తమిళ పాలిటిక్స్ ను సినీ స్టార్లు శాసించిన మాట వాస్తవం. అయితే రాజకీయాల్లోకి ప్రవేశించిన సినీ తారలందరూ సక్సెస్ కాలేదు. కొంతమంది ఎంట్రీ ఇచ్చాక ఫెయిలయ్యారు. మరికొంతమంది వస్తా..వస్తా అంటూనే చివరిక్షణంలో చేతులెత్తేశారు. తమిళనాట కమల్‌హాసన్ ఓ సూపర్ స్టార్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్కక్కర్లేదు. కమల్‌ను నటనకు నిలువెత్తు ప్రతీక అంటారు సినీ విమర్శకులు. ఎవరో సలహా ఇచ్చారో కానీ, కమల్‌హాసన్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మక్కల్ నీది మయ్యుయ్ పేరుతో రాజకీయరంగ ప్రవేశం చేశారు. అయితే కమల్‌హాసన్ పార్టీకి జనాదరణ లభించలేదు. సినీరంగంలో ఆర్టిస్ట్‌గా సక్సెస్ అయినప్పటికీ, పాలిటిక్స్‌లో కమల్‌హాసన్ ఫెయిల్యూర్ కిందే లెక్క.
రజనీకాంత్, తమిళ సినీరంగంలో ఆయనొక సునామీ. తమిళనాట ఆయనకున్న క్రేజే వేరు. నాలుగు దశాబ్దాలకు పైగా తమిళ సినీరంగాన్ని ఆయన శాసిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. రజనీ స్వయంకృషితో స్టార్ గా…సూపర్ స్టార్ గా ఎదిగారు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే ఆ సందడే వేరుగా ఉంటుంది.‘‘ నేను ఒకసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే’’….బాషా సినిమాలో రజనీకాంత్ నోటి వెంట వచ్చిన ఈడైలాగ్ అద్భుతంగా పేలింది. అయితే ఈ డైలాగ్ రజనీ సినిమాలకే పరిమితం. నిజ జీవితానికి ఏమాత్రం వర్తించదు. ఎందుకంటే 2017 డిసెంబర్ లో తాను రాజకీయ పార్టీని ప్రకటిస్తానని చెప్పిన రజనీకాంత్ ఆ తరువాత మనస్సు మార్చుకున్నారు. 2020 డిసెంబరులో .‘‘నేను రాజకీ యాల్లోకి రాలేనని చెప్పడానికి ఎంతగానో చింతిస్తున్నా’’ అని స్టేట్ మెంట్ ఇచ్చారు రజనీ, ’’దయచేసి నన్ను మన్నిం చండి. రాజకీయాల్లో ప్రవేశించకుండానే నేను ప్రజాసేవ చేస్తాను’’ అంటూ మూడు పేజీలతో కూడిన లేఖను ట్విటర్లో షేర్ చేశారు.దీంతో దేవుడు శాసించాడు….రజనీ పాటించాడు…..అంటూ తలైవా మీద సామాన్య జనం కామెంట్స్ చేసుకున్నారు.
రాజకీయాలకు సంబంధించి రజనీకాంత్ చివరిక్షణంలో చేతులెత్తేయడం వెనుక రకరకాల కారణాలు చెబుతున్నారు సినీజనం. అయితే అనారోగ్య కారణాలతోనే రాజనీకాంత్ …పాలిటిక్స్‌కు నో అన్నారన్నది ఆయన కుటుంబసభ్యుల కథనం. ఏమైనా అభిమానుల ఆశలపై రజనీకాంత్ నీళ్లు చల్లారు. ఇదిలాఉంటే మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సమయంలో ఎన్డీయే కూటమికి తమిళనాట షాక్ తగిలింది. కిందటి ఏడాది సెప్టెంబరులో ఎన్డీయే కూటమి నుంచి అన్నా డీఎంకే వైదొలగింది. దాదాపు ఏడాదిన్నర కాలంగా బీజేపీ, అన్నా డీఎంకే మధ్య గొడవలు నడుస్తున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ఇటీవల పెనుమార్పులు సంభవిస్తున్నాయి. అన్నా డీఎంకేలో పన్నీర్ సెల్వం చాలాకాలం పాటు కీలక పాత్ర పోషించారు. అయితే కొన్ని నెలల కిందట అన్నాడీఎంకే నుంచి పన్నీర్ సెల్వంను బహిష్కరించారు. అంతేకాదు ఎడప్పాడి పళనిస్వామిపై జరిగిన న్యాయపోరాటంలో పన్నీర్ సెల్వం ఓడిపోయారు. అయినప్పటికీ అన్నాడీఎంకే పార్టీ జెండా, పేరును పన్నీర్ సెల్వం ఉపయోగిస్తూ వచ్చారు. అయితే, పన్నీర్ సెల్వం అన్నా డీఎంకే జెండా, పార్టీ గుర్తు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ పళనిస్వామి హైకోర్టు మెట్లెక్కారు. దీంతో మద్రాస్ హైకోర్టు పళనిస్వామికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై నోటి దురుసుతనమే పార్టీ చీలికకు ప్రధాన కారణం అనేది అన్నా డీఎంకే నేతల ఆరోపణ. అన్నామలై పూర్వాశ్రమంలో ఐపీఎస్ అధికారి. కర్ణాటక క్యాడర్లో పనిచేశాడు. ఓ మంచి పోలీసు అధికారిగా జనంలో గుడ్‌విల్ తెచ్చుకున్నాడు. తమిళనాట బీజేపీకి దిక్కుమొక్కులేని రోజుల్లో 2021 జులైలో పార్టీ రాష్ట్ర బాధ్యతలు అన్నామలైకు అప్పగించారు హస్తిన పెద్దలు. అన్నామలై పగ్గాలు చేపట్టిన తరువాత తమిళనాడు బీజేపీ లో జోష్ పెరిగిన మాట వాస్తవం. తమిళనాట కొన్ని దశాబ్దాలుగా ఏదో ఒక ద్రవిడ పార్టీకి జూనియర్ పార్టీగా ఉన్న బీజేపీని ఒక స్వతంత్ర రాజకీయపార్టీగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి తీసుకెళ్లిన ఘనత నిస్సందేహంగా అన్నామలైదే. ఎంకే స్టాలిన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిరోజూ ఏదో ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి బీజేపీని జనంలోకి తీసుకెళ్లాడు అన్నామలై. కాగా పన్నీర్ సెల్వం స్వంత పార్టీతో బీజేపీ జతకట్టే అవకాశాలున్నాయి. ఇద్దరికీ కామన్ ప్రత్యర్థి పళనిస్వామి కావడమే విశేషం. ఇదిలా ఉంటే పన్నీర్ సెల్వం పార్టీ, బీజేపీతో విజయ్ స్వంత పార్టీ జత కట్టే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలన్న గట్టి పట్టుదలతో ఢిల్లీ బీజేపీ పెద్దలు ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ టాక్.


