బీసీల అభ్యున్నతికై…
అసెంబ్లీ సమావేశాల్లో కులగణనపై నిర్ణయం తీసుకుని ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల బీసీ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్ క్రిష్ణయ్యల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అలాగే పార్లమెంటులో కూడా కులగణన కోసం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హాయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.
హ్యాపీ బర్త్‌డే కేసీఆర్ సార్…
హైదరాబాద్ ఓయూలో మాజీ సీఎం కేసీఆర్ బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో.. ఈ వేడుకలు జరిగాయి. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి.. శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లేని లోటు.. రాష్ట్ర ప్రజలందరికీ కనిపిస్తుందన్నారు.
గులాబీ బాస్ బర్త్ డే వేడుకలు
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మేయర్ జక్కా వెంకట్ రెడ్డి అధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి హాజరై కేక్‌కట్ చేసి కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
నౌహిరా షేక్‌పై బండ్ల గణేష్ కుమారుడు హీరేష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నౌహిరాకు చెందిన ఇంటిని బండ్ల హీరేష్ బేరం చేసి 3కోట్లు చెల్లించాడు. కొనుగోలు చేసిన ఇల్లు ఈడీ జప్తులో ఉండడంతో డబ్బు తిరిగి చెల్లించాలని నౌహిరాను కోరాడు. డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో ఫిల్మ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో హీరేష్ ఫిర్యాదు చేశాడు.
వింత ఘటన
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఊరి చివర ఉన్న వేప చెట్టు నుండి పాలు లాంటి నురుగు ఉబికి వస్తుండటంతో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఇది గ్రామానికి శుభ సూచకం… బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమంటున్నారు గ్రామ మహిళలు.
ఇంద్రకీలాద్రి అమ్మవారి సేవలో…
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానాన్ని ప్రముఖ నటుడు గోపీచంద్ దర్శించుకున్నారు. దర్శనం తర్వాత వేదపండితులు వేద ఆశీర్వాదం చేసి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందించారు. కొత్తగా తెరకెక్కిస్తున్న బీమా చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొంది హిట్ కావాలని అమ్మవారిని కోరుకున్నానని గోపీచంద్ తెలిపారు.
తరగతి గదులు సీజ్
అనుమతి లేని తరగతి గదులను సీజ్ చేశారు ఉప్పల్ MEO శశిధర్. హైదరాబాద్ హబ్సిగూడలో చైతన్య పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు నిరస న చేపట్టారు. తరగతులను సీజ్ చేస్తే.. వాటిని తొలగించి మళ్లీ యధావిధిగా క్లాసులు నిర్వహిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు.
మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు
ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర సందర్భంగా ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్, బస్ టికెట్ కౌంటర్లను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రారంభించారు. అనంతరం సమ్మక్క, సారాలమ్మకు మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అభివృద్ధి బాటలో మొగల్తూరు
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో కోటి 66 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు ప్రారంభించారు. మొగల్తూరులో ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. పడమటిపాలెం వెంప రోడ్డు త్వరలో పూర్తి చేస్తామన్నారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య ఉందని భవిష్యత్తులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీగా నిర్మించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
సొంత బిడ్డను కడతేర్చారు
అక్రమ సంబంధం కారణంగా ఓ తల్లి తన సొంత బిడ్డను కడతేర్చిన దారుణ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో తరుచూ ఫోన్లో మాట్లాడుతుందని, తను ఇంటికి వచ్చి వెళ్తున్న విష యాన్ని తండ్రికి సమాచారం ఇస్తుందనే కారణంగా తన రెండో కూతురిని చంపి పాము కాటుకు చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసింది.. బాలిక శరీరం పై ఉన్న గాయాలను గమనించిన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అసలు విషయం బయటపడింది..
జాతరకు వచ్చిన కుటుంబంలో విషాదం
మేడారం మహా జాతరకు వచ్చిన కుటుంబంలో విషాదం నెలకొంది. వరంగల్ జిల్లా బాలాజీ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. వాటర్ సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా తాండూర్ కి చెందిన కరణం బలేశ్వరి రవికుమార్ దంపతులు మేడారం దర్శనానికి వచ్చారు. దీంతో ఆడుకుంటుండగా సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.
అభివృద్ధే ధ్యేయంగా….
తీరంలో రహదారులు అభివృద్ధితో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పలు అభివృద్ది పనులను శంకుస్ధాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. సంక్షేమ పధకాలకు అందించినట్టు.. రాష్ట్రంలో మరే నియోజకవర్గంలో జరగని విధంగా అత్యధిక నిధులు నరసా పురం నియోజకవర్గంలో గత ఐదేళ్ల కాలంలో వెచ్చించి అభివృద్ధి చేశామన్నారు.