ప్రపంచంలో ప్రతిదీ నకిలీ మయం అయిపోతోంది. ఒకప్పుడు ఏ మందు మాపు లేకుండా వందేళ్లకు పైచిలుకు జీవనం సాగించే మనిషి..ఇప్పుడు అవే మందులపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. అయితే ఇదే అదునుగా చేసుకున్న కొందరు ప్రబుద్ధులు నకిలీ మందులను తయారు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కాఫ్ సిరప్ నుంచి క్యాన్సర్ రోగులకు వాడే ఇంజెక్షన్ వరకు ప్రతీదీ నకిలీయే. ఏకంగా క్యాన్సర్ మందులనే మార్కెట్‌లో దర్జాగా చలామణి చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్న డ్రగ్ మాఫియా…
మంగళ బుధవారాల్లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చెర్లపల్లిలోని ఇండియన్ జెనోమిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా కంపెనీ పై డిసీఏ బృందం దాడులు చేసి కీమోథెరపీ డ్రగ్ నిల్వలను స్వాధీనం చేసుకుంది. ఈ ఫార్మా కంపెనీ క్యాన్సర్ నిరోధక ఔషధాన్ని తయారు చేయడానికి చట్టపరమైన లైసెన్స్ కలిగిలేదు. క్యాన్సర్ నిరోధక ఔషధం ‘సైక్లోఫాస్ఫమైడ్ ఇంజెక్షన్’ను చట్టవిరుద్ధంగా తయారు చేస్తోందని యాంటీబయాటిక్ ఇంజెక్షన్‌లతో కలిపి సైటోటాక్సిక్ యాంటీ క్యాన్సర్ మందులను తయారు చేస్తోందని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. వీటిని వినియోగించడం వల్ల క్యాన్సర్ రోగులలో తీవ్రమైన దుష్ప్రభావాలకు గురవుతారు .సైటోటాక్సిక్ యాంటీ-క్యాన్సర్ డ్రగ్ ‘సైక్లోఫాస్ఫమైడ్ ఇంజెక్షన్’ క్యాన్సర్ రోగులలో కీమోథెరపీ కోసం ఉపయోగిస్తారు.
ఈ ఇంజక్షన్ వాడకంతో మనిషి డిఎన్ఏ దెబ్బతినే అవకాశం ఉందని , రోగులలో తీవ్రమైన అనారోగ్య లక్షణాలు ఏర్పడుతాయని తెలిపారు .డీసీఏ అధికారులు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఉత్పత్తి ప్రాంతంలో యాంటీకాన్సర్ డ్రగ్ సైక్లోఫాస్ఫమైడ్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియంట్ మూడు అల్యూమినియం డబ్బాలను గుర్తించారు. ఏపీఐ డబ్బాలపై లేబుల్స్ లో బీఓ-కెమ్ ప్రైవేట్ లిమిటెడ్, బోయిసర్, పాల్ఘర్, మహారాష్ట్రలో తయారీ చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ దాడిలో, డైరెక్టర్, ఇండియన్ జెనోమిక్స్ ప్రై.లి. ఎం. అనిల్ కుమార్ తెలిపిన యాంటీకాన్సర్ ఏపీఐ డబ్బాలను ఎస్పీఅక్యూర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు క్యాన్సర్ నిరోధక ఔషధానికి సంబంధించి డీసీఏ డెలివరీ చలాన్ స్లిప్స్ ఇన్ వాయిస్‌లతో పాటు క్యాన్సర్ నిరోధక మందు సైక్లోఫాస్ఫామైడ్ నిల్వలను శాంపిల్స్ ని కలెక్ట్ చేసి ల్యాబ్ కి పంపించారు . ఇంజక్షన్లు మందులు స్వాధీనం చేసుకుని కంపెనీ డైరెక్టర్ అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఒకప్పుడు వందేళ్లు వందకు పైచిలుకు మనిషి జీవించేవాడు ఇప్పుడు ప్రాణాలను కాపాడే మందులే మనిషి జీవితకాలాన్ని శాసించే స్థాయికి నకిలీ మందులు తయారు చేస్తున్నారు.


