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. చాలా మంది అతడిని ఆరాధిస్తారు. కాగా, రేపు (జూలై 7) ధోనీ తన 42వ పుట్టిన రోజును జరుపుకోనున్నాడు. ధోనీ బర్త్ డే సందర్భంగా సంబరాలు జరుపుకునేందుకు తెలుగు రాష్ట్రాలు కూడా రెడీ అయ్యాయి.
ధోని పుట్టినరోజు సందర్భంగా అభిమానులు నందిగామలో భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామం వద్ద రేపు ధోనీ 44వ జన్మదినంను పురస్కరించుకొని 77 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ ఆ రహదారిపై నుండి వెళ్తున్న వారిని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఓ అభిమాని మాట్లాడుతూ… రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులం కలిసి పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పాడు. తెలంగాణలో ఇప్పటికే 52 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశామని, ఇక్కడ 77 అడుగులది పెట్టామన్నాడు. తాము ధోనీపై అభిమానంతో ఇదంతా చేస్తున్నామన్నాడు.


