బీఆర్ఎస్ నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్‌ఎస్ భావించింది. అయితే, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు షరతులతో కూడిన పర్మిషన్ మంజూరు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నల్లగొండలో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రైతు భరోసాను రూ.15 వేల నుంచి రూ.12 వేలకు కుదించడం, రూ.4 వేల పింఛన్, మహిళలకు రూ.2,500, విద్యార్థినులకు స్కూటీలు వంటి పథకాలను అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ తీరును ఎండగడతామంటూ బీఆర్‌ఎస్ ఈ మహాధర్నాను తలపెట్టింది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొనున్నారు.