మాల్దీవుల పార్లమెంటు రణరంగంగా మారింది. ఎంపీల తోపులాటలు, ముష్టిఘాతాలతో అట్టుడికి పోయింది. మహమ్మద్ ముయిజ్జు నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఓ తీర్మానంపై ఓటింగ్ సమయంలో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మాల్దీవుల కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై పార్లమెంటులో ఆదివారం ఓటింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో అధికార, విపక్ష ఎంపీలు సభ లో గందరగోళం సృష్టించారు. పోడియం పైకి వెళ్లిన కొందరు సభ్యులు స్పీకర్ కార్యకలాపాలను అడ్డుకున్నారు. మరికొం దరు సభ్యులూ అక్కడికి చేరుకొని స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. బెంచీల పైనుంచి దూసుకెళ్లారు. స్పీకర్‌ను తోసివేసే ప్రయత్నం చేశారు. అనంతరం ఎంపీలు ఒకరిపైఒకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ఎంపీలు కిందపడి దొర్లుతున్నట్లు వీడియోలో కనిపించింది. ఇందులో ఒక ఎంపీ కాలుతో తన్నడం కనిపించింది. సభ్యుల మధ్య వాగ్వాదం, ముష్టిఘాతాలకు సంబంధించిన దృశ్యాలు మరికొన్ని వీడియోల్లో కనిపించాయి.