వైఎస్ జగన్ ఇక సరికొత్తగా కనిపించనున్నారా? పార్టీ బలోపేతం కోసం రాష్ట్రమంతటా పర్యటించనున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు గడిచిపోయింది. ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో వైసీపీ అధినేత జగన్ అసలు ప్రజల్లోకి రావడమే మానేశారు. ఒకటి రెండు సార్లు బయటకు వచ్చినా.. అది కేవలం పరామర్శలకే పరిమితం అయ్యింది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అనేక కేసులు బనాయించింది. ఆ సమయంలో కూడా జగన్ కేవలం ప్రకటనలకే పరిమతం అయ్యారు. అధికారం కోల్పోయిన తర్వాత అనేక మంది కీలక నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోయారు. కొన్ని చోట్ల పార్టీని నడిపించే నాయకుడు కూడా కరువయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కేడర్ పూర్తిగా డీలా పడ్డారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ దారుణమైన ఫలితాలకు గల కారణాలను కూడా ఇప్పటి వరకు విశ్లేషించుకోలేదు. ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలదే తప్పు అంటూ.. పదే పదే వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పార్టీ బలహీనంగా మారిన విషయం మాత్రం ఒప్పుకోవడం లేదు. చాలా చోట్ల కేడర్ కూడా జరిగిన తప్పులను బేరీజు వేస్తూ.. సంబంధిత కారణాలను నాయకులకు చెబుతున్నారు. కానీ వారు మాత్రం.. సదరు విషయాలను పై వరకు తీసుకెళ్లేకపోతున్నారు. పార్టీ అధినేత జగన్ ఎప్పుడు తాడేపల్లిలో ఉంటారో.. ఎప్పుడు బెంగళూరులో ఉంటారో అర్థం కాక.. నాయకులు కూడా గందరగోళానికి గురవుతున్నారు. వైఎస్ జగన్ ఇప్పటికైనా బయటకు రావాలంటూ పలు జిల్లాల నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఆరు నెలల పాటు సైలెంట్‌గా ఉన్న జగన్.. ఇక పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ముందుగా జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసకుున్నట్లు తెలిసింది. వైఎస్ జగన్ ఈ నెల 5 నుంచి 30 వరకు లండన్ పర్యటనకు వెళ్తున్నారు. తిరిగి వచ్చిన తర్వాత పూర్తి సమయం పార్టీ కోసమే అనే ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 5 తర్వాత జిల్లా సమీక్షలు మొదలు పెడతారని.. అప్పుడే కార్యకర్తలతో కూడా సమావేశం అవుతారని తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కానీ.. లేనప్పుడు కానీ.. జగన్ ఏనాడూ నాయకులు, కార్యకర్తలతో కలవలేదనే అపవాదు ఉంది. ఇప్పుడు ఆ మచ్చను చెరిపేసుకునే ప్రయత్నం జగన్ చేయనున్నారట. గతంలో తాడేపల్లి పార్టీ కార్యాలయంలోనే అన్ని సమావేశాలూ, సమీక్షలు నిర్వహించారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయా జిల్లాలకు వెళ్లి.. అక్కడే పార్టీ సమీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారట.
ప్రతీ వారం జిల్లా పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వారంలో రెండు రోజులు జిల్లా పర్యటనలకు కేటాయించనున్నారు. మొత్తం 26 జిల్లాల్లోనూ సమీక్షలు పూర్తయిన తరువాత.. ఇక, ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ ఉంటుందని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ముందుగా కేడర్‌కు అండగా ఉంటూ.. స్థానిక అంశాలు, ప్రభుత్వ వైఫల్యాల పైన జిల్లాల వారీగా కార్యక్రమాలు సిద్దం చేసుకోవాలని జగన్ పార్టీ నేతలకు సూచిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ చేయాల్సిన కార్యక్రమాలను ముందుగానే నిర్ణయించనున్నారు. ఆ తర్వాత వాటిని జిల్లా నాయకులకు వివరించి.. ఆయా జిల్లాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్లు తెలిసింది. ఇకపై ప్రభుత్వాన్ని ప్రతీ విషయంలోనూ నిలదీయాలని, ప్రశ్నించాలని వైసీపీ టార్గెట్‌గా పెట్టుకుంది. కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చామని.. ఇప్పటికీ ఎన్నో హామీలు నెరవేర్చలేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఆంశాల వారీగా ఆందోళనలు చేపడతామని.. ఇందుకు అధినేత వైఎస్ జగన్ కూడా కార్యచరణ సిద్ధం చేసినట్లు వారు చెబుతున్నారు.
ఇప్పటి వరకు జగన్ కేవలం తాడేపల్లి లేదా బెంగళూరు ప్యాలెస్‌కు మాత్రమే పరిమితం అయ్యారని విమర్శిస్తున్న వారి నోర్లు మూయించేలా.. వైసీపీ కార్యచరణ సిద్ధం చేసిందట. పార్టీ తమను పట్టించుకోవడం లేదని బాధపడుతున్న కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా.. ప్రతీ వారం జగన్ వారిని కలిసే ప్రోగ్రాం ఉంటుందని.. జిల్లాల వారీగా దాన్ని చేపడతామని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే పలు జిల్లాలకు అధ్యక్షులు, అనుబంధ విభాగాల బాధ్యులను నియమించారు. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా నియామకాలు త్వరలోనే పూర్తవుతాయని తెలుస్తోంది. పార్టీని ముందుగా పటిష్టం చేసిన తర్వాతే.. ప్రభుత్వంపై కూడా ఆందోళనలు చేస్తే బాగుంటుందని జగన్ నిర్ణయించారట. అందుకే ముందుగా జిల్లా సమీక్షలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.
మొత్తానికి జగన్ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారని కేడర్ సంబరపడుతోంది. రాబోయే రోజుల్లో వైసీపీలో కొత్త జోష్ రావడం ఖాయమని భావిస్తున్నారు. మరి జగన్ కనుక ఈ విషయంలో సీరియస్‌గా ఉంటే.. వైసీపీకి మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే.