ఒక్కసారిగా అందరి చూపు మళ్లీ ఆదేశం వైపు మళ్లింది. ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరో వైపు అక్కడ నిమ్మకాయలకు భారీ డిమాండ్ పెరిగింది. ప్రజలు వాటి కోసం ఎగబడుతున్నారు. ఇంతకీ ఏదేశం అది ఏమా కథ…ఒకసారి తెలుసుకుందామా!
చైనాలో నిమ్మకాయలను ప్రజలు విపరీతంగా కొంటున్నారు. మొన్నటి వరకు రోజుకు నాలుగైదు టన్నుల విక్రయాలు జరిగే నిమ్మకాయలు, నేడు 20 నుంచి 30 టన్నుల వరకు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా భారతీయులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇవన్నీ ఎందుకని అనుకుంటున్నారా? అదేనండి కోవిడ్ మహమ్మారి మళ్లీ చైనాలో విజృంభించింది.
జీరో కోవిడ్ కి తీసుకురావాలని చైనా ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధించింది. దీంతో పనుల్లేక, బయటకు వెళ్లలేక, పస్తులతో చావలేక, పిల్లలను చూస్తూ ఉండలేక ఆంక్షలు సడలించమని ప్రజలు ఆందోళన చేశారు. అది ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, అది క్రమేణా ప్రజల తిరుగుబాటుగా మారి, అధ్యక్షుడినే మార్చే స్థితికి వెళ్లడంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుని ఆంక్షలను సడలించారు.
ఒక్కసారిగా కోవిడ్ తీవ్రత మళ్లీ పెరిగిపోయింది. దీంతో రాబోయే మూడు నెలల్లో చైనాలో 60 శాతం ప్రజలు కోవిడ్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వందల మృతదేహాలను శ్మశాన వాటికలకు తీసుకువస్తున్నట్టు మీడియా కథనాలు వస్తున్నాయి. ఈక్రమంలో ప్రజలందరూ హడలిపోయి… వ్యాధి నిరోధక శక్తినిచ్చే నిమ్మకాయలను కొనుక్కుని తాగేస్తున్నారు. దీంతో ఉన్నట్టుండి వాటికి ఒక్కసారిగా డిమాండ్ వచ్చింది.
బీజింగ్, షాంఘై తదితర నగరాల్లో నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. పలువురు మాత్రం భారతీయుల్లా వంటింటి వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. యూట్యూబ్ ఛానళ్లలో మన కరోనా వైరస్ విరుగుడు పానీయాలను తయారు చేసుకోవడానికి సన్నాహాలు మొదలుపెట్టారంట. ఇంకా నిమ్మకాయలతో పాటు నారింజలు, పీయర్స్, పీచ్ వంటి పండ్లకు భారీ డిమాండ్ వచ్చింది. వీటి కోసం దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరి మరీ కొంటున్నారు.