బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో ఏం చర్చించారు…? కార్యకర్తలు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారా…? నియోజకవర్గాల వారీగా సమీక్షల తర్వాత పార్టీ ప్రక్షాళనకు గులాబీ పార్టీ సిద్ధం అయిందా…?
తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ అలెర్ట్ అయింది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టు కుని తెలంగాణ భవన్ వేదికగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలను నిర్వహించింది. జనవరి 3న మొదలైన సమీక్ష 22 వరకు నిర్వహించారు. ఈ సమావేశాలను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు, సీనియర్ నేతల పర్యవేక్షించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సమీక్షతో ప్రారంభమైన సమావేశాలు చివరికి నల్గొండ పార్లమెంట్ సమీక్ష తో మగిశాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. పార్టీ శ్రేణుల్లో మనో ధైర్యం నింపేందుకు పార్లమెంట్ నియోజకవర్గాలవారీ సమక్షా సమావేశాలు ఉపయోగపడ్డాయి. రెండుమూడు నెలల్లో లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పార్టీకి ఉన్న తొమ్మిది సిట్టింగ్ ఎంపీ స్థానాలను నిలబెట్టుకోవడమే సవా ల్ గా మారింది. రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఎదుర్కొని పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలవా ల్సి ఉంది. అధికారం కోల్పోయి నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులను పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా అధినాయకత్వం ఈ సమీక్షలను నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ముఖ్యంగా పార్టీ అధికారంలో వున్నప్పుడు పదేళ్ళలో క్యాడర్ ను పూర్తిగా విస్మరించారనే అంశం పార్టీ అధిష్టానం దృష్టికి చేరింది. బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పధకాలను పార్టీ కార్యకర్తలకు సంబంధం లేకుండా నేరుగా లబ్దిదారులకు ఇవ్వడం వల్ల పార్టీకి ప్రజల్లో మైలేజీ రాలేదని అభిప్రాయాన్ని అగ్రనేతల ముందే కార్యకర్తలు స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్, కేటీఆర్ ఇతర నేతలు కేడర్ కు దూరమయ్యారు. వారిని కలవా లంటేనే గగనమైంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పదేళ్లల్లో ప్రజలను కలవకపోవడం కూడా పార్టీ ఓటమికి దారి తీసిందని కార్యకర్తలు వ్యాఖ్యానించారు. పార్టీకి క్షేత్రస్థాయిలో నిర్మాణం, కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మకమైన క్యాడర్ లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. మరో వైపు ఎమ్మె ల్యే కేంద్రంగా నియోజకవర్గాల్లో పార్టీని నడపడం ద్వారా ఆయా ఎమ్మెల్యేలు తన అనుచరులనే ప్రోత్సహించడం ద్వారా క్యాడర్ ను దూరం పెట్టారనే భావన ఉంది.ఇక పార్లమెంట్ సమీక్ష సమావేశాల్లో కార్యకర్తల ఫీడ్ బ్యాక్ ను బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎప్పటికప్పుడు అందచేస్తున్నారు. 16 రోజులు నిర్వహించిన సమావేశాల్లో కార్యకర్తల అభిప్రాయా లు విన్న గులాబీ అధిష్టానం ఇకనైనా కార్యకర్తలకు పెద్దపీట వేస్తుందా.. లేదా అనే చర్చ గులాబీ వర్గాల్లో నడుస్తోంది.
తెలంగాణ ఉద్యమ స్పూర్తితో ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీ పేరును బిఆర్ఎస్ గా పేరుమార్చడం ఎన్నికల్లో కన్ఫ్యూజన్ కు దారి తీసిందనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. తెలంగాణ ఉద్యమ కారులకు న్యాయం జరగలేదని కార్యకర్తలు చెప్పారు. కార్యకర్తల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాము అధికారంలో వున్నప్పు డు చేసిన తప్పులను ఒప్పుకున్నారు. పార్టీ నిర్మాణంపై దృష్టి సారించలేకపోయామన్నారు. ఇక నుండి రెగ్యులర్ గా పార్టీ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని కేటీఆర్ అన్నారు. కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇక నుండి పార్టీ కేంద్రంగానే నేతలు పని చేయాల్సి వుంటుందని కార్యకర్తలకు చెప్పారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.పార్లమెంట్ సమీక్ష సమావేశాలు ముగిశాయి. ఫిబ్రవరి మొదటి వారం నుండి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలకు బిఆర్ఎస్ సిద్ధమవుతోంది.కేటీఆర్, హరీష్ రావులతో పాటు, సీనియర్లతో కమిటీని ఏర్పాటు చేసి ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోనే సమీక్ష నిర్వహిస్తారు. ఇక రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి గులాబీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.


