సంక్రాంతి అంటే చాలామందికి తెలుగువారు మాత్రమే జరుపుకునే పర్వంగా భావిస్తారు. ఈ పండగని మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆసియా ఖండంలో అనేక దేశాల్లో విభిన్న రీతుల్లో, పలు సంప్రదాయాల్లో సంక్రాంతిని నిర్వహించు కుంటున్నారు.
ప్రపంచదేశాల్లో సంక్రాంతి పండుగ
సంక్రాంతి అంటే చాలామందికి తెలుగువారు మాత్రమే జరుపుకునే పర్వంగా భావిస్తారు. ఈ పండగని మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆసియా ఖండంలో అనేక దేశాల్లో విభిన్న రీతుల్లో, పలు సంప్రదాయాల్లో సంక్రాంతిని నిర్వహిం చుకుంటున్నారు.సంక్రాంతి విశ్వ పండుగ. సంక్రాంతి కేవలం భారతదేశానికే పరిమితమైన పండుగ కాదు. సూర్యుడు కర్కటకరాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించే రోజును మకరసంక్రాంతిగా పిలుస్తారు.ఈ పర్వదినాన్ని దక్షిణాసియాలోని అనేక దేశాల్లో జరుపుకుంటారు. అలాఇలా కాదు….ఆయాదేశాల్లో ఉరిమే ఉత్సాహంతో సంక్రాంతి సంబురాలు జరుపు కుంటారు. అయితే అన్ని దేశాల్లోనూ సంక్రాంతి పండుగను అదే పేరుతో పిలవరు. ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో పండుగ జరుపుకుంటారు. ఏ పేరుతో పిలిచినా, మౌలికంగా సంక్రాంతి సంబురాల్లో కొన్ని సాధారణ అంశాలు ఉంటాయి. సంక్రాం తి ప్రధానంగా వ్యవసాయదారుల పండుగ. పంట చేతికొచ్చిన సందర్భంలో అన్నదాతలు ఆనందంతో చేసుకునే పండు గ. సంక్రాంతి పండుగలో సూర్యుడి పూజ ఒక ప్రధాన అంశం. కొన్ని ప్రాంతాల్లో పీడలను తొలగించుకునే పండుగగా సంక్రాంతిని జరుపుకుంటారు. అన్నిటికంటే ముందుగా ప్రకృతికి కృతఙ్ఞతలు తెలుపుకోవడం పండుగలో మరో ప్రధాన అంశం.
మన పొరుగుదేశమైన నేపాల్లో కూడా సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ మాఘే సంక్రాంతి అనే పేరుతో పండుగ జరుపుకుంటారు. నేపాల్లో కూడా మాఘే సంక్రాంతి జరుపుకునే సమయానికి రైతులకు పంట చేతికొస్తుంది. అన్నదాతలు ఆనందంలో ఉండే సమయంలో అత్యుత్సాహంతో సంబురాలు జరుపుకుంటారు నేపాల్ వాసులు.
నేపాల్‌లోనే కాదు…థాయ్‌లాండ్‌లోనూ సంక్రాంతి సంబురాలుంటాయి. థాయ్‌లాండ్‌లో సంక్రాంతి పండుగను సాంగ్ క్రాన్ అని పిలుస్తారు. పండుగ రోజు దేశమంతా సంబురాలు జరుగుతాయి. అంతేకాదు….ప్రతి వీథిలోనూ గాలిపటాలు ఎగురుతుంటాయి.పట్టణ శివార్లలోని ఖాళీ ప్రదేశాల్లోనూ, మైదానాలల్లోనూ కుర్రవాళ్లు గుంపులుగుం పులుగా గుమికూ డతారు. ఆకాశమార్గాన గాలిపటాలు ఎగురవేసి పండుగ మజా ఎంజాయ్ చేస్తారు. అలాగే మయన్మార్‌లో తింగ్యాన్‌గా, సంక్రాంతిని జరుపుకుంటారు. తింగ్యాన్ అంటే మయన్మార్ ప్రజలకు అతి పెద్ద పండుగ. మయన్మార్ జనాభాలో మెజా రిటీ ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతుంటారు. సరిగ్గా తింగ్యాన్ పండుగ వచ్చే సమయానికి పంట చేతికొస్తుంది. ఈ నేపథ్యంలో సకాలంలో వానలు కురిపించి, తమను ఆదుకున్నందుకు ప్రకృతికి కృతఙ్ఞతలు తెలియ చేస్తారు మయన్మార్ వాసులు. శ్రీలంక…ఇది భారత్ పొరుగుదేశం. శ్రీలంకలో తమిళులు ఎక్కువమంది ఉంటారు. తమిళనాడు నుంచి శ్రీలంక వెళ్లి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నవారు కూడా భారీ సంఖ్యలో ఉంటారు. తమిళనాడు లో సంక్రాంతిని పొంగల్ పేరుతో జరుపుకుంటారు. ఇదే పద్దతిని పాటిస్తూ శ్రీలంకలోనూ పండుగను పొంగల్‌గా వ్యవహరిస్తారు. తమిళులు చేసుకున్నట్లే శ్రీలంకలోనూ పొంగల్‌ను ఘనంగా నిర్వహిస్తారు.
ఇవేకాదు…కంబోడియాలో మెహా సంక్రాన్, లావాస్‌లో మాలోవాగా పేరుతోనూ సంక్రాంతి సంబురాలు జరుగుతాయి. అయితే దాదాపుగా అన్ని దేశాల్లోనూ పండుగ చేసుకునే పద్ధతులు ఒకేవిధంగా ఉంటాయి. సంక్రాంతి సంబురాలకు సంబంధించి ఇదొక విశేషం. అలాగే విదేశాల్లో…మహిళలకు సంబంధించిన పండుగగా కూడా సంక్రాంతి జరుపుకోవడం ఒక విశేషం. మహిళ లేకుంటే మగవాడి ఉనికే లేదు. అమ్మగా, భార్యగా, తోబుట్టువుగా, బిడ్డగా మగవాడికి అన్ని విధాలా అండగా ఉంటుంది మహిళ. ఈ నేపథ్యంలో యావత్ మహిళా లోకానికి కృతఙ్ఞతగా వారిని పూజించాలన్నది ఈ సంబురాల వెనక ఉన్నముఖ్య ఉద్దేశ్యం.అద్భుతమైన ప్రకృతి అందానికి ఎర్రటి పూర్ణ తిలకం దిద్దినట్టుండే భానుడిని సంక్రాంతి పర్వదినాన పూజిస్తారు. ఇది, భారతీయులకు ప్రకృతి పట్ల గల కృతఙ్ఞతా భావనను సూచిస్తుంది.ప్రకృతిని పూజించే ఉన్నతమైన సంస్కృతి పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోతోంది. కాలుష్యం కారణంగా పెద్ద ఎత్తున మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతగా మారింది. పర్యావరణ సమతుల్యతతోనే సకల చరాచర జీవరాశుల మనుగడ సాధ్యమవుతుంది.
భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ
సంక్రాంతి కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. యావత్ భారతదేశం ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుం టుంది. అయితే ఒక్కో చోట ఒక్కో పేరుతో ఈ సంబురాలు జరుపుకుంటారు. పర్వదినాన్ని ఏ పేరుతో పిలిచినా పండుగ అంశాలు ఒకేలా ఉండటం విశేషం. శాస్త్రీయంగా చూస్తే సంక్రాంతి అనేది ఒక ముఖ్యమైన పాన్ -ఇండియన్ సోలార్ ఫెస్టివల్.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పర్వదినాన్ని సంక్రాంతి అని అంటారు. తెలంగాణలో అయితే పీడల పండుగ అని కూడా అంటారు. పొరుగున ఉన్న కర్ణాటకలోనూ సంక్రాంతి అనే పిలుస్తారు. కర్ణాటక లో వ్యవసాయదారుల పండుగగా సంక్రాంతిని జరుపుకుంటారు. సంక్రాంతి సంబురాల్లో భాగంగా నువ్వులు,బెల్లం,పల్లీలు,ఎండు కొబ్బరి ముక్కలు ఉంచిన పాత్రను ముత్తైదువులకు అందిస్తారు. కర్ణాటక సంక్రాంతికి సంబంధించి ఇదొక సాంప్రదాయం.కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి రోజున నిప్పుల మీద నడుస్తారు. ఇదొక ఆచారం అంటారు కర్ణాటకవాసులు.
సంక్రాంతిని తమిళంలో పొంగల్ అని పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని సంక్రాంతికి, తమిళనాట జరిగే పొంగల్‌కు అనేక సారూప్యతలు కనిపిస్తాయి. పండుగ పూట గుమ్మాలకు వేపాకులు కట్టడం తమిళుల సంప్రదాయం. ఇలా వేపాకులు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు రావన్నది తమిళుల నమ్మకం. సంబురాల్లో రెండో రోజును థై పొంగళ్ అని పిలుస్తారు. థై పొంగళ్ రోజున కొత్త పాత్రలో బియ్యం,బెల్లం,పాలు కలిపి పొయ్యమీద పొంగించి సూర్యుడికి నైవే ద్యంగా సమర్పిస్తారు. ఇలా పొంగించడం వల్ల సదరు కుటుంబం కూడా ఉన్నతంగా ఎదుగుతుందని తమిళులు భావిస్తారు. మూడో రోజు పర్వదినాన్ని మాట్టు పొంగళ్ అని పిలుస్తారు. మాట్టు పొంగళ్ సంబురాల్లో పశువులను కూడా గౌరవిస్తారు. పొంగల్ పర్వదినం సందర్భంగా పశువులను గౌరవించడం ఒక సంప్రదాయం.
వ్యవసాయ రాష్ట్రమైన పంజాబ్‌లో కూడా సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ సంక్రాంతిని లోహ్రీ అనే పేరుతో పిలుస్తారు. భోగి పండుగలో భాగంగా మంటలు వేస్తారు. ఈ మంటల్లో చెరుకుగడలు, స్వీట్లు, బియ్యం వేస్తారు. ఆ మంటల చుట్టూ భాంగ్రా డ్యాన్స్ చేస్తూ కలియ తిరుగుతారు. సంక్రాంతిరోజున పంజాబీలు ఉద యాన్నే నదీస్నానం ఆచరిస్తారు. ఆ తరువాత నువ్వులనూనెతో దీపాలు వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల పాపాలు తొలిగిపోతాయన్నది ఒక నమ్మకం.
రాజస్థాన్‌లో సంక్రాంతిని సంక్రట్‌గా పిలుచుకుంటారు. రాజస్థాన్‌లో సంక్రట్ సంబురాలు పెద్ద ఎత్తున జరుపు కుంటారు. పండుగ రోజున బంధువులను అలాగే కొత్తగా పెళ్ళైన తోబుట్టువులను ఇంటికి ఆహ్వానిస్తారు. సంక్రట్ భోజ్ అనే పేరుతో పేణీ,తిల్ పట్టీ,గజక్,ఘీవర్,ప్రవా,తిల్‌లడ్డూ లతో కూడిన పసందైన భోజనాన్ని వడ్డిస్తారు. ఇది రాజస్థానీయుల సాంప్ర దాయం.పదమూడు నోములను నోచుకొని ముత్తైదువులకు ఇవ్వడం సంక్రట్ సంబరాల్లో ఒక భాగం. మహారాష్ట్రలో సంక్రాంతిని హల్దీ కుంకుం పేరుతో పిలుస్తారు. మహారాష్ట్రీయులు జరుపుకునే హల్దీ కుంకుం వేడుకల్లో సమైక్యతా భావన ఉట్టిపడుతుంటుంది. పండుగ రోజు ముత్తదువులను ఇంటికి పిలిపిస్తారు. వారికి స్టీల్ పాత్రలు, వస్త్రాలను వాయనంగా ఇస్తారు. పర్వదినం సందర్బంగా అనేక వంటకాలు చేసుకుంటారు. వీటిలో తిల్‌గుల్ లడ్డూలు ముఖ్యమైనవి.
పశ్చిమ బెంగాల్‌లోనూ సంక్రాంతిని మూడురోజులు వ్యవసాయదారుల పండుగగా జరుపుకుంటారు.కొత్తవడ్లు, ఇతర పదార్థాలతో బెంగాలీ స్వీట్లు తయారుచేస్తారు.గన్సుగడ్డ, చిలగడదుంప బెల్లంతో తయారుచేసిన తీపిపదార్థాన్ని పండు గరోజున తీసుకుంటారు. పర్వదినాన్ని వరలక్ష్మీ దేవిని పూజించడం బెంగాలీయుల సంప్రదాయం. గంగాసాగర్ లో మాఘమేళా నిర్వహించడం బెంగాలీల ప్రత్యేకత. పండుగ రోజు గంగాసాగర్‌లో బెంగాలీలు పవిత్ర స్నానం ఆచరిస్తా రు. కాశ్మీర్‌లో లోహ్రిగా సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకుంటారు. లోహ్రీ సంబురాలను కాశ్మీరీయులు పెద్ద ఎత్తున నిర్వహి స్తారు. ఈ సంబురాలలో పవన్ యఙ్ఞాస్ చాలా ముఖ్యమైనది. పవన్ యఙ్ఞాస్ అంటే భోగి మంటలు. ఈ భోగిమంటల చుట్టూ కాశ్మీరీయులు నృత్యం చేస్తూ తిరుగుతారు.ఇవే కాదు…దేశంలోని అనేక ప్రాంతాల్లో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరు ఉంటుంది. కేరళలో మకర సంక్రాంతి అంటారు.అసోంలో మాఘి బిహు, హిమాచల్ ప్రదేశ్‌లో మాఘి సాజి అంటారు. హర్యానాలో సక్రత్ అని పిలుస్తారు. అంతేకాదు… ఉత్తరాఖండ్‌లో ఘుఘూటీ అని, బీహార్‌లో దహీ చురా అనీ, ఉత్తరప్రదేశ్‌లో ఖచిడి సంక్రాంతి అని పిలుస్తారు. మొత్తంమీద యావత్ భారతదేశంలోనూ సంక్రాంతి పర్వదినాన్ని ఉత్సాహంగా జరుపుకుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పర్వం
సంక్రాంతి పర్వదినానికి, సూర్యుడికి అవినాభావ సంబంధం ఉంది. సూర్యుడు కర్కాటక రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి మౌలికంగా వ్యవసాయదారుల పండుగ. పంట చేతికి రావడంతో రైతులు ఆనందోత్సాహాలతో సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకుంటారు. సంక్రాంతి….తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండగ నిర్వహిస్తారు. సంక్రాంతి ఒక పర్వదినం. పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కళకళలాడుతుంటాయి. గొబ్బి పాటలు, గంగిరెద్దులు, హరిదాసులు, రథం ముగ్గులు, భోగిమంటలు, బొమ్మల కొలువులు, పిండి వంటలు, కొత్త దుస్తులు.. ఇలా తెలుగు రాష్ట్రాలు పండుగ శోభతో ఉట్టిపడుతుంటాయి.
సంక్రాంతి రోజుల్లో పల్లెటూళ్లలో ప్రతి ఇల్లు ఒక రంగవల్లి అవుతుంది. ఏ ఇంటి ముందు చూసినా ముగ్గులు కనిపిస్తుంటాయి. సంక్రాంతి రోజున రథం ముగ్గులు స్పెషల్. సంక్రాంతికి ఒకటి కాదు..రెండు కాదు…అనేక ప్రత్యేకతలున్నాయి. హరిదాసులు, పీడలను హరించే భోగి మంటలు, రంగురంగుల పతంగులు, ఇంటినిండా కనిపించే ధాన్యపురాశులు ….వీటిలో కొన్ని. సంక్రాంతి సందర్భంగా ప్రతి తెలుగు ఇంట్లోనూ పిండి వంటలు చేసుకుంటారు. ఒక పండక్కి వచ్చే కొత్త అల్లుళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భోగితో మొదలయ్యే సంక్రాంతి సంబురాలు కనుమతో ముగుస్తాయి. సహజంగా సంక్రాంతి మూడు రోజుల పండుగ. అయితే కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులు జరుపుకుంటారు. పితృదేవతలకు తర్పణాలు వదలడం సంక్రాంతి పర్వదినంలో ఒక భాగం. సంక్రాంతి పండుగకు మరో ప్రత్యేకత. అన్ని వేడుకలు ఉన్న ఏకైక పండుగ సంక్రాంతే. భోగితో పండుగ ప్రారంభమవుతుంది. భోగిమంటల్లో ఇంట్లోని పాత వస్తువులను కాల్చేయడం ఒక పద్దతి. మనలోని చెడును తీసివేయాలన్నది భోగి మంటల అంతరార్థం. కొత్త కొత్త ఆలోచనలతో సరికొత్త ఆశయాలతో మనిషి ఎదగాలని భోగి పండుగ సందేశం ఇస్తుంది. అలాగే భోగి పండుగ రోజు కొత్త బియ్యం, రేగు పళ్లు, నాణాలు, బంతి పువ్వులు కలిపి పిల్లలకు బోగి పళ్లు పోస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదొక ఆచారం.
పండుగ రెండో రోజును మకర సంక్రాంతిగా పేర్కొంటారు. మకర సంక్రాంతి రోజున ఉదయాన్నే నదీ స్నానం చేయడం ఒక ఆచారం. అలాగే మూడో రోజును కనుమ అని పిలుస్తారు. కనుమ పండుగ రోజు నువ్వులు, బెల్లం కలిపిన పదార్థాలను పసుపు కుంకుమతో పాటు ముత్తయిదువులకు అందిస్తారు. ఇది సంక్రాంతి పర్వదినం సంప్రదాయం. నువ్వులు, బెల్లం కలిపి తినడంలో ఒక ఆరోగ్య రహస్యం ఉంది. శరీరానికి వెచ్చదనం అందుతుంది. చలిబారిన పడకుండా మనలను మనం రక్షించుకున్నవారమవుతాం. సంక్రాంతి పర్వదినం ప్రత్యేకతల్లో పతంగులు ఒకటి. పండుగ రోజు పతంగులు ఎగురవేయడానికి అందరూ ఆసక్తి కనబరుస్తుంటారు. వయస్సు తారతమ్యం లేకుండా చిన్నా పెద్దా అందరూ పండుగ రోజు పతంగులు ఎగురవేస్తుంటారు. పండుగ జోష్ ప్రదర్శిస్తుంటారు. అనేక ప్రాంతాల్లో పతంగుల పోటీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.
హరిదాసులు….సంక్రాంతి పండుగ మరో ప్రత్యేకత. సంక్రాంతి పండుగలో భారతీయ సాంప్రదాయాలను చాటి చెబుతూ భగవంతుడి ఆశీస్సులను భక్తులకు అందజేస్తున్న వారే హరిదాసులు అంటారు పెద్దలు. కొన్ని తరాలుగా హరిదాసుల సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో ఉంది. సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రతి తెలుగు పల్లెల్లోనూ హరిదాసులు సందడి చేస్తుంటారు. భక్తి గీతాలను ఆలపిస్తూ, తలపై అక్షయపాత్రను ధరించి, భగవంతుడి ఆశీస్సులు అందించేందుకు హరిదాసులు ఇంటింటికి వెళుతుంటారు.
కోడి పందాలు లేని సంక్రాంతి సంబురాలను ఎవరూ ఊహించలేరు. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలు మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు కోడి పందాలకు పెట్టింది పేరు. ఎప్పుడెప్పుడు సంక్రాంతి పండుగ వస్తుందా …ఎప్పుడెప్పుడు కోడి పందాలు చూద్దామా ..అన్నట్లు ఎదురు చూస్తుంటారు కోస్తా ప్రజలు. కోడి పందాలంటే అల్లాటప్పా వ్యవహారం కాదు. పందాల్లో పాల్గొనే రెండు కోళ్ల కాళ్లకు కత్తులు కడతారు. రెండు కోళ్లను యుద్ధభూమిలోకి వదులుతారు. ఇంకేముంది…కోళ్లు రెండూ కొదమసింహాల్లో తలపడుతాయి. ప్రత్యర్థి కోడికి కట్టిన కత్తి శరీరంలోకి దిగబడుతుంది. శరీరం రక్తం ఓడుతుంది.అయినా ఏ కోడీ.. వెనక్కి తగ్గదు. నువ్వా నేనా అన్నట్లు పోరాడతాయి. విజయమో…వీర స్వర్గమో అన్నట్లు ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తాయి. తెలుగురాష్ట్రాల లోగిళ్లకు కొత్త సొబగులు అద్దుతుంది సంక్రాంతి పర్వదినం. ఈ పండుగ సందర్భంగా ప్రతి పల్లె.. ఒక రంగవల్లి అవుతుంది.