పార్లమెంటు ఎన్నికలు బీఆర్ఎస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. వరుసగా రెండుసార్లు రాష్ట్రంలో అధికారం చేపట్టిన గులాబీ పార్టీ హ్యాట్రిక్ విజయంపై ప్రజలు నీళ్లు చల్లారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ మొన్నటి శాసన సభ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరో మూడు నెలల్లో ఎంపీ ఎన్నికలు జరగనున్నాయన్న ప్రచారం సాగుతోంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మెజార్టీ సీట్లు సాధించాలన్నదే ఇప్పుడు గులాబీ పార్టీ ముందున్న ఏకైక లక్ష్యం.
శాసనసభ ఎన్నికల్లో ఎదురైన పరాజయం మర్చిపోవాలంటే తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు సాధించడమే ఏకైక మార్గమని చెబుతోంది బీఆర్ఎస్. ఇందుకోసం సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే పార్లమెంటు నియో జకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంతవరకు బాగానే ఉన్నా లోక్‌సభ ఎన్నికల కోసం నిర్వహిస్తున్న సమీక్షల సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో కలకలం రేపుతు న్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థుల్లో కొందర్ని మార్చి ఉంటే బాగుండేది అంటూ కామెంట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అదే సమయంలో శాసనసభ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతం కానీయమంటూ చెప్పుకొచ్చారు.
కేటీఆర్ వ్యాఖ్యల్ని విశ్లేషిస్తే.. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పలువురు సిట్టింగ్‌లకు ఈసారి సీట్లు దొరకడం కష్ట మేనని ఆయన చెప్పకనే చెప్పారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో విన్పిస్తోంది. నిజానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడిలా ఆలోచించడం వెనుక పెద్ద కారణమే ఉంది. మొన్నటి ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమి తర్వాత మేధావులు, రాజకీయ విశ్లేషకులు బీఆర్ఎస్ ఓటమికి చెప్పిన కారణాల్లో ప్రధానమైంది. అభ్యర్థులను మార్చకపోవడం. పలువురు సిట్టింగ్‌లపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసినా బీఆర్ఎస్అధిష్టానం మళ్లీ దాదాపుగా పాతవాళ్లకే పట్టం కట్టింది. ఇదే శాపంగా మారిందన్న వాదన బలంగా విన్పించింది. అయితే 12 నియోజకవర్గాల్లో వివిధ కారణాలతో ఇతర నేతలను బరిలో దింపగా వారిలో 9 మంది గెలవడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాట్లకు తావీయవద్దని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న టాక్ వినిపిస్తోంది. మరిప్పుడు బీఆర్ఎస్ తరఫున ఎంపీ అభ్యర్థులుగా సిట్టిం గ్‌లలో ఎంత మంది ఉంటారు? ఇంకెంత మందిని మారుస్తారు అన్నదానిపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. అప్పటి వరకు ఆయా నేతల్లో మాత్రం టెన్షన్ విపరీతంగా పెరిగిపోతోంది.