రాజకీయ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలు విరాళాలు ఇచ్చే విషయం ఓపెన్ సీక్రెట్. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఫలానా పార్టీకి ఫలానా కంపెనీ ఇంత అమౌంట్ విరాళంగా అందచేసింది …అనే విషయం బయటకు వచ్చే వీలుంది. ఏ రాజకీయ పార్టీకి ఏ కార్పొరేట్ కంపెనీ, ఎంత అమౌంట్ విరాళంగా ఇచ్చింది అనే విషయం రహస్యంగా ఉంచాలని కేంద్రప్రభుత్వం భావించింది. ఇందుకు అనుగుణంగా తీసుకువచ్చిందే ఎన్నికల బాండ్ల పథకం.
ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల బాండ్ అంటే ప్రామిసరీ నోట్ లాంటిది.ఈ బాండ్లు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కొన్ని ఎంపిక చేసిన శాఖలలోనే ఎన్నికల బాండ్లు దొరుకుతాయి. భారతదేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలు లేదా సదరు సంస్థల తరఫున రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఎన్నికల బాండ్లను ఉపయోగిస్తారు. రాజకీయ పార్టీలకు వివిధ కార్పొరేట్ కంపెనీల ద్వారా అందే విరాళాలకు సంబంధించి పారదర్శకత తీసుకురావాలన్న లక్ష్యంతో 2018లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకువచ్చింది.ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ పార్టీలకు నిధులు ఇవ్వడానికి ఉపయోగపడే వేదిక ఎన్నికల బాండ్లు. వీటికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నికల బాండ్లలో విరాళాలు ఇచ్చే వారి పేర్లు ఉండవు. అసలు దాతల పేర్లు వెల్లడించాల్సిన అవసరం ఉండదు.
ఎన్నికల బాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక లింకు పెట్టింది. ఆర్థిక చట్టం -2017ను కేంద్రం సవరించింది. ఈ సవరణ కారణంగా కార్పొరేట్ కంపెనీలు స్టేట్ బ్యాంక్ నుంచి పెద్ద ఎత్తున బాండ్లను కొనుగోలు చేయవచ్చు. తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు అందించవచ్చు. అయితే విరాళాలు ఇచ్చింది ఎవరు…అనే వివరాలేవీ అధికారికంగా బయటకు రావు. దీని వల్ల తమకు బాండ్ల రూపంలో సాయం చేసిన కంపెనీలకు సదరు పార్టీలు అధికారంలోకి వస్తే. ..సాయం చేసే అవకాశాలున్నాయి. ఒక రకంగా క్విడ్ ప్రోకోకు అవకాశం ఉన్నట్లే . ఈ అంశాన్ని తప్పు పడుతూ ఏడీఆర్ సహా పలు ప్రజా సంఘాలు, బీజేపీయేతర నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ల తరఫు వాదనల సందర్భంగా ఆసక్తికర అంశం ఒకటి తెర మీదకు వచ్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీకి రూ.5,127.97 కోట్లు విరాళంగా అందాయి. అయితే మిగిలిన అన్ని జాతీయ పార్టీలకు కలిపి కేవలం రూ.1783.93 కోట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల బాండ్లు అధికార పార్టీకి మేలు చేస్తున్నాయని చెప్పడానికి ఈ గణాంకాలు ఓ ఉదాహరణ అని పేర్కొన్నాయి ప్రతిపక్షాలు.
ఎన్నికల బాండ్ల అమ్మకాలు 2018 మార్చి ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు జరిగాయి. ఇదిలా ఉంటే ఎన్నికల బాండ్లపై బ్యాంకు ఎటువంటి వడ్డీని చెల్లించదు. ఎన్నికల బాండ్లను వెయ్యి నుంచి పదివేల రూపాయల వరకు అలాగే లక్ష రూపాయలు, కోటి రూపాయల వరకు ఆయా డినామినేషన్లలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని శాఖలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ బాండ్లను కొనుగోలు చేసిన తేదీ నుంచి 15రోజుల లోపు దాతలు తమకు నచ్చిన పార్టీలకు అందచేయాల్సి ఉంటుం ది. కాగా సదరు ఎన్నికల బాండ్‌ను రాజకీయ పార్టీలు బ్యాంకులో ధృవీకరించిన ఖాతాలో వేసుకుని నగదు రూపంలో మార్చుకోవచ్చు. అయితే ఎన్నికల బాండ్స్ పై కాగడా పెట్టి వెతికినా దాత పేరు ఎక్కడా ఉండదు. అయితే బాండ్‌కు సంబంధించిన వివరాలు మాత్రం బ్యాంక్ దగ్గర గోప్యంగా ఉంటాయి.


