టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించు కుంది. ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. పార్టీల మధ్య పొత్తుల అంశాన్ని తేల్చేందుకు ప్రధాన పార్టీల అధినేతలు దూకుడు పెంచారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యేం దుకు హస్తిన బాట పట్టారు. టీడీపీతో పొత్తు ఖరారవుతుందని ఏపీ బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కలిసి వెళ్లడమే మేలనుకుంటున్నారు. ఫిబ్రవరి 9న ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ముందే వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. 2014లో బీజేపీ-జనసేన-టీడీపీ కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే చంద్రబాబుకు ఆహ్వానం వచ్చి ఉంటుందని ఏపీ బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల వేళ బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా కేంద్రం నుంచి రాజకీయ మద్దతు మాత్రం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.


