రిజర్వేషన్ల కోటా నుంచి అడ్వాన్స్డ్ సబ్ కులాలను ఎందుకు మినహాయించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నించింది. రిజర్వేషన్ల ఫలాలు అందని వారిని దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్డ్ కులాల కేటగిరిలోని ఉపకులాలను రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరించ వచ్చా అనే అంశాన్ని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పరిశీలి స్తోంది.
ఇప్పటికే అభివృద్ధి చెందిన కొన్ని వెనుకబడిన తరగతుల్లోని ఉపకులాలను రిజర్వేషన్ల జాబితా నుంచి ఎందుకు మినహాయించకూడదని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశా లను పరిశీలిస్తోంది.ముఖ్యంగా 2020లో ఐదుగురు జడ్జీల ధర్మాసనం తమ పరిశీలనకు నివేదించిన అంశాలను ఈ రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తోంది. ఉప వర్గీకరణకు అనుమతి లేదని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ఈ విస్తృత ధర్మాసనం అభిప్రాయపడింది.
సంపన్న ఉపకులాలు జనరల్ కేటగిరీతో ఎందుకు పోటీ పడకూడదని ధర్మాసనంలో జస్టిస్ విక్రమ్ నాథ్ ఫిబ్రవరి 6న ప్రశ్నించారు. రిజర్వేషన్ల ఫలాలు అవసరమైన మరీ వెనుకబడిన ఉపకులాలకు మరింత ప్రాధాన్యమివ్వాలని జస్టిస్ నాథ్ అన్నారు. ఉపకులాల్లో కొన్ని మెరుగ్గా రాణించి, ఎంతో అభివృద్ధితో ముందుకు సాగాయి. వారు రిజర్వేషన్ల నుంచి బయటకు వచ్చి జనరల్ కేటగిరీతో ఎందుకు పోటీ పడకూడదు.. ఆ వర్గాలను ఎందుకు రిజర్వేషన్ల నుంచి మినహా యించకూడదని జస్టిస్ విక్రమ్ నాథ్ ప్రశ్నించారు. ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ డివై చంద్ర చూడ్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ విక్రమ్ నాథ్ ఉన్నారు.


