నేటి నుంచి బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర
త్వరలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో పాదయాత్ర చేయనున్నారు. ముందుగా, వేములవాడ సెగ్మెంట్ పరిధిలోని మేడిపల్లి, బీమారం, కథలాపూర్ మండలాల్లో పర్యటించనున్నారు. తొలి విడతలో ఈ నెల 10 నుంచి 15 వరకు వేములవాడ, సిరిసిల్ల సెగ్మెంట్ల పరిధిలోని 88 గ్రామాల్లో 218 కిలోమీటర్ల మేర యాత్ర ఉండనుంది.. ఈ నెల 20 నుంచి రెండో విడతలో చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్ సెగ్మెంట్లలో కొనసాగించి.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలో ముగింపు సభ నిర్వహించేలా బీజేపీ నాయకులు రూటు మ్యాప్ ఖరారు చేశారు.
రేపటి నుంచి ‘శంఖారావం’ పేరుతో లోకేశ్ ఎన్నికల ప్రచారం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రేపటి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపటి నుంచి ‘శంఖా రావం’ పేరుతో లోకేశ్ మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో పర్యటించేలా ప్రణాళికలు చేశారు టీడీపీ శ్రేణులు. రేపు ఉదయం ఇచ్ఛాపురం నుంచి లోకేశ్ ‘శంఖారావం యాత్ర ప్రారంభం కానుంది. ఇందుకోసం ఆయన ఇవాళ రాత్రికి ఇచ్ఛాపురం చేరుకోనున్నారు. శంఖారావం యాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు టీడీపీ శ్రేణులు. ఈ యాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలతో మమేకం కానున్నారు. ప్రతి రోజు 3 నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలు రూపొందించారు.
నేడు నర్సీపట్నం, పాడేరు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటన
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్‌ను గెలిపించాలనే లక్ష్యంతో ప్రజలతో మమేకమవుతున్నారు APCC చీఫ్ షర్మిల. జిల్లాల్లో పర్యటిస్తూ అధికార పక్షంపై నిప్పులు చెరుగుతున్నారు. నేడు నర్సీపట్నం, పాడేరు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించనున్నారు. ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలో ఆమె రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు పాడేరు నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు షర్మిల.