డాక్టర్ గారూ.. మా రాముడు ఆనాడే పుట్టాలి.. దయచేసి జనవరి 22నే మాకు సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డకు జన్మనివ్వండి.. అని కాన్పూర్ లో చాలామంది గర్భిణీ స్త్రీలు డాక్టర్లకు విజ్ఞప్తి చేయడం సంచలనం కల్గిస్తోంది. అయోధ్య లో జనవరి 22న శ్రీ రామ మందిరంలో బాల రామ విగ్రహ ప్రతిష్ఠ కు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ శుభ ము హూర్తం రోజునే.. తమ బిడ్డ జన్మిస్తే.. అద్భుతంగా ఉంటుందని… సాక్షాత్ రాముడే తమ కడుపున పుట్టినట్లు ఆనంద పడతామని పలువురు మహిళలు కోరుతున్నారు.
కాన్పూర్ లోని గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజీ కి చెందిన మాతాశిశు ఆసుపత్రిలో జనవరి 22న సిజేరియన్ డెలివరీ చేయాలని పలువురు గర్భిణులు వైద్యులను లిఖిత పూర్వకంగా కోరారు. నెలలు నిండి కాన్పు తేదీ.. జనవరి 18- 26 మధ్య ఉన్న మహిళలు ఎక్కువగా ఈ విధంగా కోరుతున్నారు 15 మంది మహిళలు వైద్యులను అదే రోజు “రామ జననం” జరిగేటట్లు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లోనే కాదు.. ప్రైవేటు ఆసుపత్రు లలోనూ ఇలా విజ్ఞప్తి చేస్తున్న గర్భిణులెందరో.. రామ విగ్రహ ప్రతిష్ఠనాడే తమకు బిడ్డ పుడితే రాముడి వంటి మంచి లక్షణాలు బిడ్డకు వస్తాయని ఆ తల్లులు భావిస్తున్నారు. అందుకే మహిళల విజ్ఞప్తి మేరకు జనవరి 22 న కనీసం 35 సిజేరియన్ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆస్పత్రి డాక్టర్ సీమా ద్వివేది వెల్లడించారు.
హిందువుల పంచాంగం ప్రకారం శ్రీరాముడు చైత్రశుద్ధ నవమినాడు జన్మించాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం జనవరి 22 అభిజిత్ ముహూర్తంతో కలిసి, భారత కాలమానం ప్రకారం ఉదయం 11:51 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:33 గంటలకు ముగుస్తుంది. భద్రాచలంలో సీతా రామ కల్యాణం కూడా అభిజిత్ లగ్నంలోనే చైత్రశుద్ధ నవమి నాడు జరు గుతుంది. ఈ కాలంలో శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు కాబట్టి ఇది హిందువులకు శుభ సమ యం. హిందూ పురాణాల ప్రకారం, ఈ కాలం ఒకరి జీవితంలోని ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. జనవరి 22 న మృగ శిర నక్షత్రం భారత కాలమానం ప్రకారం తెల్లవారు జామున 03:52 గంటలకు ప్రారంభమై జనవరి 23 తెల్లవారుజామున 04:58 గంటల వరకు ఉంటుంది. జనవరి 22న అమృత్ సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం కూడా కలిసి వస్తాయని, అందుకే .. శ్రీ రామ మందిర ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆ శుభ ముహూర్తాన్ని నిర్ణయించామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి మహంత్ గోవింద్ దేవ్ గిరి తెలిపారు.
జనవరి 22 ప్రపంచంలో ఉన్న హిందువులకే కాక మానవాళి అందరికీ పండుగ కానున్నదని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అన్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం ఎంత ముఖ్యమో.. ఇక ముందు హిందు వులకు జనవరి 22 కూడా అంతే ముఖ్యమని, ఇక ప్రతి జనవరి 22 దేశప్రజలందరికీ పండుగే నని చంపత్ రాయ్ తెలి పారు. సకల గుణాభిరాముడు, మర్యాదా పురుషోత్తముడైన రాముడిని ప్రేమించని వారు ఉండరు. ఆనాడు పుట్టే బిడ్డ లందరూ.. శ్రీరాముడి సుగుణాలను పుణికి పుచ్చుకోవాలని ఆశిద్దాం. జనవరి 22 పుట్టిన ప్రతి పిల్లాడు రాముడే.. ప్రతి ఆడబిడ్డ.. సీతే.