31.2 C
Hyderabad
Saturday, April 13, 2024
spot_img

దక్షిణాదిలో కమలనాథుల పాగా ?

    కేంద్రంలో హ్యాట్రిక్‌పై కన్నేసిన కమలనాథులు… అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విషయంపై సీరియస్‌గా దృష్టి సారించారు. 370 స్థానాలను కేవలం భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే గెలుస్తుందని స్వయంగా ప్రధాని మోడీయే ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో… ప్రతి ఒక్కసీటూ ఎంతో విలువైనదిగా భావిస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాదిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు కాషాయ పార్టీ అగ్రనేతలు. అందులోనూ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు సాధించి రెట్టించిన ఉత్సాహంతో ఉంది కమలం పార్టీ. దీంతో.. మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి తిరుగులేని శక్తిగా ఎదగాలని యోచిస్తోంది బీజేపీ. మరి.. వారి ప్లాన్లు తెలంగాణ గడ్డపై ఎంత మేరకు వర్కవుటవుతాయి ?

      లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి విజయ కేతనం ఎగురవేసి కేంద్రంలో హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు కమలనాథులు. ఇప్పటికే ఆ దిశగా తమ వ్యూహాలు అమలు చేయడం ప్రారంభించారు. ఇటీవలె అయోధ్య రామాల యం ప్రారంభించడంతో దేశ వ్యాప్తంగా బీజేపీకి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అంచనా వేస్తున్నారు కాషాయ పార్టీ నేతలు. అటు… విపక్షాలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నాయంటున్నారు ప్రధాని మోడీ. అంతేకాదు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 370 సీట్లు సాధిస్తుందని… ఎన్డీఏ కూటమి అయితే.. 400 సీట్లతో తిరుగులేని విధంగా అధికారంలోకి వస్తుందని ఘంటా పథంగా చెప్పుకొస్తున్నారు ప్రధాని నరేంద్రమోడీ.

       కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల సంగతి కాస్త పక్కన పెడితే… కేవలం ప్రధాని మోడీ కేంద్రం గా ఎన్నికలకు వెళ్లనుంది బీజేపీ. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదనే చెప్పాలి. మోడీ చెప్పారంటే చేస్తారనే నినాదాన్ని ప్రధానంగా విన్పిస్తున్నారు బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే కేంద్రంలో మరోసారి అధికా రంలో రావాలంటే ప్రతి లోక్‌సభ స్థానంలోనూ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఉత్తరాదిలో గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పటికి కమలం పార్టీ మరింత బలంగా ఉందనే వాదన విన్పిస్తోంది. దీంతో దక్షిణాదిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు కాషాయ పార్టీ నేతలు. అయితే.. సౌత్‌లో మెజార్టీ సీట్లు సాధించేందుకు అవకాశమున్న రాష్ట్రాలుగా కర్ణాటక, తెలంగాణ ప్రధానంగా కన్పిస్తున్నాయి. అయితే.. కర్ణాటక విషయం కాస్త పక్కన పెడితే.. తెలంగాణపై బీజేపీ నేతలు ఫోకస్ మరింత పెంచారు. ప్రధానంగా ఇటీవలె జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎనిమిది స్థానాల్లో విజయం సాధించారు కమలం పార్టీ ఎమ్మెల్యేలు. దీంతో.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపొందాలని వ్యూహాలు రచిస్తున్నారు.

     ఇందులో భాగంగా పార్టీ అగ్రనేతలతో ప్రచారాన్నిహోరెత్తించనున్నారు. ఇందుకు సంబంధించి ఏయే నేతలు, ఎప్పుడు, ఎక్కడ ప్రచారం నిర్వహించాలనే దానిపై రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు రాష్ట్ర నేతలు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌, గడ్కరీ సహా ఇతర మంత్రులు, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్లు తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వంలో పాలుపంచుకోనున్నారు. అయితే… పార్టీకి చెందిన అగ్రనేతలు ప్రచార పర్వంలోకి దిగేందుకు మరికొంత సమయం ఉన్నా..ఈలోగా రాష్ట్ర నేతలు ఆ దిశగా ముందుకు కదిలారు. ప్రధానంగా పది ఎంపీ సీట్లు లక్ష్యంగా పెట్టు కున్న బీజేపీ నేతలు… ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా నియోజకవర్గాల్లో విజయం సాధించాలని స్కెచ్చులేస్తున్నారు. వాస్త వానికి 2019 ఎన్నికల్లో బీజేపీ సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి వాటితోపాటు వరంగల్, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, మల్కాజ్‌గిరి, మహబూబాబాద్‌లో విజయం సాధించడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి. తెలంగాణను ఐదు క్లస్టర్లుగా విభచించి.. ప్రచారాన్ని ఒకేసారి ప్రారంభించింది కాషాయదండు. అంతేకాదు.. ఆదివాసీ లు, ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసి ఆయా ప్రాంతాల్లో కమలం జెండా ఎగుర వేయాలన్న లక్ష్యంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు బీజేపీ నేతలు.

      ఓటర్లను ఆకట్టుకోవడమే కాదు… ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ముందుకు సాగుతున్నారు కమలం నేతలు. తాము అధికారంలోకి వస్తే మోడీ నేతృత్వంలో ఏం చేస్తామో చెప్పడమే కాదు.. గత ప్రభుత్వంతోపాటు ప్రస్తుత సర్కారు ఏం చేస్తున్నాయి.. ఎలా చేస్తున్నాయి అనే అంశాలపై ఫోకస్ చేసి మరీ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు బీజేపీ నేతలు. ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు… బీజేపీకి 370 సీట్లు ఇవ్వాలంటూ సరికొత్త నినాదం విన్పిస్తున్నారు మరి కొందరు కమలం నేతలు. అంతేకాదు.. ప్రజల కోసం పాటు పడే ప్రధాని మోడీని మరోసారి గద్దెనెక్కించేందుకు వీలుగా తెలంగాణలోని అన్ని పార్లమెంటు స్థానాల్లో కమలాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. తెలంగాణ బీజేపీ చేపడుతున్న ఈ ప్రచార యాత్రలు మొత్తం 17 పార్లమెంటు పరిధిలోని 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాగుతాయి. మొత్తం ఐదువేల కిలోమీటర్ల మీర యాత్ర నిర్వహించనున్నారు బీజేపీ నేతలు. మరి.. బీజేపీ నేతలు చేపడుతున్న ఈ యాత్రలు ఎంత మేరకు ఓట్లు రాలుస్తాయి.. సీట్లు తీసుకొస్తాయి అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Latest Articles

పార్టీలకు తలనొప్పిగా మారిన ఎన్నికల ఖర్చు

    గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికల్లో ధనప్రవాహం ఇబ్బడిమబ్బడిగా పెరిగింది. పెరిగిన ఎన్నికల ఖర్చు అన్ని రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారింది. ఎన్నికల్లో గెలుపు కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని రాజకీయ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్