అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత లోక్సభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ కాంగ్రెస్. ఫిబ్రవరిలో షెడ్యూల్ విడుదలై మార్చిలోనే పోలింగ్ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో పార్టీ పెద్దలు పదునైన వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం పెంచేందుకు గ్రామ గ్రామాన ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పలు కీలక తీర్మాణాలు చేశారు. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీకి అభినందనలు తెలుపుతూ తీర్మానం చేశారు. తెలం గాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో సమన్వయంతో పనిచేసిన మాణిక్ రావు ఠాక్రే అభినం దిస్తూ సమావేశం మరో తీర్మానం ప్రవేశ పెట్టారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేయాలని సమావేశం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది.
మరోవైపు పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం పెంచేలా కార్యాచరణ రూపొందించారు. ప్రజా పాలనలో పార్టీ శ్రేణులు భాగస్వాములు అయ్యేలా ప్లాన్ చేశారు. గ్రామ గ్రామాన ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అర్హులకు దక్కేలా ఈ ఇందిరమ్మ కమిటీలు క్రీయశీలకంగా పనిచేయను న్నాయి. అదే సమయంలో విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
ఇక పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. 17 ఎంపీ సీట్లను టార్గెట్గా పెట్టుకుని ఎన్నికల్లో పనిచేయాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ నెల 8న 5 జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో పార్టీ పెద్దలు సమీక్షలు చేయనున్నారు. అలాగే ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇన్చార్జ్లతో సన్నాహక సమా వేశం నిర్వహించనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 20 తరువాత క్షేత్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు, పార్టీ పెద్దలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. మరోవైపు క్రియాశీలకంగా పని చేసిన కార్యకర్తలకు ప్రభుత్వంలో ఇచ్చే పదవుల జాబితా ను తయారు చేస్తున్నారు ఏఐసీసీ సెక్రటరీలు. ఎన్నికల్లో పని చేసిన నేతలను గుర్తించి వారి స్థాయిలను బట్టి ప్రభుత్వం లో పదవులు ఇవ్వనున్నారు. త్వరలోనే వారికి పదవులు ఉంటాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేసేందుకు నాయకులు ఉత్సాహం చూపుతున్నారు.


