ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కీలక సమావేశాల నిర్వహణకు అధికార వైసీపీ సిద్ధమైంది. ఇందుకోసం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీ నుంచి రీజనల్ క్యాడర్ సమావేశాలు మొదలు కానుండగా.. తొలి సమావేశానికి విశాఖ భీమిలి వేదిక కానుంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. ఇప్పటికే వైసీపీ పలు మార్పులతో కూడిన జాబితాల్ని సిద్దం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత కీలక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.
మొదటగా సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలియజే శారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ అధ్యక్షతన ఐదు ప్రాంతాల్లో కేడర్ సమావేశాలు జరుగుతాయన్నారు. ఇక నాలుగు నుంచి ఆరు జిల్లాలకు కలిపి ఒకే కేడర్ సమావేశంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీల్లో ఎన్నికల కోసం వ్యవహరించాల్సిన వ్యూహంపై పార్టీ కేడర్‌కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.