కరుణాంతరంగ సంస్కార గంగ అని పేరొందిన దేశం ఎక్కడి కెడుతోంది..? హిమశైల శిఖరం పైకా….? పాతాళ కుహ రం లోకా.. ? అంటే… చిట్టెంపాడు హృదయ విదారక ఘటనను చూస్తే … ఖచ్చితంగా అధః పాతాళానికే సమాజ సం స్కారం పోతోందని స్పష్టం అవుతుంది.
గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోతే, జాలి వీడి దాన్ని అలా వదిలేస్తామా.. చేరదీసి నీరు పోసి చిగురించనీయమా.. అన్నారు సినీ కవి. పువ్వులు, కాయలు, మొక్కలే కాదు… సాక్షాత్ మనుషులే అత్యంత దయనీయస్థితిలో వున్నా దయా, జాలీ జాన్తా నహి అంటున్నారు కొందరు ప్రజలు. ఇదేం చోద్యం..? ఇదేం దారుణం…? ఇదేం స్వార్థం…? అని దిక్కులు పిక్కటిల్లేలా గొంతెత్తి అరచినా….. గొంతెండి పోవడం తప్ప…అక్కడ మంచితనం, మానవత్వం మచ్చుకైనా కనిపించదేమో అనిపిస్తోంది.
విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం చిట్టెంపాడు గ్రామంలో ఈ కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. గంగమ్మ అనే గిరిజన మహిళ ఆరు నెలల క్రితం బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, బిడ్డ ఆరోగ్యపరిస్థితి విషమించడంతో గంగమ్మ, ఆమె బంధువులు ఆందోళనకు గురయ్యారు. గ్రామంలో వైద్య సదుపాయమూ లేదు, రోడ్డు సౌకర్యమూ లేదు. దీంతో, ఆ మహిళ బంధువులు..డోలీ కట్టి తల్లి, బిడ్డలను ఎస్.కోట పీహెచ్‌కి తరలించారు. వారం రోజులపాటు వైద్య చికిత్స జరిగినా.. బిడ్డ ఆరోగ్యం ఏ మాత్రం కుదుటపడక లేదు. ఒక దశలో ఆ పసికందు ఆరోగ్య పరిస్థితి విషమిం చింది. దీంతో మెరుగైన చికిత్స కోసం తల్లి, బిడ్డలను విశాఖపట్నానికి తరలించారు. అక్కడ బిడ్డ మరణించింది. శోక సముద్రంలో నిండిపోయిన గంగమ్మ కుటుంబం బిడ్డ మృతదేహంతో గ్రామానికి చేరుకుంది.
బిడ్డ మృతితో తీవ్ర ఆవేదనకు గురైన గంగమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఆమెను ఎస్.కోటకు తీసుకెళ్లారు. అయితే, ఆమె ఆరోగ్యం మరీ క్షీణించండంతో…ఎస్.కోట వైద్యులు విశాఖకు తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. దీంతో, ఆమెను విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. కన్న బిడ్డ, కట్టుకున్న భార్య కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో గంగమ్మ భర్త గంగులు తీవ్ర దుఃఖానికి గురయ్యాడు. దెబ్బ మీద దెబ్బ… వరుస దెబ్బలు తగిలినా గుండె నిబ్బరం చేసుకుని గంగులు, తన భార్య మృతదేహాన్ని ఎస్.కోట వరకు తీసుకొచ్చాడు. ఆటో లో భార్య మృతదేహాన్ని తన స్వగ్రామానికి తీసు కెళదామని గంగులు ప్రయత్నించాడు. అయితే, అక్కడ వున్న ఆటో డ్రైవర్లెవ్వరూ…మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ముందుకు రాలేదు. గంగులు ఎంత బతిమాలినా, ఎంత సొమ్ము ఇస్తామన్నా… ససేమిరా అన్నారు.
దూరపు బంధువో, స్నేహితుడో మోటర్ బైక్ పై అటు రావడంతో…ఆ బైక్ పై మృత దేహాన్ని కొంత దూరం వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి రహదారి లేకపోవడంతో… దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యులందరూ మృతదేహాన్ని కర్రకు కట్టి గ్రామానికి తీసుకెళ్లారు. ఈ హృదయ విదారక ఘటన చూపరులను కలచి వేసింది. భూత, వర్తమాన కాలాల్లో జరిగిన దురదృష్ట ఘటనలు భవిష్యత్ లోనైనా జరగకుండా చూడాలి. కన్ను మూసి కానరాని లోకాలకు వెళ్లిపోయిన అభాగ్యులు ఇక తిరిగి రారు. కష్టాల కడలిలో తేలియాడుతున్న నిర్భాగ్యుల కష్టాలపై ఇప్పటికైనా పాలకులు, అధికారులు దృష్టి సారించి… చిట్టెంపాడులాంటి కుగ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, తరచు వైద్య శిబిరాలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.


