ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే నానుడి ఇండియా కూటమికి సరిగ్గా వర్తిస్తుంది. బీజేపీయేతర పార్టీల శిబిరంగా కిందటి ఏడాది పాట్నాలో ఇండియా కూటమి ఏర్పడింది. పాట్నా, బెంగళూరు, ముంబై నగరాల్లో ఇండియా కూటమి వరుస సమావేశాలు నిర్వహించుకుంది. ప్రస్తుతం ఇండియా అలయన్స్‌లో 28 పార్టీలున్నాయి. మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయి. అయినప్పటికీ బీజేపీని అధికారం నుంచి దించేయడం మినహా, ఇండియా అలయన్స్ కు ఒక స్పష్టమైన అజెండా అంటూ ఏమీ కనిపించడం లేదు. ఇండియా కూటమి నాయకత్వం విషయమై ఇప్పటికీ భాగస్వామ్య పార్టీల మధ్య ఒక స్పష్టత అంటూ ఏర్పడలేదన్న ఆరోపణలు హస్తిన రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇండియా కూటమి సారథ్యం ఇటీవలనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు దక్కింది. అంతేకాదు కన్వీనర్ అనే మరో కీలక పదవి ఆఫర్ బీహార్ ముఖ్యమంత్రి, జేడీ యూ అధినేత నితీశ్ కుమార్ దక్కింది. అయితే ఈ ఆఫర్ ను నితీశ్ కుమార్ సున్నితంగా తిరస్కరించారు. ఇలా కన్వీనర్ పదవిని నితీశ్ కుమార్ తిరస్కరించడంలో ఏదో ఒక మతలబు ఉంటుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. నితీశ్ కుమార్‌ను బీహార్ రాజకీయాలలో ఆధునికుడిగా చెబుతారు. అయితే నితీశ్ స్వతహాగా చిన్నచిన్న పదవులతో సంతృప్తిపడే బాపతు కాదన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో నెలకొంది. ఒకదశలో ఏకంగా ఇండియా కూటమి నాయకత్వాన్నే నితీశ్ కుమార్ ఆశించినట్లు చెబుతారు. ఇండియా అలయన్స్ చీఫ్‌గా ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని పదవి అభ్యర్థి కావాలన్నది నితీశ్ కుమార్ ఆశ అనేది హస్తిన పొలిటికల్ సర్కిల్స్ టాక్. అయితే అలయన్స్‌లో అతి పెద్ద పార్టీ కాంగ్రెస్ కావడంతో మిగతా భాగస్వామ్యపక్షాలు వెనక్కి తగ్గాయి. దీంతో కాంగ్రెస్ నాయకుడికే ఇండియా కూటమి అధ్యక్ష పదవి లభించింది.ఈ ఆశాభంగంతోనే కన్వీనర్ పదవిని కూడా నితీశ్ కుమార్ వద్దని చెప్పి ఉండొచ్చు అంటారు రాజకీయ పరిశీలకులు.
ఇండియా కూటమి అధ్యక్ష పదవి దక్కకపోయిన నేపథ్యంలో నితీశ్ కుమార్ ఇప్పుడు ఏం చేస్తారన్న ప్రశ్న తెరమీదకు వచ్చింది. వాస్తవానికి నితీశ్ కుమార్ సోషలిస్టు ఐడియాలజీతో ప్రభావితుడైన నేత. జయప్రకాశ్ నారాయణ ఆయన రాజకీయ గురువు. సెక్యులర్ వాదిగా పేరున్న నితీశ్ కుమార్ చాలా కాలం పాటు బీజేపీకి దూరంగా ఉన్నారు. అయితే బీహార్ లో రాష్ట్రీయ జనతాదళ్ ను దెబ్బతీయడానికి ఒక దశలో కమలం పార్టీతో నితీశ్ చేతులు కలిపారు.
2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీని ఎన్డీయే కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని నితీశ్ కుమార్ వ్యతిరేకించారు. అంతటితో ఆగలేదు. ఎన్డీయే కూటమి నుంచి నితీశ్ బయటకు వెళ్లారు. అదే సమ యంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ పార్టీగా పేరు పడిన ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని నితీశ్ కుమార్ అధికారంలోకి వచ్చారు. అయితే నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత నితీశ్ మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరారు. కొంతకాలం బీహార్ లో జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. దీంతో పార్టీలు మారడంలో ఘనాపాఠిగా జాతీయ రాజకీయాల్లో నితీశ్ పేరుతెచ్చుకున్నారు.అందుకనే నితీశ్ కుమార్‌ను ఏ రాజకీయ పార్టీ అంత త్వరగా నమ్మదు.
లోక్‌సభ ఎన్నికల నాటికి ఇండియా కూటమిలో అనేక మార్పులు సంభవించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నా యి. ఇటీవల చత్తీస్‌గఢ్,రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తరువాత నితీశ్ కుమార్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇండియా కూటమి వ్యవహారాల్లో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తుందని ఆయన మండి పడ్డారు.ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి వైపుగా నితీశ్ కుమార్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలే దంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితంగా సమాజ్‌వాదీ పార్టీ – కాంగ్రెస్ మధ్య దూరం పెరిగింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ కొన్ని సీట్లు అడిగింది. అయితే సమాజ్‌వాదీ పార్టీ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకులు అంగీకరించలేదు. దీంతో రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ – సమాజ్ వాదీ పార్టీ మధ్య పొత్తు కొనసాగుతుందా ? అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ ప్రస్తుతం తమ స్వంత ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నాయి.అంతేతప్ప, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో కూటమి సమష్టి ప్రయోజనాల కోసం తాపత్రయపడ టం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలాఉంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తోం దన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.


