ఒకప్పుడు చెరువులతో కళకళలాడే భాగ్యనగరం నేడు భూభకాసురుల చేతుల్లో ఆక్రమణలతోఅంతరించిపోయింది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన చెరువుల్ని సైతం శాశించేలా అక్రమార్కులు ఆక్రమణలకు పాల్పడ్డారు, దీంతో చిన్నపాటి వర్షం వచ్చిన నగరం ముంపుకు గురవుతున్న పరిస్థితిలు.ఇదిలా ఉంటే నగరవ్యాప్తంగా ఉన్న చెరువులన్నీ భూబకా సురుల చేతుల్లో ఆక్రమణకు గురవుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. చెరువుల ఆక్రమణలపై మూడు వారాల్లో నివేదిక కావాలని అడ్వకేట్ కమిషనర్లను ఆదేశించింది.
భాగ్యనగరంలో చెరువులు భారీగా ఆక్రమణలకు గురయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి తెలిపింది. ఉమ్మడి హైదరా బాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని చెరువుల శిఖం, ఫుల్ ట్యాంక్ లెవల్ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, సీసీ కెమెరా ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, చుట్టూ కంచె ఏర్పాటు.. తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించేందుకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్, రెవెన్యూ జీపీ శ్రీకాంత్‌రెడ్డిని అడ్వొకేట్ కమిషనర్లుగా హైకోర్టు నియామించింది. రెండు జిల్లాల పరిధిలోని 16 చెరువులను పరిశీలించి మూడు వారాల్లో స్థాయి నివేదికను సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 134 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. ఈ సరస్సుల చుట్టూ 14,061 ఆక్రమణ లుకాగా 30 చెరువుల్లో 85 శాతం ఆగక్రమణకు గురయ్యాయి. దాదాపు 104 చెరువుల్లో 15 శాతం ఆక్రమించేశారు. ప్రభు త్వ నివేదికలో కూకట్పల్లి, కుతుబుల్లాపూర్, సరూర్ నగర్, షేక్‌పేట్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ పరిధిలోని అనేక సరస్సులు ఆక్రమణకు గురయ్యాయి. ఒక్క కూకట్‌పల్లిలో మైసమ్మ చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలోని 148 ఎకరా ల్లో 1500కు పైగా అక్రమ కట్టడాలను గుర్తించారు. ఇక్కడ ఫుల్ ట్యాంక్ లెవల్ చుట్టూ ఆక్రమణల నుండి రక్షించడానికి ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేశారు. బఫర్ జోన్ లో ఏదైనా నిర్మాణం చేపడితే దాన్ని చట్ట విరుద్ధంగా పరిగణిస్తారు. ఈ 134 సరస్సుల చుట్టూ ఫుల్ ట్యాంక్ లెవల్ లలో 8,718 ఆక్రమణ నిర్మాణాలు, బఫర్ జోన్లలో మరో 5,343 నిర్మాణాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. 51 చెరువులు ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా ఉన్నాయని నీటిపారుదల శాఖ తెలిపింది.
కూకట్‌పల్లిలోని మైసమ్మ చెరువులో అత్యధిక ఆక్రమణలు ఉన్నాయి. మైసమ్మ చెరువు-1745, బహదుర్‌పుర మిరాలం చెరువు-1635, జీడిమెట్ల ఫాక్స్ సాగర్-1014, సరూర్‌నగర్ పెద్ద చెరువు- 841, నాచారం పెద్ద చెరువు-719, మల్కాజ్గిరి బండ చెరువు-667, రామంతపూర్ చిన్న చెరువు-555, మల్కాజ్గిరి- సఫిల్‌గూడ నడిమి చెరువు-549, రామంతపూర్ చెరువు-468, మూసాపేట్ కాముని చెరువు-449, మల్కాజ్గిరి ముక్కిడి చెరువు-386, షేక్‌పేట షహతం చెరువు-370, రాయదుర్గంలోని దుర్గం చెరువు-281 ఆక్రమణల్లో అక్రమ నిర్మాణాలు జరిగినట్టుగా నివేదిక ద్వారా తెలు స్తోంది. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు ఆక్రమణల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ గమన సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనిల్ సి దయాకర్ 2007లో హైకోర్టుకు లేఖ రాసింది. ముఖ్యంగా దుర్గం చెరువు, సున్నం చెరువు, పెద్ద చెరువు, ఫిర్జాదిగూడ, దామర చెరువు, దుండిగల్, చిన రాయుని చెరువు, గంగారం పెద్ద చెరువు, మేడికుంట చెరువు, హస్మత్‌పేట, బావురుడ చెరువు ఆక్రమణలకు గురై పూర్తిగా కుంచించుకు పోయాయని పేర్నొన్నారు. ఈ లేఖను న్యాయస్థానం రిట్ పిటిషన్‌గా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. దుర్గం చెరువు, సున్నం చెరువు, ఫిర్జాదిగూడ పెద్ద చెరువు, చినదామర, చినరాయుని, మేడికుంట, నల్లచెరువు, బోయిన్ చెరువు, మద్దెల కుంట, నల్లగండ్ల చెరువు, అంబీర్ చెరువు, గోసాయి కుంట.. 13 నీటి వనరులకు సంబంధించి ఆక్రమణలు, ఎఫ్టీఎల్, కంచె ఏర్పాటు తదితర అంశాలపై నివేదికను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ కోర్టుకు అందజేశారు.
దుర్గం చెరువు చుట్టూ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసినందున కంచె వేయడం సాధ్యం కాదని చెప్పారు. జీహెచ్ఎంసీ కమిషనర్ నివేదికలో మాత్రం కంచె ఏర్పాటు చేసినట్లు ఉండటంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. పరస్పర విరుద్ధంగా స్టేట్మెంట్లు ఉండటంతో అడ్వొకేట్ కమిషనర్ల నియామకం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వీరు చెరువులను పరిశీలించి నివేదిక అందజేస్తారని చెప్పింది. ఇద్దరికీ రూ.25 వేల చొప్పున రెమ్యునరేషన్ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. విచారణకు జీహెచ్ఎంసీ తరఫున జయకృష్ణ, కేంద్రం తరఫున డీఎస్జీ ప్రవీణ్‌కుమార్, రెవెన్యూ తరపున శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. దుర్గం చెరువు చుట్టూ కంచె ఏర్పాటుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవాలని ఏఏజీని ఆదేశించింది హైకోర్టు.హైదరాబాద్‌లో చెరువులను కాపాడేందుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. ‘భవిష్యత్ తరాలు బాగుండాలన్నదే మా అభిమతం. హైకోర్టు పక్కనే ప్రవహించే మూసీ నది దుస్థితినే మనం చూడవచ్చు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి. లేదంటే భవిష్యత్ తరాలు క్షమించవు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే వ్యాఖ్యానించారు. పునరుద్ధరణకు అయ్యే మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని తెలుపుతూ తదుపరి విచారణను ధర్మాసనం మార్చి 11కు వాయిదా వేసింది.


