23.8 C
Hyderabad
Friday, March 6, 2026
spot_img

జన జాగృతికి వేదిక సమ్మక్క సారక్క జాతర

       దైవాలను, దైవాంశ సంభూతులను, మహిమాన్వితులను, కారణజన్ములను భక్తిశ్రద్దలతో ఆరాధిం చడం హైందవ సంప్రదాయంలో కనిపిస్తుంది. అటవీ సంప్రదాయాలను, పూర్వాచారాలను మనఃస్ఫూర్తి గా, త్రికరణశుద్ధిగా పాటించే గొప్ప గుణం కలిగిన ప్రకృతి మాత ముద్దు బిడ్డలు అడవి బిడ్డలు. నిర్దిష్ట పర్వ దినాల్లో నియమబద్ధంగా, పూర్వాచార, సంప్రదాయాలకు అనుగుణంగా దేవతలను, దైవాలను ఆరాధిం చడం, అట్టహాసంగా సంబరాలు చేసుకోవడాన్ని మనం జాతరగా భావిస్తాం. దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల్లో గ్రామ దేవతలకు అత్యంత భక్తి శ్రద్దలతో గ్రామస్థులు జాతరలు నిర్వహించడం సర్వ సహజం. అయితే, ఇప్పుడు పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా అన్నిచోట్ల జాతరలు నిర్వహిస్తు న్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నో జాతరలు జరుగుతాయి. ఆదివాసీ జాతరలు విభిన్నంగా, వినూత్నంగా సాగు తాయి. ఆసి యాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క, సారలమ్మ జాతర ప్రతి రెండేళ్లకో సారి కన్నుల పండువగా సాగుతుంది.

       భిన్నభాషలు, భిన్న సంస్కృతులు, భిన్న ఆచార వ్యవహరాలు, ఎన్నో సంప్రదాయలు పుణ్య భారతావనిలో కన్పి స్తాయి. కొండ, కోన, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు, అడవి బిడ్డలు తమ పిల్లా, పాపలు చల్లగా ఉండాలని, ఏ విపత్తులు లేకుండా చూడాలని ఆరాధ్యదేవతలను ప్రార్థిస్తూ జాతరలను నిర్వహించుకుంటారు. తమ తెగలకు సంబంధించిన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించు కోవడానికి ఆదివాసీలు జాతరలు చేసుకుంటారు. ఆటపాటలతో, ఆనందోత్సవాలతో గిరిజనులు జాతర నిర్వహించుకుంటారు. జాతరల్లో అగ్రగామి జాతరగా సమ్మక్క, సారలమ్మ జాతర కు పేరుంది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరగా సమ్మక్క, సారలమ్మ జాతరకు పేరుంది.

        గుడి, గోపురం, రూపం…ఇవేమీ కానరాకపోయినా….గిరిపుత్రుల వరప్రదాయిని అమ్మవార్లు ప్రతి రెండేళ్ల కోసారి అపూర్వరీతిలో దర్శనమిస్తారు. కోట్లాది మంది భక్తులను ఆశీర్వదిస్తారు. భక్తుల పాలిట కొంగుబంగారంలా వుండే సమ్మక్క, సారలమ్మ తల్లుల మేడారం జాతర రెండేళ్లకోసారి అత్యద్భుతంగా నిర్వహిస్తారు. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. రెండోళ్లకొకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు దేశ,విదేశాల నుంచి తండోపతం డాలుగా భక్తులు తరలివస్తారు.

     మేడారం సమ్మక్క సారక్క మహజాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది. ఫిబ్రవరి 21న మాఘశుద్ధ ద్వాదశి గుడి మెలిగే పండుగతో పాటు సారలమ్మ దేవత, గోవిందరాజులు, పగిడిద్దరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఆ రోజు నుండే అసలైన జాతర మొదలవుతుంది. 22న మాఘశుద్ధ త్రయోదశి కంకవనం గద్దె దగ్గరకు సమ్మక్క చేరుకుం టారు. 23న సమ్మక్క-సారలమ్మ దేవతలు, గోవిందరాజులు, పగిడిద్దరాజుకు భక్తులు మొక్కులు చెల్లిస్తారు. 24న దేవతలు వనప్రవేశం చేస్తారు. ఫిబ్రవరి 28న మాఘ శుద్ధ బహుళ పంచమినాడు తిరుగు వారం పండుగను నిర్వహిస్తారు. ఆ రోజుతో మేడారం మహా జాతర క్రతువు ముగుస్తుంది.

       సమ్మక్క, సారలమ్మ జాతరకు సంబంధించి ఎన్నెన్నో గాథలు వున్నాయి. 13వ శతాబ్దంలో కాకతీ యుల సామంత రాజు పడిగిద్ద రాజు మేడారం ప్రాంతాన్ని పాలించాడు. ఓ ఏడాది కరువు రావడంతో పగిడిద్దరాజు కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రునికి కప్పం చెల్లించలేకపోతాడు. కాకతీయ సేనాధిపతి యుగంధరుడు మేడారంపై దండయాత్ర సాగిస్తాడు. ఈ యుద్ధంలో పగిడిద్దరాజు, ఆయన సేనాని జంపన్న మృతి చెందుతారు. పగిడిద్దరాజు సేనాని పేరిట ఏర్పడిన అలుగే జంపన్న వాగు. పగిడిద్దరాజు, జంపన్నల మృతి వార్త విన్న సమ్మక్క, సారలమ్మలు తమ గిరిజన పరివారంతో కాకతీయ సేనాపతి యుగంధరుడిపై పోరాటం చేశారు. ఈ వీరోచిత పోరాటంలో సమ్మక్క మృతి చెందగా, సారక్క మన్యం వాసుల క్షేమం కోసం అడవులకు వెళ్లింది. సమ్మక్క, సారలమ్మలు చూపిన సాహసం, త్యాగనిరతి వారిని ఆరాధనీయ దేవతా మూర్తులుగా చేశాయి.

        సమ్మక్క తల్లిని అడవి బిడ్డలు దైవాంశ సంభూతురాలిగా కొలుస్తారు. ఇందుకు..సంబంధించిన ఓ కథ ఎంతో ప్రాచుర్యం చెందింది. పొలవాస గిరిజన పాలకుడు మేడరాజు వేటకెళ్లినప్పుడు…అద్భుత దృశ్యం అక్కడ కనిపించింది. భయంకర కీకారణ్యంలో, విషసర్పనిలయమైన పుట్ట చెంత ముద్దులు మూటగట్టే చిన్నారి పాప కేరింతలు కొడుతుండగా….ఆ చిన్నారి చుట్టూ వ్యాఘ్రాలు, మృగరాజులు రక్షణ గా నిలిచివున్నాయి. సంభ్రమాశ్చర్యాలు కల్గించే ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకించిన మేడరాజు.. గ్రామస్థుల కు తెలియజేశాడు. ఆ పాప సామాన్య మానవమాత్రురాలు కాదని, దైవాంశ సంభూతురాలని ఆ పల్లె వాసులందరూ నిర్ణయానికొచ్చారు.మేడరాజు ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. సమ్మక్క కారణ జన్మురాలు, దైవాంశ సంభూతురాలు అని భావించిన గ్రామీణ ప్రజల భావన అనంతర కాలంలో నిజమైంది. గ్రామమంతా కరువు పరిస్థితులతో అల్లాడుతున్నప్పుడు..ఆ గ్రామాన్ని సమ్మక్క సస్యశ్యా మల పల్లెగా సుభిక్ష గ్రామంగా మార్చింది. దీర్ఘకాలిక రోగాలను ఆకు పసరు వైద్యంతో కాపాడిన వైద్యురాలిగా, ప్రాణాలపై ఆశలు వదులుకున్న వారి ప్రాణాలు నిలిపిన దేవతగా సమ్మక కీర్తి ప్రతిష్ఠలు గడించింది. దినదిన ప్రవర్థమానంగా పెరిగి యుక్త వయస్సులో అడుగిడిన సమ్మక్కకు వివాహం చేయడానికి మేడరాజు సంసిద్ధం అయ్యాడు. తన మేనల్లుడు, మేడారం పాలకుడైన పగిడిద్ద రాజుకు ఆమెనిచ్చి పెళ్లి చేశాడు. పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు.

     కరువు కాటకాల వల్ల కోయరాజు పగిడిద్దరాజు కప్పం కట్ట లేకపోవడాన్ని ధిక్కారంగా భావించిన కాకతీయ సేనాని యుగంధరుడు…మాఘ శుద్ధ పౌర్ణమినాడు మేడారంపై దండయాత్ర సాగించాడు. సంప్రదాయ ఆయుధాలతో పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుంచి వీరోచిత పోరాటం చేస్తారు. కాకతీయు సేనాని అపార సైన్యంతో దండయాత్ర సాగించడంతో..మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణి స్తారు. తన వారందరిని కోల్పోయిన జంపన్న ఆవేదన చెంది సంపెంగ వాగులో దూకేస్తాడు. అప్పటి నుంచి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఈ విషయం తెలిసిన సమ్మక్క సమరాంగాన కొదమ సింహంలా దుమికి శతృసైన్యానికి చెమటలు పట్టించి వీరోచిత పోరాటం సాగించింది. సమ్మక్క యుద్ధ నైపుణ్యానికి కాకతీయ పాలకుడైన ప్రతాప రుద్రుడు ఆశ్చర్యచకితుడుయ్యాడు. శత్రు సంహారం చేసి…రక్తసిక్తమైన స్థితిలో చిలుక గుట్ట వైపునకు వెళ్లిన సమ్మక్క…అక్కడే అదృశ్యమైంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన ఆమె అనుచ రులకు… ఆ ప్రాంతంలో ఒక పుట్ట వద్ద పసుపు, కుంకుమలు గల భరిణె కనిపించింది. ప్రధమంగా మేడరాజుకు పుట్ట వద్దే సమ్మక్క దర్శన మిచ్చింది. చివరగా పుట్ట వద్దే పసుపు, కుంకుమల భరిణ వుంచి ఆ మహనీయురాలు అదృశ్య మైంది. అంతటి మహిమాన్వితురాలైన సమ్మక్కకు ప్రతి రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజునుంచి నాలుగు రోజులపాటు మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు.

    ఆసియాఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క, సారలమ్మ జాతర యునెస్కో గుర్తింపు పొందింది. ఉమ్మడి ఏపీగా వున్నప్పుడు 1996లో అప్పటి ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది. గిరిజన పూజారుల ఆధ్వర్యంలో జరిగే ఈ ఆదివాసీ జాతరలో గిరిజన, గిరిజ నేతర అనే తేడా లేకుండా కోట్లాది మంది భక్తులు హాజరవుతారు. నాలుగు రోజుల సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండో రోజున చిలుకల గుట్ట గడ్డపై సమ్మక్క ను ప్రతిష్ఠిస్తారు. మూడో రోజు గద్దెలపై అమ్మవార్లు ఇద్దరిని కొలువు చేస్తారు. నాలుగో రోజు అమ్మవారులిద్దరిని కొలువు చేశాక, తిరిగి యుద్ధరంగానికి తరలిస్తారు. దీంతో జాతర సమాప్తమవుతుంది.

    ప్రపంచంలోనే పెద్ద జాతరగా మేడారం జాతర పేరు తెచ్చుకోగా, మరికొన్న ప్రాధాన్యం చెందిన జాతరలు గాను పేరుపొందాయి. దేశం ఈశాన్య ప్రాంతం చాలాభాగం కోండలు, కోనలు, అడవులతో నిండి వుంది. అక్కడ వార్షిక, మాస, పక్షాలే కాక దినసరి జాతరలు సైతం కన్పిస్తాయి. ఇక జార్ఖండ్, ఒడిశా, తెలంగాణల్లో జరిగే గిరిజన జాతరల్లో ఎన్నో ప్రత్యేకతలతో పాటు ప్రకృతి ఆరాధన కనిపిస్తుంది. త్రిపుర రాష్ట్రంలో రీంగ్ తెగ ఆదివాసీలు గరియ మాత జాతరను ఘనంగా నిర్వహిస్తారు. కాటన్ దారం వెదురు దండెం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. దేవీ భక్తులు ఈ దండాన్ని చేతబట్టి గ్రామాల్లో సంచ రిస్తారు. గరియ మాతను కీర్తిస్తూ పాటలు పాడతారు, ఆటలు ఆడతారు. పంటలు బాగా పండాలని, ఇతి బాధలు దరిచేరకుండా ఉండాలని దేవతను ప్రార్థిస్తూ.. ఈ సంబరాలు చేసుకుంటారు. ఏ జాతరలోలేని విధంగా.. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో బంగారాన్ని బెల్లంగా పిలుస్తారు. ఇక్కడ తాము ఎంత బరువు ఉన్నామో చూసుకుని.. నిలువెత్తు బెల్లం బంగారాన్ని అమ్మవార్లకు మెుక్కు కింద భక్తులు సమ ర్పిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ బంగారాన్ని అందజేస్తారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్దకు వెళితే.. బంగారం తోనే నిండిపోయి కనిపిస్తుంది. ఈ సంప్రదాయం తొలి నుంచి కొనసాగు తూనే ఉంది. అయితే ఇక్కడ బెల్లం బంగారంగా పిలిచేందుకు ఒక్కొక్కరు ఒక్కొ కథ చెబుతుంటారు. ఎవరేం చెప్పినా.. అమ్మ వార్లకు తృప్తిగా బెల్లాన్ని సమర్పిస్తే.. చల్లగా చూస్తుందని భక్తులు నమ్ముతుంటారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్