ఎమ్మెస్ స్వామినాథన్….భారతదేశ హరిత విప్లవ పితామహుడు. హరిత విప్లవం మనదేశ వ్యవసాయరంగంలో పెనుమార్పులు తీసుకువచ్చింది. హరిత విప్లవంతో దేశంలో పంటల ఉత్పత్తి ఎవరూ ఊహించనిస్థాయలో పెరిగింది. అధిక దిగుబడి వంగడాల కార్యక్రమానికి హరిత విప్లవంలో ప్రాధాన్యం దక్కింది. ఎమ్మెస్ స్వామినాథన్ తన జీవితాన్ని సంపూర్ణంగా వ్యవసాయ రంగానికే అంకితం చేశారు. ఆరుగాలం కష్టపడే అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపడానికి అనుక్షణం ఆయన తపన పడ్డారు. ఆకలితో అల్లాడుతున్న సమయంలో భారత ప్రజలకు ఆహార భద్రత కల్పించారు.
భారతదేశ వ్యవసాయ చరిత్రలో ఎమ్మెఎస్ స్వామినాథన్ పేరు సువరాక్షరాలతో రాయదగ్గది. భారతదేశానికి హరిత విప్లవాన్ని పరిచయం చేసిన ఘనత నిస్సందేహంగా ఎమ్మెస్ స్వామినాథన్‌దే. ఎమ్మెస్ స్వామినాథన్ తమిళనాడులోని కుంభకోణంలో 1925 ఆగస్టు ఏడో తేదీన జన్మించారు. తండ్రి సాంబశివన్ పేరున్న సర్జన్. ఒకదశలో తండ్రి బాటలో తాను కూడా డాక్టర్ కావాలనుకున్నారు స్వామినాథన్. అయితే 1943లో వచ్చిన బెంగాల్ కరువును చూసి ఆయన చలించిపోయారు. దేశాన్ని ఆకలికేకల నుంచి బయటపడేయాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో మెడిసిన్ చదవాలన్న మైండ్‌సెట్ మార్చుకున్నారు. వైద్యం నుంచి వ్యవసాయంవైపు మళ్లారు స్వామినాథన్. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో వ్యవసాయశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు.
1954లో భారతదేశానికి తిరిగివచ్చారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధనలు కొనసాగిం చారు. ఆ తరువాత వ్యవసాయ శాస్త్రవేత్తగా వివిధ హోదాల్లో పనిచేశారు.మనదేశంలో హరిత విప్లవానికి చారిత్రక నేపథ్యం ఉంది. 1961-66 మధ్యకాలంలో మనదేశంలో వ్యవసాయరంగంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి పెద్ద ఎత్తున గోధుమలను దిగుమతి చేసుకుంది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో భాగంగా 60వ దశకంలో దేశంలోని ఏడు జిల్లాల్లో ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం…ఐఏడీపీని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఐఏడీపీ పథకం కింద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాను ఎంపిక చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇదొక విశేషం. అయితే ఐఏడీపీ పథకంలో కొన్ని లోపాలున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఆయా లోపాలను సవరించారు. పథకం పేరును ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ ఏరియా ప్రోగ్రాంగా మార్చారు. ఆ తరువాత ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా మొత్తం 114 జిల్లాల్లో ప్రవేశపెట్టారు. ఈ పరిణామాలే చివరకు హరిత విప్లవానికి దారి తీశాయి.
భారతదేశ వ్యవసాయరంగానికి 1965 ఏడాదితో గొప్ప అనుబంధం ఉంది. భారతదేశంలో నూతన వ్యవసాయ విధానానికి నాంది పలికిన హరిత విప్లవం 1965లోనే ప్రారంభమైంది. హరిత విప్లవంతో భారతదేశ వ్యవసాయరంగంలో ఎమ్మెస్ స్వామినాథన్ పెనుమార్పులు తీసుకువచ్చారు. వ్యవసాయంలో కొత్త వ్యూహంతో పంటల ఉత్పత్తిని ఇబ్బడి మబ్బడిగా పెంచారు. అధిక దిగుబడి వంగడాల కార్యక్రమానికి హరిత విప్లవంలో ప్రాధాన్యం కల్పించారు. గ్రీన్ రివల్యూ షన్‌లో భాగంగా పంటల మార్పిడి, నీటి వసతి, యాంత్రీకరణ, పంటల రక్షిత విధానం, పరపతి సదుపాయం, మద్దతు ధర…అలాగే మరికొన్ని వ్యవసాయంలో కొత్తగా భాగమయ్యాయి. హరిత విప్లవం పుణ్యాన మనదేశంలో 1964 నుంచి పంటలకు మద్దతు ధరల విధానం ప్రారంభమైంది. ఆహారధాన్యాల ధరలకు సంబంధించి సలహాలు ఇవ్వడానికి 1965 లో వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు చేశారు. ఇందుకు కొనసాగింపుగా అదే ఏడాది భారత ఆహార సంస్థ ఏర్పాటు అయింది.
హరిత విప్లవంతో భారతదేశానికి కలిగిన లాభాలు అన్నీఇన్నీ కావు. గ్రీన్ రివల్యూషన్ ఫలితంగా దేశంలో ఆహార ధాన్యా ల ఉత్పత్తి పెద్ద ఎత్తున పెరిగింది. ప్రధానంగా వరి, గోధుమల ఉత్పత్తి ఇబ్బడిమబ్బడిగా పెరిగింది. వాస్తవానికి 1960ల్లో వరి ఉత్పాదకత 10 క్వింటాళ్లుగా ఉండేది. 2011-12 నాటికి అదే వరి ఉత్పత్తి 23 క్వింటాళ్లకు పెరిగింది. అలాగే గోధుమ ఉత్పత్తి కూడా ఎనిమిది క్వింటాళ్ల నుంచి 31 క్వింటాళ్లకు పెరిగింది అంతేకాదు హరిత విప్లవ ప్రభావం వాణిజ్య పంటల పై కూడా పడింది. ముఖ్యంగా 1973-74 తరువాత వాణిజ్యపంటల ఉత్పత్తి ఎక్కువైంది. దీంతోపాటు వ్యవసా య రంగంలో కాయధాన్యాల ఉత్పత్తి పెరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చింది హరిత విప్లవం. దీంతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ భారతదేశంలో యువకులకు ఉపాథి అవకాశాలు పెరిగాయి. ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. వీటన్నిటి ఫలితంగా దేశంలో పేదరికం తగ్గింది.1989లో పద్మవిభూషణ్ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది. 2007 నుంచి 2013 మధ్యకాలంలో పార్లమెంటు సభ్యుడిగా స్వామినాథన్ సేవలందించారు. వ్యక్తిగత విషయాలకు వస్తే స్వామినాథన్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఈ ముగ్గురూ దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలు కావడం విశేషం.


