గౌరవ ప్రదమైన స్థానాల్లో ఉన్న నేతలు ఉపయోగిస్తున్న భాషపై తెలంగాణ అసెంబ్లీలో వాడీ వేడి చర్చ జరిగింది. నల్గొండ సభ వేదికగా అధికార పార్టీ సభ్యులను ఉద్దేశిస్తూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు… అందుకోసం ఉపయోగించిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వయంగా సీఎంను… గులాబీ బాస్ అలా అనవచ్చా అంటూ శాసనసభ వేదికగా ఫైరయ్యారు. అయితే.. తెలంగాణ సీఎం వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. దీంతో సభ వాడీవేడిగా సాగింది. చివరకు సర్కారు వైఖరి ఖండిస్తూ ముఖ్యమంత్రి వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారు.
రాజకీయాల్లోనే కాదు.. ఎక్కడైనా భాష ప్రధానం అన్న సంగతి వేరే చెప్పనక్కర్లేదు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెత కూడా ఉంది. కానీ, దురదృష్టవశాత్తూ పాలిటిక్స్‌లో కొందరు నేతలు ఉపయోగిస్తున్న భాషపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సమయం, సందర్భం ఏదైనా కావచ్చు… ఆవేశంతో అనవచ్చు.. లేదంటే తమ పార్టీ శ్రేణుల్ని ఉత్సాహ పరిచేందుకు కావచ్చు… కానీ, కారణం ఏదైనా మన నేతలు వాడిన, వాడుతున్న భాష మాత్రం కొన్నిసార్లు అభ్యంతరకరంగా ఉంటోందన్న వాదన బలంగా విన్పిస్తోంది. తాజాగా ఇదే విషయంలో మాజీ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ ఉపయోగించిన భాషపై అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో రగడ సాగుతున్న వేళ…కృష్ణా జలాల విషయంలో శాసన సభ వేదికగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. దీంతో.. ప్రజలకు వాస్తవాలు వివరించాలని నిర్ణయించింది బీఆర్ఎస్. కృష్ణా జలాల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తామని నల్గొండ సభ వేదికగా చెప్పుకొచ్చింది ప్రతిపక్ష గులాబీ పార్టీ. ఇదే అంశంపై అధికార కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుపడుతూ మాటల తూటాలు పేల్చారు మాజీ సీఎం కేసీఆర్. అయితే.. బీఆర్ఎస్ సభ సాగుతున్న వేళ.. అధికార కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు ఎమ్మెల్యేలను తీసుకెళ్లింది. ఈ అంశంపై స్పందించిన గులాబీ బాస్… కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. సీఎం టార్గెట్‌గా తీవ్రమైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలోనే ఆయన ఉపయోగించిన భాష ఇప్పుడు వివాదాస్పదమైంది.
నల్గొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ ఉపయోగించిన భాషపై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి.. గతంలో ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న గులాబీ బాస్…ఓ సీఎంను ఉద్దేశిస్తూ పరుష పదాలు ఉపయోగించవచ్చా అంటూ ప్రశ్నించారాయన. నాలుగు కోట్ల ప్రజానీకం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అవమానించేలా కేసీఆర్ మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.
సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గులాబీ బాస్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి స్థానంలో ఉండి ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అభ్యంతరం లేదన్న ఆయన.. ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. సీఎంగా ఉన్నప్పుడు సంయమనం పాటించాలని సూచించారు కడియం శ్రీహరి.ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు ప్రతిపక్షం కావచ్చు.. అధికార పక్షం కావచ్చు ఎవరైనా సరే పరుష పదాలు, అభ్యంతరకర పదాలు ఎందుకు ఉపయోగించాల్సి వస్తోందన్న ప్రశ్న వేస్తున్నారు మేధావులు, రాజకీయ విశ్లేషకులు. అంతే కాదు.. ఓ పదవిలో ఉంటే ఏమైనా అనవ చ్చు.. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఏమీ అనకూడదు.. మరో స్థానంలో ఉంటే ఇంకా ఏమైనా అనవచ్చు.. ఇలాంటి మాటలు చెప్పే బదులు.. అసలు అభ్యంతరకర మాటలు.. గౌరవప్రదమైన స్థానం లో ఉన్న వాళ్లుఎవరూ వాడకుండా.. మాట్లాడకుండా ఉంటే అందరికీ మంచికదా అన్న వాదన విన్పి స్తోంది. మరి దీనిపై మన ప్రజాప్రతినిధులు ఏమంటారో..? రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలకు ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందో చూడాలి మరి.


