ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం …రెండూ ప్రత్యేక ప్రతిపత్తి అంశాన్ని విజయవంతంగా అటకెక్కించాయి. అలాగే విభజన హమీల విషయమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి అటు అధికారపార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ రెండూ వెనకడుగు వేశాయి. ఇదిలా ఉంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, అమరావతి అంశాలు కూడా ఇప్పటివరకు మరుగునపడ్డాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు తరుకొస్తున్న వేళ ఈ అంశాలన్నీ చర్చకు వచ్చాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు కావస్తోంది. విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అనేక విధాలుగా నష్టపో యింది. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలదీ ఏకాభిప్రాయమే. హైదరాబాద్ నగరానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పరాయి వారయ్యారు. విభజనతో నష్టోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని లోక్‌సభ వేదికగా అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నీళ్లు తుడవడానికి అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రయత్నించింది. అంతేకాదు, అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే అంశానికి మద్దతు ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాలేదు. ఆంధ్రప్రదేశ్‌కు అనేక ప్రయోజనాలు కల్పించే ప్రత్యేక హోదా విషయాన్ని అటు అధికారంలో ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ నూటికి నూరుశాతం నిర్లక్ష్యం చేసింది. అసలు ప్రత్యేక హోదా ఒక అంశమే కాదన్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రవర్తించింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విచిత్రంగా అనిపిస్తాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలో వాస్తవానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లేదు. అయితే నరేంద్ర మోడీ సర్కార్ పార్లమెంటులో ఏ బిల్లు ప్రవేశపెట్టినా, బలపరిచే పార్టీల్లో ముందు వరుసలో ఉండేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్సే. ఎన్డీయే కూటమిలో లేకపోయినప్పటికీ, బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి హస్తిన రాజకీయవర్గాల్లో పేరుంది. అయినప్పటికీ, ప్రత్యేక హోదా విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేదు.
ప్రత్యేక హోదా విషయమై కేంద్రాన్ని ఒత్తిడి చేస్తే, హస్తిన బీజేపీ పెద్దలకు ఎక్కడ ఆగ్రహం వస్తుందోనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి వెనుకాడినట్లు రాజకీయ పండితులు విశ్లేషణ. ముఖ్య మంత్రి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో జనం కూడా మెల్లమెల్లగా ప్రత్యేక హోదా అంశాన్ని మరచిపోవడం మొదలైంది. ప్రత్యేక హోదా లభిస్తే, ఆంధ్రప్రదేశ్‌కు బోలెడన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే ఆర్థికంగా సదరు రాష్ట్రానికి అనేక లాభాలుంటాయి. ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రానికి కేంద్రం మెరుగైన సదుపాయాలు అందించడా నికి గ్రాంట్ల రూపంలో ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో ముప్ఫయి శాతాన్ని అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే అందచేస్తారు. మిగిలిన 70 శాతం నిధులను ఆ తరువాత ఇతర రాష్ట్రాలకు అందిస్తారు. అంతేకాదు గ్రాంట్ల రూపంలో కూడా రాష్ట్రానికి మేలు జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90 శాతం నిధులను గ్రాంట్లుగా, 10 శాతం నిధులను ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు రుణం కింద ఇస్తారు. అలాగే పన్నుల్లో మినహాయింపు కూడా ఇస్తారు. కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశాలుంటాయి. పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తే వారికి అన్ని విధాలా రాయితీలు కల్పిస్తారు. అలాగే ప్రోత్సాహకాలు అందిస్తారు. రుణాల చెల్లింపు సమయంలో కూడా కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తుం ది. కొన్నిసార్లు రుణాల చెల్లింపులను వాయిదా వేస్తారు. అవసరమైతే కొత్తగా మరికొన్ని రుణాలను కూడా అందచేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక హోదా రాకపోతే ఈ ఆర్థిక ప్రయోజనాలన్నిటినీ ఆంధ్రప్రదేశ్ కోల్పోయినట్లే. దీనికి బదులుగా ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా ఆ లాభం ప్రత్యేక హోదా గుర్తింపు వల్ల కలిగే ప్రయోజనాలతో సమానం కాదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోని మరో ముఖ్యమైన అంశం ..విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. ఉక్కు ఫ్యాక్టరీని తెలుగు ప్రజల కు దయతలచి అప్పటి కేంద్రం ఇవ్వలేదు. విశాఖ ఉక్కు ….ఆంధ్రుల హక్కు అంటూ తెలుగు ప్రజలు ఉద్యమించారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సర్కార్ మెడలు వంచి సాధించుకున్నారు. తెలుగు ప్రజల ఐక్యతకు, పౌరుషానికి, పట్టు దలకు నిదర్శనంగా నిలిచింది విశాఖ ఉక్కు కర్మాగారం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీది పోరాటాల చరిత్ర. తమ ప్రాంతా నికి స్టీల్ ప్లాంట్ వస్తే చదువుకున్న కుర్రకారుకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉత్తరాంధ్రకు చెందిన వందలాది మంది సామాన్య రైతులు అప్పట్లో భూములు కూడా ఇచ్చేశారు. భవిష్యత్ తరాల కోసం త్యాగాలు చేశారు. ఇంతటి పోరాటాల, త్యాగాల చరిత్ర ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం నడిబజారులో అమ్మకానికి పెడితే, ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్
ఆర్ కాంగ్రెస్ సర్కార్ పోరాటం చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. ఉక్కు ఫ్యాక్టరీని అడ్డం పెట్టుకుని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం మొదలెట్టింది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం తమ పరిధిలోకి రాదన్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవర్తించింది. అదేదో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అనే రీతిలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ వ్యవహరించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ? అమరావతా లేక విశాఖపట్నమా ? ఏపీలో ప్రస్తుతం ఇది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నమేనంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కిందటి ఏడాది దేశ రాజధాని హస్తిన సాక్షిగా కుండబద్దలు కొట్టారు. ఢిల్లీలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు త్వరలోనే తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు చెప్పారు. రాజధాని అంశంపై జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. విశాఖే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన మళ్లీ తేనెతుట్టెను కదిపినట్లయింది. అమరావతి ఉద్యమం అంటే త్యాగాల చరిత్రే. మరోటి కాదు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి పదో పాతికో కాదు…32 వేల ఎకరాల భూమిని అక్కడి రైతులు త్యాగం చేశారు. 2019…డిసెంబరు 17….ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి రోజు. అదే రోజు సాయంత్రం అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రస్తావన తీసుకువచ్చారు. అప్పటివరకు అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని. మరో ముచ్చటే లేదు. విభజన తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పటికే రాజధాని నిర్మాణం కోసం చేయాల్సిందంతా చేసింది. అయితే పులి మీద పుట్రలా..చడీ చప్పుడు లేకుండా అమరావతి ఇక లెజిస్లేటివ్ రాజధాని మాత్రమేనన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నాన్ని జగన్ తెర మీదకు తీసుకు వచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని నామమాత్ర రాజధాని చేసింది.
మూడు రాజధానుల అంశాన్ని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన మర్నాడే అమరావతి ప్రాంత రైతులు వీథుల్లోకి వచ్చారు. అమరావతిని కాపాడుకోవడం కోసం ఒక్కటయ్యారు. అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ఉద్యమ బాట పట్టారు. 2019 డిసెంబర్ 18న వెలగపూడిలో మొదటి దీక్షా శిబిరం ప్రారంభమైంది. అదిగో….అప్పటి నుంచి అమరావతి రైతులు ఉద్యమమే ఊపిరిగా బతుకుతున్నారు. వయస్సు తేడా లేకుండా చిన్నా పెద్దా అందరూ ఉద్య మంలో భాగస్వాములయ్యారు. అమరావతి ని కాపాడుకోవడానికి రైతులు అలుపెరుగని పోరాటం మొదలుపెట్టారు. ఈ పోరాట బాటలో రైతులు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. అవరోధాలు తట్టుకున్నారు. నిరాహార దీక్షలు చేశారు. రోడ్లపై బైఠాయించారు. న్యాయం చేయాలంటూ కోర్టులకెళ్లారు. మా మొర ఆలకించడం మహా ప్రభో అంటూ కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చారు. లాఠీ దెబ్బలు తిన్నారు. జైళ్లకెళ్లారు. ఒకవైపు ఉక్కుపాదంతో ఉద్యమాన్ని అణచివేయడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే మరో వైపు వజ్ర సంకల్పంతో రైతులు ముందుకు కదిలారు.
అమరావతి ఉద్యమం రాజకీయ ప్రేరేపితం అంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇందులో ఇసుమంత వాస్తవం లేదంటారు రాజధాని నిర్మాణాల నిపుణులు. అయితే అమరావతి రైతుల వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు. అంతేకాదు ఏ రాజకీయ పార్టీ జెండాలూ లేవు. అమరావతి ఉద్యమం అజెండా ఒక్కటే….రాజధాని కోసం భూములి చ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడుకోవడమే. అమరావతి రైతుల గుండెలనిండా ఉన్నది ఆత్మవిశ్వాసమే. అలుపె రుగని మడమతిప్పని పోరాట స్ఫూర్తి అమరావతి ఉద్యమానిది. రైతులు అడుగుతోంది మణులో..మాణిక్యాలో కాదు…. అమరావతిని రాజధానిగా కొనసాగించడం. ఆరుగాలం శ్రమతో, స్వేదంతో నిర్మించుకుంటున్న రాజధాని నగరాన్ని కాపాడుకోవడం. తొందరపాటుతో జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకువచ్చిన మూడు రాజధానుల బిల్లును అటకెక్కించ డం. అమరావతి ఉద్యమంలో భాగంగా రైతులు చేపట్టిన మరో ఆందోళనా కార్యక్రమమే….. మహాపాదయాత్ర. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో ఈ మహాపాదయాత్రను అమరావతి రైతులు చేపట్టారు. 45 రోజులపాటు 450 కిలోమీటర్లు నడిచారు. చివరకు శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో మహాపాదయాత్ర ముగిసింది. ఏమైనా ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, అమరావతి అంశం మరోసారి తెరమీదకు వచ్చాయి. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఐదేళ్లుగా నిర్లక్ష్యం చేసిన విభజన అంశాలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ పట్టించుకోకపోయినా, మిగతా రాజకీయ పార్టీలు విభజన హామీలపై పోరు చేయడానికి సన్నద్ధం అవుతున్నాయి.


