సంక్రాంతి పండగ వేళ శ్రీకాకుళం జల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాస మండలం మొగిలిపాడు గ్రామ సమీపంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై రెండు బస్సులు ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెనుక నుంచి మరో బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ఘటనా స్థలంలో మృతి చెందగా… సుమారు 30 మంది యాత్రికులు గాయాలు పాలయ్యారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లలో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేషనల్ హైవే సిబ్బంది ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ… క్రేన్ సహాయంతో వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం అనుపూర్ జిల్లాకు చెందిన సుమారు 150 మంది యాత్రికులు రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులలో పూరి దర్శనం చేసుకుని అనంతరం అన్నవరం సత్యన్నారాయణస్వామి దర్శనానికి వెళుతుండగా రోడ్ ప్రమాదం సంబవించింది. పలాస మండలం మొగిలిపాడు గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న కాశీబుగ్గ పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


