రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఇందుకు ‘సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో నాలుగు చోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో ఇవాళ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. సుమా రుగా 15 ఎకరాల స్థలంలో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ముఖ్య మంత్రి జగన్‌మోహన్ ప్రసంగిస్తారు. అంతేకాక.. నియోజకవర్గాల వారీగా పలువురు కార్యకర్తలతో కూడా సీఎం ముఖా ముఖి మాట్లాడనున్నారు.