ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేళ కొత్త కొత్త డిమాండ్‌లు తెరపైకి వస్తున్నాయి. అందులోనూ ప్రతిపక్ష పార్టీలలో ఇలాంటివి మరిన్ని ఎక్కువగా విన్పిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనది మహిళలకు అసెంబ్లీ టికెట్ల కేటాయిం పు. అవును… ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పులలో భాగంగా గుంటూరు పార్లమెంటు పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాలను వైసీపీ… మహిళలకు కేటాయించడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో.. విపక్ష పార్టీల్లోనూ మహిళలకు సీట్లు కేటాయిం చాలన్న డిమాండ్ విన్పి స్తోంది. మరి.. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు ఏం చేయబోతున్నాయి ? అధికార పార్టీ మాదిరి గానే మహి ళా అస్త్రాన్ని ప్రయోగించబోతున్నాయా ? ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఇదే చర్చ జోరుగా సాగు తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంటు ఎన్నికలతోపాటు అసెంబ్లీకి ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పుల పేరుతో 60 మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్. ఇందులో భాగంగా పలువురు సిట్టింగ్‌లకు ఝలక్ ఇవ్వగా… కొందరికి స్థాన భ్రంశం కలిగిం చారు. ఈ క్రమంలోనే గుంటూరు నగర పరిధిలో కొత్త అభ్యర్థులు తెరపైకి రాబోతున్నారు. అవును… గుంటూరు పశ్చిమం, గుంటూరు తూర్పు పేరుతో రెండు నియోజకవర్గాలు పూర్తిగా నగర పరిధిలోనే ఉంటాయి. పైగా ఇవి జిల్లా కేంద్రం లోని నియో జకవర్గాలు కావడంతో అన్ని పార్టీలకు ఇవి అత్యంత కీలకమనే చెప్పాలి. పైగా రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉండేవి కావడంతో పొలిటికల్‌గా రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. 2019 నాటి ఎన్నికల ఫలితాలను ఈ సందర్భంగా ఓసారి గమ నిస్తే… గుంటూరు నగరంలో ఉన్న రెండు సీట్లను టీడీపీ, వైసీపీ చెరొకటి గెలుచుకున్నాయి. గుంటూరు పశ్చిమ సీటులో సైకిల్ జోరుగా తిరగగా… గుంటూరు తూర్పు స్థానంలో ఫ్యాన్ పార్టీ జోరు చూపించింది. అయితే.. రానున్న ఎన్నికల్లో ఈ రెండు సీట్లలోనూ సత్తాచాటాలని, తామే ఈ రెండింటినీ కైవసం చేసుకోవాలని అధికార వైసీపీయే కాదు.. ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి సైతం వ్యూహాత్మకంగా పావులు కదుపు తున్నాయి.
గెలుపే లక్ష్యంగా పలు నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తూ పోతున్న అధికార వైసీపీ… గుంటూరు నగరంలో ఉన్న రెండు స్థానాలకు కేండిడేట్లను ఖరారు చేసింది. అయితే.. ఇందులో గుంటూరు పశ్చిమ స్థానం నుంచి మంత్రి విడుదల రజనీ పోటీ చేయబోతున్నారు. నియోజకవర్గ ఇన్ ఛార్జ్‌ల మార్పులు చేర్పుల్లో భాగంగా అంతకుముందు చిలకలూరిపేట నుంచి పోటీ చేసి విజయం సాధించిన విడుదల రజనీకి స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో స్థాన చలనం కలిగించారు సీఎం జగన్. దీంతో.. పశ్చిమ స్థానంలో రాజకీయం రసవత్తరంగా మారిందన్న వాదన బలంగా విన్పిస్తోంది. ఇక, గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ముస్తఫా కూతురు నూరీ ఫాతిమాకు సీటు ఖరారు చేశారు జగన్. అంతేకాదు… వీరిద్దరితోపాటు గుంటూరు పార్లమెంటు పరిధిలోని తాడికొండ నియోజకవర్గాన్ని కూడా మహిళకు కేటాయించింది వైసీపీ. మాజీ హోంమంత్రి సుచరితకు టికెట్ ఇచ్చారు జగన్. కేవలం ఇవే కాదు… గుంటూరు పార్లమెంటు పరిధిలోని మరో నియోజకవర్గాన్ని కూడా మహిళలకు కేటాయించేందుకు సీఎం జగన్ యోచి స్తున్నారన్న టాక్ బలంగా విన్పిస్తోంది. అన్నీ అను కున్నట్లుగా జరిగితే… ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సతీమణి రావెల జ్యోతిని పోటీకి దించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కొత్తగా కేటాయించబోతున్న స్థానం సంగతి కాస్త పక్కన పెడితే.. మొత్తంగా గుంటూరు నగర పరిధిలోకి వచ్చే మూడు స్థానాలను మహిళలకు ఇవ్వడంతో సహజంగానే ఇతర పార్టీలు.. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీపై ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో.. టీడీపీలోనూ మహిళలకు గుంటూరు నగర పరిధిలో కచ్చితంగా సీటు కేటాయించాలన్న డిమాండ్ విన్పించ డం మొదలైంది. ఈ క్రమంలోనే పలువురు మహిళా నేతల పేర్లు విపక్ష పార్టీల నుంచి ప్రచారంలోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఎక్కువగా విన్పిస్తున్న పేరు కాపు సామాజిక వర్గానికి చెందిన పోతురాజు సమత. నగర పాలక సంస్థ ఆరవ డివిజన్ నుంచి బైఎలక్షన్లలో పోటీ చేసి అధికార పార్టీ అభ్యర్థిని ఓడించడంతో సమత పేరు గట్టిగా విన్పించడం మొదలైంది. అంతేకాదు.. సమత కుటుంబానికి గుంటూరు నగరంలో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. గతంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేసిన పోతురాజు రాజ్యలక్ష్మి కోడలే సమతా. దీంతో.. ఈమె పేరు గుంటూరు పశ్చిమం లేదంటే గుంటూరు తూర్పు నియోజకవర్గానికి అభ్యర్థిగా విన్పిస్తోంది.
ఈ ప్రచారం జోరుగా సాగటానికి మరో కారణం.. ఇటీవలె పోతురాజు సమతా తన పుట్టినరోజు సందర్భంగా నగరం అంతా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు..తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేకంగా కార్యాలయం కూడా ఏర్పాటు చేయడంతో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి తాను పోటీలో ఉన్నా నంటూ ఆమె సంకేతాలు ఇచ్చినట్లయిందంటు న్నారు పార్టీ శ్రేణులు. కేవలం ఈమె ఒక్కరే కాదు.. వైసీపీ కేటాయించిన సీట్లతో టీడీపీ సైతం కచ్చితంగా మహిళలకు సీట్లివ్వాల్సిన పరిస్థితి రావడంతో పది నుంచి పన్నెండు మంది వరకు మహిళా నేతలు తెలుగుదేశం టికెట్ల కోసం వేచి చూస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు సీట్లు కేటాయి స్తే… కచ్చితంగా వైసీపీని ఓడించి మరీ గుంటూరు నగర పరిధిలో టీడీపీ జెండా ఎగరవేస్తామని దీమా వ్యక్తం చేస్తున్నా రు. ఓవైపు టీడీపీ జనసేన కూటమి సీట్ల సర్థుబాటు విషయంలో ఓ అవగాహనకు వచ్చినా.. బీజేపీ కూడా కలిసి వస్తుం దన్న ప్రచారంతో అభ్యర్థుల జాబితా ఇంకా విడుదల చేయలేదు. ఇందుకోసం మరికొంత సమయం పట్టేలా కన్పిస్తోంది. మరి స్థానికంగా విన్పిస్తున్న డిమాండ్ మేరకు టీడీపీ…మహిళలకు పెద్దపీట వేస్తుందా అంటే కచ్చితంగా వేస్తుందనే చెబుతున్నారు తెలుగుదేశం నేతలు.


