కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఐనవోలు మల్లన్నస్వామికి పేరుంది. సంక్రాంతి నుంచి ఉగాది వరకు మూడు నెలలపాటు స్వామివారి బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండమైన రీతిలో నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. అయితే, ఈ ఏడాది మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర జరగనుండడంతో..ఈ బ్రహ్మోత్సవాలు మరింత ప్రాధాన్యం సంత రించుకోనున్నాయి. అసంఖ్యాకంగా తరలివచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.
శతాబ్దాల నాటి శివాలయంలో నెలల తరబడి మహోత్సవాలు నిర్వహించడం అంటే అదేమైనా సామాన్య విష యమా..అంటే అస్సలు కాదనే ఎవరైనా సమాధానం ఇస్తారు. అంతటి అనన్య సామాన్య వేడుకలు అసాధారణ రీతిలో జరిగినప్పుడు భక్తజనవరద ఏ స్థాయిలో ప్రవహిస్తుందో ప్రత్యేకించి చెప్పేదేముంది. అతి ప్రాచీన ఐనవోలు శ్రీ మల్లికా ర్జునస్వామి దేవాలయం బ్రహ్మోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. క్రాంతివంత సంక్రాంతి పండువ నుంచి ప్రకృతి సొబగుల ఉగాది వరకు ఈ వేడుకలు అట్టహాసంగా సాగనున్నాయి. ఎత్తు బోనాలు, శివసత్తుల పూనకాలు, సంక్రాంతి ప్రభల బండ్ల ఊరేగింపులు..ఓహ్ ఒకటేమిటి..ఆధ్యాత్మిక సంబరాలమయంగా ఈ వేడుకలు సాగనున్నాయి.
కనువిందు చేసే ప్రకృతి రమణీయ ప్రదేశంలో నెలకొని వున్న ఈ ప్రాచీన ఆలయంలో అద్భుత శిల్ప సంపద దర్శ నమిస్తుంది. సువిశాల ఆలయ ప్రాంగణంలో స్వామివారి బ్రహ్మోత్స వాలు మూడు నెలలపాటు బ్రహ్మాండ రీతిలో కొన సాగడం ఆనవాయితీ. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్ ఘడ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ వేడుకకు తరలి వస్తారు. అయితే ఇటీవల కాలంలో.. స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి విశ్వం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లు తున్న హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర వుంది. జానపదుల జాతరగా పేరొందిన ఐనవోలు మల్లన్న జాతర ఉత్తర తెలంగాణవాసులకు ఎంతో ప్రత్యేకం. సుందరంగా అలంకరించిన స్వాగత తోరణాలు భక్తులకు సాదర ఆహ్వానం పలుకుతున్నాయి.
దేవాలయ విశిష్టతను, బ్రహ్మోత్సవ వేడుకల వివరాలను ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయ ప్రధాన అర్చక స్వామి పాతర్లపాటి రవీందర్ శర్మ వివరించారు. ఈ నెల 13 న స్వామివారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడుతున్నామని ఆయన తెలిపారు. 14న భోగి, 15న సంక్రాంతి వేడుకలతో పాటు సంక్రాంతి ప్రభల బండ్ల ఊరేగింపు కన్నుల పండువగా కొనసాగు తుందని చెప్పారు. జనవరి 16న మహాసంప్రోక్షణ, 17న రేణుకా ఎల్లమ్మతల్లి జాతర వేడుక జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా, ఫిబ్రవరి 2న భ్రమరాంబిక అమ్మవారి వార్షిక మహోత్సవ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇక మార్చి 9 నుంచి 13 వరకు శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా జరుగుతా యన్నారు. ఏప్రిల్ 13న ఉగాది కార్యక్ర మాలతో ఈ బ్రహ్మోత్సవ వేడుకలు ముగుస్తాయని తెలిపారు.
స్వామివారి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు రావడం సహజం. అయితే ఈ ఏడాది గిరిజన ఆదివాసి కుంభ మేళా మేడారం జాతర వుండడంతో..లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. అసంఖ్యాకంగా తరలివచ్చే భక్తులను దృష్టిలో వుంచుకుని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వ రరావు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేశామని, వీఐపీల ప్రత్యేక దర్శనాలవల్ల సామాన్య భక్తుల క్యూ లైన్లు ఆపుచేయడం సాధారణంగా జరిగేదని, అయితే, సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడం వల్ల..అటు విఐపీ దర్శనాలు, ఇటు సామాన్య భక్తుల దర్శనాలు ఒకే సమయంలో జరిగిపోతాయని ఆయన తెలిపారు. అన్నివేళాల తాగునీటి సౌకర్యం కల్పించామని ఈవో చెప్పారు. ఎప్పటికప్పుడు మంచినీటి సరఫరా కోసం పది ట్రాక్టర్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు సేదతీరడానికి పెద్ద ఎత్తున చలువ పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. పారి శుద్ధ్య చర్యలు, శౌచాలయాల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని ఈవో చెప్పారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టడానికి దాదాపు 350 పారిశుద్ధ్య కార్మికులను సిద్ధం చేసినట్టు చెప్పారు. అన్నిశాఖల సమన్వయం తో…స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్నిచర్యలు చేపట్టామని ఆలయ ఈవో తెలియజేశారు. ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.