ఏపీ కాంగ్రెస్‌కు రథసారథిగా వై.ఎస్ షర్మిల ఎలా వ్యవహరిస్తారు ? తన అన్న..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ విషయంలో ఆమె ఎలాంటి కామెంట్లు చేస్తారు..? ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ విషయంలో షర్మిల స్టాండ్ ఏమిటి? ఇలా ఒకటీ రెండూ కాదు. ఏపీ పీసీసీ చీఫ్‌గా షర్మిల బాధ్యతలు చేపట్టక ముందు ఎన్నో సందేహాలు. కానీ, వాటన్నింటికీ సమాధానం చెప్పేశారు షర్మిల. ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె అధికార, విపక్షాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర అబివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పుకొచ్చారు షర్మిల.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రథసారథిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఆ పార్టీ నేత వై.ఎస్ షర్మిల. హస్తం పార్టీకి చెంది న పలువురు సీనియర్ నేతల సమక్షంలో ఏఐసీసీ తీర్మానాన్ని చదివి వినిపించారు ఏపీ పీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్ర రాజు. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో తన స్టాండ్ ఏంటో స్పష్టం చేశారామె. తన సోదరుడు, ఏపీ సీఎం వై.ఎస్ జగన్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారామె. ఏపీపై పది లక్షల కోట్ల అప్పు ఉందన్న ఆమె.. ఇంత అప్ప చేసినా అభివృద్ధి మాత్రం బూతద్దంలో పెట్టి వెతికినా కన్పించదని ఆరోపించారు. రాష్ట్రానికి రాజధాని అయి నా ఉందా అంటూ నేరుగా వైసీపీ సర్కారును ప్రశ్నించారామె. ఈ పదేళ్లలో కనీసం పది పెద్ద పరిశ్రమలైనా రాష్ట్రానికి వచ్చాయా అన్న షర్మిల… ఒక్క మెట్రో కూడా లేదంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను ఇద్దరు నేతలూ తాకట్టు పెట్టారంటూ జగన్, చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు షర్మిల. హోదా కోసం చంద్రబాబు ఎప్పుడైనా ఉద్యమం చేశారా అని ప్రశ్నించారామె. అదే సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు దీక్షలు చేసిన జగన్… అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా ఉద్యమించారా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. మణిపూర్‌లో క్రైస్తవులపై దాడులు జరిగితే ఆ మతానికి చెందిన వ్యక్తిగా ఎందుకు స్పందించలేదంటూ జగన్‌ను టార్గెట్ చేశారు షర్మిల.
రాజధాని అమరావతిని చంద్రబాబు పూర్తి చేయలేదని… జగన్ మూడు రాజధానులని చెప్పి ఒక్కటీ కట్టలేదంటూ ఫైరయ్యారు షర్మిల. అదే సమయంలో వైపీసీ, టీడీపీ ఎంపీలు బీజేపీ చేతుల్లో ఉన్నారంటూ ఆరోపించారామె. ఇక, పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు వస్తున్న సమయంలో తమ కాన్వాయ్ ఆపడంపై మండిపడ్డారు షర్మిల. ఎనికేపా డు నుంచి వాహనాలను డైవర్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు బైఠాయించాయి. దీంతో.. వారి వాహనాలు వచ్చే వరకు ముందుకు కదిలేది లేదంటూ తేల్చిచెప్పారు షర్మిల. ఎట్టకేలకు హస్తం శ్రేణుల ఆందోళనతో దిగొచ్చిన పోలీసులు.. వాహనాల శ్రేణికి అనుమతించారు. ఈ సందర్భంగానే రాజన్న బిడ్డ ఎవరికీ భయపడదని వ్యాఖ్యానించారు షర్మిల. అసలు అనుమతి తీసుకొని వెళ్తుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏముందన్నారు వై.ఎస్ షర్మిల.