వ్యర్థాలను అర్థవంతంగా తీర్చిదిద్ది నూతన అర్థం కల్పిస్తున్నాడు. రీసైక్లింగ్ ఆర్ట్ లో పనికిరాని వస్తువులను కళా కృతులుగా రూపొందిస్తున్నాడు. పర్యావరణానికి చేటు చేసే వస్తువులను ప్రజోపయోగ వస్తువులుగా మార్చి ప్రకృతి పరిర క్షకుడిగా పేరు పొందాడు. ప్లాస్టిక్ , ఇతర వ్యర్థాలతో అద్భుత కళాకృతులు రూపొందిస్తున్న నందిగామ జిల్లాకు చెందిన ఫణీంద్ర కుమార్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
కృషి, పట్టుదల, సంకల్పబలం ఉంటే సాధించలేనిది ఏది ఉండదు. అయితే, ఎందుకు పనికి రాని వస్తువులు, పర్యావరణానికి చేటు కల్గిస్తున్న వ్యర్థాలను రీసైక్లింగ్ ఆర్ట్ కళాకారుడు ఫణీంద్ర కుమార్ అందమైన కళాకృతులుగా మారుస్తున్నాడు. నందిగామ జిల్లా బనగానపల్లె మండలం పసుపులకు చెందిన ఫణీంద్ర కుమార్, ఇప్పటికే ఎన్నో కళా అద్భుతాలు సృష్టించి శభాష్ అనిపించుకున్నాడు.గ్రామానికి ఐతా నాగరాజు , సుభాషిని దంపతుల కుమారుడు ఐతా ఫణీంద్ర కుమార్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. రీసైక్లింగ్ ఆర్ట్ విద్యలో ఆరితేరాడు. ఖాళీ సిగరెట్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ బాటిల్స్ , ఫ్యాబ్రిక్స్ తదితర వ్యర్థాలతో పలు రకాల ఆకృతులను రూపొందించాడు.
ఖాళీ సిగెరెట్ ప్యాకెట్లతో ఏడు అడుగుల ఏడు ఇంచులు ఉండే ఒంటె ఆకృతి బొమ్మను రూపొందించాడు. 2021 డిసెంబర్ నెలలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ ఈ కళారూపానికి ప్రశంసలు అందజేసింది. ఫణీంద్ర కుమార్ కు అవార్డు, మెడల్ , సర్టిఫికెట్ అందజేసింది. 2022 జనవరిలో ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్ , ఇదే ఏడాది ఫిబ్రవరి నెలలో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు ఫణీంద్ర కుమార్ ప్రతిభను గుర్తించి అవార్డులు , మెడల్స్ అందజేశారు.
2023 డిసెంబర్ 29న పంజాబ్ అమృత్ సర్ లోని గురునానక్ ఆడిటోరియం లో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ అవార్డ్స్ షో జరిగింది. ఈ ప్రదర్శనలో ఫణీంద్ర కుమార్ ను షో నిర్వాహకులు ప్రత్యేకంగా సన్మానించి అవార్డు, మెడల్ ను అందజేశారు. పనికిరాని వస్తువులను, ప్లాస్టిక్ వ్యర్థాలను అందమైన కళాకృతులుగా మార్చి ఫణీంద్ర కుమార్ అందరి అభినందనలకు పాత్రుడయ్యాడని షో నిర్వాహకులు కొనియాడారు. తనకు సర్కారు, కళాభిలాషులు ప్రోత్సాహమిచ్చి సహాయ, సహకారాలు అందిస్తే.. రీసైక్లింగ్ ఆర్ట్ లో మరిన్నిమిరాకిల్స్ సృష్టిస్తానని ఫణీంద్ర కుమార్ తెలియజేస్తున్నాడు.
నిరుపేద ఆర్య వైశ్య కుటుంబంలో జన్మించిన ఫణీంద్ర కుమార్ చిన్నతనంలోనే తండ్రి ని కోల్పోయారు. ఆర్థిక కష్టాల తో పూట గడవడమే గగనంగా మారిన పరిస్థితులున్నా, ఏ మాత్రం దిగాలు పడకుండా, పట్టుదలగా, మనోధైర్యం తో అటు డిగ్రీ చదువు కొనసాగించాడు, ఇటు రీసైక్లింగ్ ఆర్ట్ పై దృష్టి పెట్టాడు. తమ బనగానపల్లె మండలవాసికి ఇన్ని అవార్డులు రావడం తమకెంతో సంతోషంగా ఉందని, భవిష్యత్ లో మరిన్ని అద్భుత కళాకృతులు చేసి… ఫణీంద్ర కుమార్ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని బనగానపల్లె ప్రజలు ఆకాంక్షించారు.