తెలంగాణలో కారు, కమలం దోస్తీ కడుతున్నాయా..? వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే బరిలో నిలు స్తాయా..? అందుకేనా ఈ మధ్య బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తగ్గింది. మరి ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే… క్యాడర్ మాటేంటి… వారు సహకరిస్తారా లేక మూడో పార్టీ అయిన కాంగ్రెస్ వైపు చూస్తారా..?
తెలంగాణలో మళ్లీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..? నిన్నటి వరకు తిట్టుకున్నవారే త్వరలో చేతులు కలపబోతున్నారా..? అంటే విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఇంతకాలం బద్ధ శత్రువుల్లా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకా శాలు కనిపిస్తున్నాయంటున్నారు. రెండు పార్టీల పొత్తుపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అంతేకాదు గులాబీ బాస్ కేసీఆర్ ఏకంగా పార్టీ నేతలకు ఈ మేరకు హింట్ కూడా ఇచ్చేశా రని టాక్ వినిపిస్తోంది. ఇటీవల కీలక నేతలతో జరిగిన ఓ సమావేశంలో కేసీఆర్ కమల నాథులతో పొత్తు అంశాన్ని ప్రస్తావించారని.. అయితే దీనిపై నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని సమా చారం. కాషాయదళంతో పొత్తు పెట్టుకుంటే మైనార్టీ ఓట్లు చేజారుతాయని కొందరు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ మరికొందరు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన ఆప్షన్ అని కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థించినట్లు తెలుస్తోంది.
బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుపై అసెంబ్లీ లాబీల్లో కూడా ఈ మధ్య జోరుగానే చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిణా మాలు చూస్తుంటే కమలనాథులతో పొత్తు ఉంటుందేమో అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అనడం విశేషం. మరికొద్ది రోజుల్లోనే ఈ రెండు పార్టీ మధ్య పొత్తు అంశంపై క్లారిటీ వచ్చే అవకాశా లున్నాయని రాజకీయ వర్గాల టాక్. మరోవైపు.. పార్టీలోని కొందరు కీలక నేతలు మాత్రం ఈ అంశాన్ని కొట్టి పారేస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే పరిస్థితే ఉంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారంటూ బండి సంజయ్ ఎందుకు కామెంట్స్ చేస్తారంటూ లాజిక్ బయటకు తీశారు.. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. అయితే ఓ వైపు ఇలా పొత్తు అంశాన్ని కొట్టి పారేస్తూనే తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇస్తూ ఒకవేళ పొత్తు ఉన్నా… మల్కాజ్‌గిరి టికెట్ మాత్రం తమదే అంటూ చెప్పుకొచ్చారు.
మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టాలంటే.. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కువ సీట్లు గెలవకుండా చూడాలన్నది బీఆర్ఎస్, బీజేపీల ఉమ్మడి వ్యూహం. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పార్టీని కాదన్న ఓటర్లు ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలు తక్కువనే చెప్పాలి. మరోవైపు బీజేపీకి మోడీ చరిష్మా మెండుగా ఉన్నా… అనేక చోట్ల పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులే లేని పరిస్థితి. ఈ నేపథ్యం లో ఈ రెండు పార్టీలు కలిస్తే.. ఈ బలహీనత లు చాలా వరకు కవర్ అవుతాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. బీజేపీ బలంగా ఉన్న ఆరేడు స్థానాలను వదిలేస్తే మిగతా చోట్ల మోదీ చరిష్మా, తమకున్న సంస్థాగత బలంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే యోచనలో గులాబీ నేతలు ఉన్నట్లు కనిపిస్తోంది. నిజానికి బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తుల అంశం ఇప్పటిది కాదనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈ రెండు పార్టీలు మిలా ఖత్ అయ్యాయని అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని ప్రధాన ప్రచా రాస్త్రంగా చేసుకుని ఎన్నికలకు వెళ్లింది. బీజేపీలో జరిగిన అనేక పరిణామాలను దీనికి ఉదాహరణగా చూపారు. ఇందులో నిజమే ఉందో, లేక కాకతాళీయంగా అలా జరిగిందో తెలియదు గానీ… ప్రజలైతే ఈ ప్రచారాన్ని కొంతవరకు నమ్మారు. అందుకు తగ్గట్లుగానే ఫలితాలు కూడా రావడం మనందరం చూసిందే. ఇక ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు ముందు మరోసారి ఈ రెండు పార్టీ మధ్య దోస్తీ అంశం తెరపైకి వచ్చింది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో.. కారు, కమలం కలిసి బరిలోకి దిగేది ఎంత వరకు వాస్తవమో త్వరలోనే తేలిపోనుంది.


