ఏపీ అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 86వేల 389కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవెశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2 లక్షల 30వేల 110 కోట్లు..మూలధన వ్యయం రూ.30 వేల 530 కోట్లుగా తెలిపారు. ద్రవ్యలోటు రూ.55వేల 817కోట్లు , రెవెన్యూ లోటు రూ.24వేల 758 కోట్లుగా చెప్పారు. రాష్ట్ర సమస్యలను పాత, మూసపద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంభించామన్నారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరసేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.సుపరిపాలన ఆంధ్ర, సామర్ధ్య ఆంధ్ర, మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్రను సాధించామని చెప్పుకొచ్చారు. పాలనా పరమైన పునర్నిర్మాణంలో భాగంగా 13 కొత్త జిల్లాలు, 26 కొత్త రెవెన్యూ డివిజన్లు, పోలీసు డివిజన్లు ఏర్పాటు చేశామన్నారు. మానవ మూలధన అభివృద్ధికి గత ఐదేళ్లుగా ప్రాధాన్యతా క్రమంలో పెట్టుబడి పెట్టినట్లు మంత్రి బుగ్గన చెప్పారు. ఆరోగ్యశ్రీ వ్యాధులను 3 వేల 257కు పెంచామని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద 10 వేల 754 శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు. కోటీ 67లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు.
పాలనా విభాగాలను పునర్వవస్థీకరించి అన్ని వర్గాల వారికి సాధికారిత అందించామని బుగ్గన తెలిపారు. విద్యార్థు లను ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం చేసేలా ఆంగ్ల మాద్యమ విద్యను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. రాష్ట్రంలో వెయ్యి పాఠశాలల్లోని 4 లక్షల 39 వేల 395 మంది విద్యార్ధులను సీబీఎస్ఈ పరిధిలోకి తీసుకువచ్చామని మంత్రి బుగ్గన తెలిపారు. కొత్త పారిశ్రామిక విధానంతో సంపన్న ఆంధ్రా, రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ చట్టాలతో భూభద్ర ఆంధ్రాగా ఏపీ మారిందని చెప్పారు. గడప గడపకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, 2.6లక్షల మంది వలంటీర్ల నియామకం చేసినట్లు తెలిపారు. రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78కి పెంచినట్లు బుగ్గన తెలిపారు.


