కీలక తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు
వెయ్యి నోట్లు, 500 నోట్లను రద్దు చేస్తూ 2016 లో నిర్ణయం వెలువడింది. అకస్మాత్ గా ప్రధానమంత్రి ప్రజల ముందుకు వచ్చి ఈ సంగతి చల్లగా చెప్పేశారు. ముందుగా ప్రజలకు అర్థం కాలేదు కానీ, తర్వాత వారం, పది రోజుల పాటు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. డబ్బులు మార్చుకోవటం కోసం బ్యాంకుల దగ్గర క్యూలు కట్టాల్సి వచ్చింది. బ్లాక్ మనీ, టెర్రర్ ఫండింగ్, దొంగ నోట్ల వ్యవస్థను అడ్డు కట్ట వేసేందుకు దీనిని ఉద్దేశించినట్లు అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పారు. దీంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న వారికి పెద్ద నోట్ల ద్వారానే డబ్బుని ఎరవేస్తున్నట్లు గుర్తించారు. ఇటువంటి పోకడలకు అడ్డు కట్ట పడతాయని చెప్పటం జరిగింది.
తర్వాత కాలంలో కరోనా విరుచుకు పడటం, పెద్ద నోట్లు లేక పోవటంతో డిజిటల్ లావాదేవీలు ఊపందుకొన్నాయి. ఆన్ లైన్ బ్యాంకింగ్ , క్రెడిట్ కార్డు చెల్లింపులతో పాటు గూగుల్ పే ఫోన్ పే వంటి లావాదేవీలు బాగా విస్తరించాయి. ఈ క్రమంలో పెద్ద నోట్ల రద్దు తో ఏర్పడిన సమస్యలు, ఇబ్బందులు క్రమంగా మరుగున పడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే దేశంలో అట్టడుగు స్థాయి వరకు డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ చేరుకొంది. అటు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల చెల్లింపులు కూడా లబ్దిదారులకు నేరుగా అందుతున్నాయి.
కానీ పెద్ద నోట్ల రద్దు కి వ్యతిరేకంగా న్యాయస్థానాలలో వివాదం మాత్రం కొనసాగింది. విభిన్న కారణాలతో ఈ రద్దుని వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొన్న భారత సుప్రీంకోర్టు తీర్పు విడుదల చేసింది. పెద్ద నోట్ల రద్దు ని సమర్ధిస్తూ జస్టిస్ ఎన్ ఎ నజీర్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరిగిన తర్వాతే జాగ్రత్తలు తీసుకొన్నాకనే ఈ నిర్ణయం అమలు లోకి వచ్చిందని అభిప్రాయ పడింది.
మొత్తం మీద పెద్ద నోట్ల రద్దు దుమారం ముగిసినట్లే అనుకోవాలి. అప్పట్లో వెయ్యి, 500 నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తర్వాత కాలంలో రెండు వేల నోట్లు, 500 నోట్లను అమలు లోకి తీసుకొచ్చింది.