నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. కూరగాయల ధరలు అందుబాటులో లేని వేళ.. టమాటా ఎగ్ కూర వండుకుని తిందామన్నా కష్టమవుతోంది. 80 పెడితే కానీ డజను గుడ్లు దొరకడం లేదు. కోడి కూరతో తిందామనుకుం టే.. చికెన్ ధరలూ భారీగా పెరిగాయి. రెండు రోజుల క్రితం లైవ్ కోడి ధర 140 రూపాయలు ఉండగా అది నిన్నటికి 160 కు పెరిగింది. స్కిన్‌లెస్ 240కు చేరింది. బియ్యం ధరలు రోజుకోలా పెరుగుతున్నాయి. నవంబరు మొదటివారంలో హెచ్‌ఎంటీ సోనామసూరి బియ్యం కిలో 65 రూపాయలు ఉండగా డిసెంబరు నాటికి 75 అయ్యింది. మంగళవారం కిలో 80 రూపాయలు అయ్యింది.
బియ్యం ధరలు గణనీయంగా పెరిగాయని రైసు మిల్లర్ల సంఘం ప్రతినిధులు అంటున్నారు. పంట చేతికొస్తున్న సమ యంలో ఆంధ్రలో తుపానుతో వరి పంటలు కొట్టుకుపోవడంతో ధరలు పెరిగాయి. ప్యాకింగ్, రవాణా ఛార్జీలతో క్వింటా 6 వేల 500 రూపాయల నుంచి 7 వేల వరకూ అవుతోందన్నారు. రిటైల్‌లో కిలో 75 నుంచి 80 వరకూ ఉంటుం దన్నారు. జై శ్రీరామ్ రకం పాత బియ్యం క్వింటా 7వేల 500 నుంచి 8 వేలు ఉంది. విజయ మసూరి బియ్యం క్వింటా 5 వేల 900 నుంచి 6 వేల 300 వరకూ పలుకుతోంది.
కూరగాయల ధరలు కిలో 80కి పైగా ఉండడంతోపాటు పండగలు, వేడుకలు, పెళ్లిళ్లు ఉండడంతో మాంసం ధరలు కూడా బాగా పెరుగుతున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా నగరంలో 5 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరిగాయి. పొట్టేలు మాంసం కూడా కిలో 20 రూపాయలు పెరిగింది. విత్‌బోన్ మటన్ కిలో 820 ఉంది. బోన్‌లెస్ మటన్ కిలో వెయ్యి 20 అయ్యింది. కోడిగుడ్ల వినియోగం కూడా బాగా పెరగడంతో పాటు.. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవ్వడంతో డజన్ 75 నుంచి 80 రూపాయల చొప్పున అమ్ముతున్నారు.


