తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. చికెన్, కోడిగుడ్లు తినాలా..వద్దా అని ప్రజలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూతో కోళ్లు మృతి చెందుతుండడంతో కోళ్ల ఫారం యజమానులు ఆందోళన చెందుతున్నారు. అంగన్ వాడీ కేంద్రాలకు అందించే కోడి గుడ్లను కూడా నిలిపివేసినట్టు తెలుస్తోంది.
ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని SV వెటర్నరీ యూనివర్సిటీ ఇంచార్జ్ రిజిస్ట్రార్ సి.హెచ్.శ్రీ లత అన్నారు. శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత సమయంలో ఈ వ్యాధి ప్రబలుతుందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే వలస పక్షులు వల్ల ఈ వ్యాది సోకుతుందని తెలిపారు. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే ఈ వ్యాది లక్షణాలు తగ్గుముఖం పడతాయని వివరించారు. కోడి మెడ భాగంలో వ్యాధి ఎక్కువగా సోకుతుందని చెప్పారు. నాటుకోళ్ళు ఎక్కువగా వ్యాధి నిరోదక శక్తిని కలిగి వుంటాయని చెప్పారు. కోడి మాంసం, కోడి గుడ్లు తినడం వల్ల ఈ వ్యాధి సోకుతుందని భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
బర్డ్ ఫ్లూ పెరగడంతో కర్నూలు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. బర్డ్ ఫ్లూ నివారణకు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. కర్ణాటక ,తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఏపీలో గోదావరి , కృష్ణ జిల్లాలో కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలతో లక్షల్లో కోళ్ళు మరణించాయి. దాంతో కర్నూలు జిల్లాలో చికెన్ విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. బర్డ్ ఫ్లూ మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ముందు జాగ్రత్తగా పశుసంవర్థక శాఖ అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆదోని డివిజన్ లోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పెద్ద హరివనం, క్షేత్రగుడి, మాధవరం, బాపురం చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక తనిఖీలు ఏర్పాటు చేశారు. కర్ణాటక , తెలంగాణ నుండి కోళ్ళు , కోడి గుడ్లు దిగుమతి లేదా రవాణా కాకుండా నిఘా పెంచారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని అంగన్వాడిలో కోడిగుడ్లను నిలిపివేశారు. వేల్పూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో జిల్లావ్యాప్తంగా కోడి మాంసం, గుడ్ల విక్రయాలపై ప్రభావం చూపింది. ఈ క్రమంలో పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులు, విద్యార్థులకు భోజనంలో కోడిగుడ్లను నిలివేశారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో జిల్లాలోని 120 అంగన్వాడి కేంద్రాలకు ఈనెల 11వ తేదీ నుండి 21 రోజులు పాటు కోడిగుడ్లు సరఫరా నిలిపివేసినట్లు ఐసిడిఎస్ పిడి సుజాత రాణి తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఇదే పరిస్థితి కొనసాగుతున్నారు.