ఎన్నికలకు ఇంకా సమయం వున్నా..ఏపీలో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. విశాఖ జిల్లా పెందుర్తి నియోజ కవర్గం వైసీపీ టికెట్ కోసం ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నపరెడ్డి అదీప్ రాజ్ ప్రయత్నిస్తున్నారు. అయితే, మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు అనకాపల్లి టికెట్ కాకుండా పెందుర్తి సీటు ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. టీడీపీ నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, జనసేన పార్టీ నుంచి పంచకర్ల రమేష్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పనిచేస్తామని ఇరు పార్టీలు తెలియజేస్తున్నాయి.
పదవి అంటే రాజకీయనాయకులకు పంచ ప్రాణాలు. సామ, దాన, బేధ దండోపాయాల్లో.. ఏ పద్దతిలోనైనా నేతలు పోరాటం సాగించి టికెట్ సాధించుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే, అధిష్ఠానాల ఆలోచనలు… గెలిచే అభ్యర్థులు, పార్టీ గెలుపు, అధికారంలోకి రావడం ఈ రీతిన సాగుతాయి. ఈ నేపథ్యంలో కొందరు సిట్టింగ్ లకు కట్టింగ్ లు వుంటా యి. అర్థ బలం, అంగ బలం, విధేయత, సమర్థత, రాజకీయ చతురత గల కొందరు కొత్తవారు టికెట్లు దక్కించుకోవ చ్చు. ఈ పరిస్థితుల్లో పాత వారికి కోపతాపాలు రావచ్చు. పార్టీలు మారవచ్చు. పార్టీ అధిష్ఠానాలకు ప్రతిబంధకంగా మార వచ్చు. ఈ పరిస్థితులను చాకచక్యంగా సరిదిద్దుకుని, అటు పార్టీ అభ్యర్థుల గెలుపు, ఇటు పార్టీ గెలుపుపై అధిష్ఠానాలు దృష్టి సారిస్తాయి. ఇప్పుడు పెందుర్తి నియోజకవర్గంలో అన్ని పార్టీల అధిష్ఠానాలు ఈ ప్రక్రియే కొనసాగిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించే దిశగా ఏపీలో అధికారపార్టీ వైసీపీ అడుగులు వేస్తోంది. ఇందుకు వైసీపీ అధినేత జగన్ ఎన్నో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో అలకలు, కోపతా పాలు, బుజ్జగిం పులు, నచ్చచెప్పడాలు, కౌన్సెలింగ్ లు వగైరా, వగైరాలు ఎన్నో జరగడం సహజం. ఈ ఘట్టాలు ముగిశాక ..ఫైనల్ నిర్ణయాలు సర్వ సహజమే. సీఎం జగన్, కొందరికి సీట్లు పూర్తిగా నిరాకరిస్తున్నారు. మరికొందరిని ప్రస్తుత స్థానాల నుంచి కొత్త స్థానాలకు పంపుతున్నారు. మరికొన్ని చోట్లు కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జాగ్రీ టౌన్ గా పేరొందిన అనకాపల్లిలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు ఈసారి జగన్ సీటును నిరాకరించారు. అనకాపల్లిలో భరత్ కుమార్ అనే కొత్త అభ్యర్థికి జగన్ సీటును కేటాయించారు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన రెండో జాబితాలో భరత్ కుమార్ పేరు చోటు చేసుకుంది. అమర్ నాథ్ తోపాటు భరత్ కుమార్ సైతం కాపు సామాజికవర్గానికి చెందినవారే.
వైసీపీ అధిష్టానం ఇప్పటివరకు అభ్యర్థుల స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తూ రెండు విడతల్లో జాబితాలను ప్రక టించింది. అయితే ఐటీ, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు మాత్రం ఇంతవరకు సీటు కేటాయించలేదు. గుడివాడ అమర్ నాథ్ ను ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నుంచి కాకుండా పక్కనే ఉన్న పెందుర్తి నియోజకవర్గం నుంచి బరిలోకి దించుతారని అంటున్నారు. ప్రస్తుతం పెందుర్తి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అన్నపురెడ్డి అదీప్ రాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఆయనకు సీటు దక్కదని అంటున్నారు. పెందుర్తిలో అధికంగా వెలమ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గాల ప్రజలే వున్నారు. గతంలో పెందుర్తి ఎమ్మెల్యే బరిలో వున్నవారందరూర ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులే. మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యేగా 2019లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అనకాపల్లి ప్రజలు అమర్నాథ్ పై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తమ నేత గుడివాడ అమర్నాథ్ సీఎంకు ఇష్టమైన వ్యక్తి అని, అమర్ కి ఏదో ఒక నియోజకవర్గంలో టికెట్ గ్యారంటీ వస్తుందని ఆయన అభిమానులు తెలియజేస్తున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడివాడ అమర్ నాథ్ ను ప్రకటించడానికి వైసీపీ అధిష్ఠానం సిద్ధంగా వుందని వార్తలు వస్తున్నాయి. గుడివాడకు పెందుర్తి టికెట్ కేటాయిస్తే.. అదీప్ రాజ్ అనుచరులు అమర్ నాథ్ కు సహకరిస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
మరోవైపు టీడీపీ, జనసేన జతకట్టి 2024 ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో టీడీపీ అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకుంటుందో..? టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, ప్రజారాజ్యం పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల రమేష్ బాబు.. ఈ ఇద్దరూ పెందుర్తి సీట్ రేసులో వున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఇద్దరు.. తమ అధిష్ఠానాల నుంచి ఈ సీటు విషయం లో క్లారిటీ తీసుకున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ టీడీపీలో కీలక నాయకుడు కాగా, మాజీ శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు వైసీపీ నుంచి జనసేనకు జంప్ అయ్యారు. అయితే, ఈ టికెట్ టీడీపీకి దక్కినా, జనసేనకు దక్కినా కలిసి పనిచేసి పెందుర్తి సీట్ దక్కించుకుందామని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నట్టు తెలిసింది.