టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలతో రెండో రోజు ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. పన్నుల భారంతో ప్రజల నడ్డి విరుస్తున్నారని నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన కొనసాగించడంతో వారిని ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, బెందాళం అశోక్, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, వెలగపూడి రామ కృష్ణబాబు, గద్దె రామ్మోహన్ లను సస్పెండ్ చేశారు. సభ మొదలవగానే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన
వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అయితే వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలు పెరిగాయని చర్చ చేపట్టాలని కోరారు.
టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు బిల్లులను ప్రవేశపెట్టారు. స్పీకర్ పోడియం ఎక్కి మరీ తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ చైర్ వద్దకు దూసుకొచ్చిన ఎమ్మెల్యేలు బాదుడే బాదుడు అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో అసెంబ్లీలో ఎవరేమి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పప్పులు, ఉప్పులు బాదుడే బాదుడు అంటూ ప్రతిపక్ష టీడీపీ సభ్యుల నినాదాలతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్పీకర్ చైర్ వద్ద తెలుగుదేశం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం, స్పీకర్ స్థానం వద్ద ఉండి మరి నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం 10 నిమిషాలు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన తర్వాత కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన కొనసాగించడంతో వారిని ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.