కోట్లాది మంది భారతీయుల కల నెరవేరే క్షణం సమీపిస్తోంది మరో వారం రోజుల్లో అయోధ్య శ్రీరామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 22 న ప్రాణ ప్రతిష్ఠకు ముందే అయోధ్యలో పలు యజ్ఞాలు, హోమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అత్యాధునిక హంగులతో నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ను ఇప్పటికే ప్రధాని మోదీ ప్రారంభించారు. రామాలయం ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు ఇప్పటికే, దేశ విదేశాలనుంచి ముఖ్య అతిథులు, సాధువులు, సంత్ లు తరలి వస్తున్నారు. ఇక భవ్యమందిర ప్రారంభమే తరువాయి.
అయోధ్య అంతా.. రామమయం. సరయూ నదీ తీరం నుంచి మొత్తం అయోధ్య నగరమంతా రామోత్సవం కోసం సిద్ధమైంది. ప్రతివీధి, ప్రతి గడప భవ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకోసం వచ్చే అతిథులకు స్వాగతం పలుకుతోంది. ప్రతి వాకిట్లోనూ పెద్దపెద్ద ముగ్గులు పెట్టారు. నగరం అంతా పెద్ద పెద్దపందిళ్లు వేశారు. మందిర ప్రారం భానికి వచ్చే లక్షలాది మందికి భోజన, మంచినీటి సౌకర్యం కోసం అప్పుడే ఏర్పాట్లు చేశారు. నగరంలో అన్ని ముఖ్య ప్రాంతాలను విద్యుత్ దీపాలతో ధగధగలాడుతున్నాయి. ఎటుచూసినా రాముడి బొమ్మలే.. ప్రతి గోడ పైనా రామాయణ చిత్తర్వులే. అణువణువూ..రామ దర్శనమే.
అయోధ్య … భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన పుణ్యప్రదేశం. ఒకప్పుడుసాకేత పురం. అయోధ్య నగరం 250 చదరపు కిలోమీటర్ల విస్థీర్ణంలో ఉండేదని రామాయణంలో పేర్కొన్నారు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ లోని ఈ అయోధ్య సూర్యవంశ చక్రవర్తులు పాలించిన ప్రదేశం. కోశల రాజ్యానికి రాజధాని. మహా వీరుడు దశరథుడు రాజ్యం ఏలిన ప్రదేశం. రామాయణం దాదాపు 9 వేల ఏళ్లనాడు జరిగిన వాస్తవం. హిందువుల మనసు పులకించే పుణ్య నగరాల్లో అయోధ్య ఒకటి.
ఒకప్పుడు హిందువులపట్టుకొమ్మ అయిన అయోధ్య వేలాది ఏళ్లలో ఎన్నో చారిత్రక ఘటనలకు సాక్షిగా నిలిచింది. బౌద్ధం, జైనం, ఇస్లాం వంటి మతాల మధ్య మారుతూ వచ్చింది. జైన మత గురువులైన పంచ తీర్థంకరులు ఇక్కడ జన్మించారంటారు. మొదటి తీర్థంకరుడైన ఆదినాథ్, రెండో తీర్థంకర్ అజిత్నాథ్, నాల్గో తీర్థంకర్ అభినందనాథ్, ఐదో తీర్థంకర్ సుమతీ నాథ్, 14వ తీర్థంకర్ అనంతనాథ్.. ఇక్కడే జన్మించి జైన మతాన్ని ఉద్ధరించారు. అవధ్ నవాబు నిర్మించిన హనుమాన్ మర్ఙి ఇప్పటికీ పూజలందుకుంటోంది. అయోధ్యలో ఒకప్పుడు బౌద్ధమతం ప్రవిఢవిల్లింది. మౌర్య చక్రవర్తులు నిర్మించిన బౌద్దాలయాలు, స్మారక చిహ్నాలు, ఇప్పటికీ అయోధ్యలో దర్శనం ఇస్తాయి. ఎన్నిమతాలు వచ్చినా అయోధ్యలో శ్రీరామ మందిరం హిందువుల ఆరాధనా స్థలంగా ఉంది.
15 వ శతాబ్దిలో మొగల్ తొలి చక్రవర్తి బాబర్ అయోధ్యలో రామమందిరాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించారనే వాదన ఉంది. కొన్ని వందల ఏళ్లుగా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా బాబ్రి మసీదు – రామమందిరం వివాదం నడుస్తోం ది. వివాదం కోర్టు కెక్కింది. 1984లో విశ్వహిందూ పరిషత్ ఈ ప్రాంతంలో రామాలయం నిర్మించేందుకు మసీదుస్థలం స్వాధీనం కోసం ఉద్యమించింది. 1992 లో జరిగిన పరిణామాల్లో బాబ్రి మసీదు కూలిపోయింది. అనంతరం భారత ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. 2003 లో పురావస్తు సర్వే సంస్థ అక్కడ బాబ్రి మసీదుకు నిర్మాణానికి పూర్వం రామ మందిరం ఉన్నదని నిర్థారించింది. 209 నవంబర్ 9 న సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇస్తూ వివాదాస్పద స్థలాన్ని అంటే 2.77 ఎకరాలను అయోధ్య ట్రస్ట్ కు అప్పగించాలని, ప్రత్యామ్నాయంగా ముస్లింలకు 5 ఎకరాల స్థలం మరో చోట కేటాయించాలని తీర్పు నిచ్చింది. దీంతో .. శ్రీ రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఏర్పడి శ్రీ రామ భవ్య మందిరాన్ని నిర్మించింది.
వివాదాస్పద కట్టడం కూల్చివేసిన 32 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది. అయోధ్య రామ మందిరం నిర్మాణంలో ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ దేశ విదేశాల్లో రామ భక్తుల నుంచి విరాళాలు సేకరించి అద్భుత మందిరాన్ని నిర్మించింది. దేశంలో అన్ని ప్రాంతాల్లోని రామభక్తులు మందిర నిర్మాణంలో సహకరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ వల్ల మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అపూర్వ రీతిలో రైల్వేస్టేషన్ నిర్మాణం పూర్తయింది. వంద చార్టెడ్ విమానాల పార్కింగ్ కోసం వారణాశి, ప్రయాగ్ రాజ్, లక్నో ఎయిర్ పోర్ట్ లను సిద్ధంచేశారు. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కోసం తరలివచ్చే లక్షలాది మందికి సకల సౌకర్యాలు, కల్పిస్తున్నారు. పలు చోట్ల పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. రామ్ కీ పైడి, ధరంపథ్ , తులసీ ఉద్యాన్, సాకేత్ కాలేజీ, సర్క్యూట్ హౌస్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడి హోటళ్లు ఇప్పటికే బుక్ అయి పోయాయి. అయోధ్య మందిర ప్రారంభ కార్యక్రమానికి దేశం అంతా సిద్ధమైంది. పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లలో భక్తులు తరలివస్తున్నారు. జనవరి 22 న ప్రాణ ప్రతిష్ఠ పూర్తయితే.. కోట్లాది రామ భక్తులకు అయోధ్య మరో మహోన్నత తీర్థ స్థలి కాగలదు.


