పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరానికి వాణిజ్య, రాజకీయ రాజధానిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లా రాజకీయా లన్నీ ఈ నియోజకర్గంలో ఉన్న కాపు, రాజుల సామాజికవర్గాలే శాసిస్తాయి. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇదే నియోజకవర్గంలో పోటీ చేసినా టీడీపీతో పొత్తు లేకపోడం వల్ల ఓట్లు చీలి వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గెలుపొందారు. తాజాగా జగన్ ప్రభుత్వంపై ఏర్పడ్డ వ్యతిరేకత టీడీపీ – జనసేన ఉమ్మడిగా పోటీ చేయడంతో ఈ నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది. ఒక వేళ టీడీపీ పొత్తులో భాగంగా పవన్ పోటీ చేస్తే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ నియోజకర్గం వార్తల్లో నిలవనుంది. ఈ నేపథ్యంలో మరోసారి భీమవరం వైసీపీకి వరం కానుందా! లేదా ప్రజలు టీడీపీ- జనసేనకు విజయం కట్టబెడతారా!
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జిల్లా కేంద్రమైన భీమవరం రాజకీయాలు గరం గరంగా మారుతున్నా యి. గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని ఇక్కడ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ- జనసేన పార్టీలు పొత్తు కుదరడంతో భీమవరంపైనే అందరి దృష్టి పడింది. ఇరు పార్టీల పొత్తులో భాగంగా భీమవరం సీటు తెలుగుదేశంకు కేటాయిస్తారా లేదా జనసేనకు కేటాయిస్తారా అనేది ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది .ఇదిలా ఉంటే బీమవరం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ పోటీ చేసే అవకాశం ఉందని పవర్ స్టార్ అభిమానులు ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుల నేపథ్యంలో గెలిచే అవకాశం ఎంతమేరకు ఉంటుందనేది కూడా ఆలోచించాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేని పవన్ సొంత సామాజిక వర్గం ఎన్నికల సమయానికి ఓట్లు వేస్తుందా ! అనే చర్చ కూడా ప్రధానం నడుస్తోంది. అలాగే పవన్ అభిమానుల ఓట్లు కూడా బ్యాలెట్ బాక్సుల్లో ఎంతమేరకు ఉంది అనేది కోటి డాలర్ల ప్రశ్నగా మారింది. వాస్తవానికి పవన్ అభిమానుల సంఖ్యాబలం ఎంతున్నా … జనసేన అధినేతకు బలమైన పొలిటికల్ క్యాడర్ లేదనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ… నియోజకవర్గంలో తన బలాన్ని కాపాడుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ పథకాలకు తోడు వ్యక్తి గతంగా కూడా ప్రజలతో సన్నిహిత సంబంధాలు నెరపడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుపుకు మేలు చేస్తుందని స్థానిక వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భీమవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గెలుపు ఆపడం ఎవరికీ సాధ్యం కాదని వైసీపీ క్యాడర్ బలంగా నమ్ముతోంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా విపత్తులో కూడా ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రజలకు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో నియోజకర్గం వ్యాప్తంగా ప్రజల్లో ఎమ్మెల్యేపై అభిమానం ఉంది. ఆపదలో వెన్నంటి ఉన్న లీడర్ గంధి శ్రీనివాస్ అని క్యాడర్ ప్రచారం చేస్తోంది.
జిల్లా కేంద్రాన్ని సాధించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు భీమవరంలో జిల్లా మెడికల్ ఆసుపత్రి నిర్మాణానికి భూమి దానం చేయడం వంటి అంశాలు ఆయనకు అనుకూలంగా మారతాయని క్యాడర్ భావిస్తుంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే శ్రీనివాస్ ని రియల్ హీరోగా అభివర్ణించారు. ఈ సందర్భంలో ప్రజల్లో మంచి స్పందన లభించింది. జిల్లా కేంద్రం సాధించడంలో చేసిన కృషిని ప్రజలకు వివరించి తమ పార్టీ నుండి తిరిగి గ్రంధి శ్రీనివాస్ పోటీ చేస్తారని సీఎం జగన్ ప్రక టించారు. ఇలా బలమైన వ్యక్తిని ఢీకొనడానికి గల అంశాలను టీడీపీ, జనసేన బేరీజు వేసుకుంటున్నాయి. జనసేనకు కేటాయిస్తే అధినేత పవన్ కళ్యాణ్ లేదా కొటికలపూడి గోవిందరావు (చినబాబు) పేర్లు మారుమోగుతున్నాయి. ఒక వేళ భీమవరం స్థానం టీడీపీకి కేటాయిస్తే జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పేర్లు చర్చించుకుంటున్నారు. వీరిలో పులపర్తి అంజిబాబు గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుండి రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనపై ప్రజల్లో సానుభూతి ఉందని, ఆయనకు సీటు కేటాయిస్తే గెలిచే అవకాశం ఉందిని టీడీపీ అధిష్టానం అంచనా… సిట్టింగ్ ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన వారే ఇరుపార్టీల నుండి పోటీకి సై అనడం ఇక్కడ సరికొత్త కొసమెరుపు.
అయితే పొత్తులో భాగంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన భీమవరం సీటు ఏపార్టీకి కే టాయిస్తారనేది ప్రస్తుతానికి ప్రశ్నార్ధకంగానే మారింది. జనసేనాని పోటీ చేస్తే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే లోకల్ నాన్ లోకల్ అనే వ్యత్యాసాలు వచ్చే అవకాశం ఉందని అందుకే గత ఎన్నికల్లో జనసేనాని ఓటమి చవిచూడాల్సి వచ్చిందని పలువురు అభిప్రాయపడుతు న్నారు. ఈ నేపద్యంలో మాజీ ఎమ్మెల్యే అంజిబాబు, సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ పోటీ ఏర్పడితే ఎన్నిక రసవత్తరంగా మారనుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలా ఉండగా భీమవరంలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరీ ప్రారంభించి, ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. దీంతో భీమవరంలో అన్ని పార్టీల నుండి రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో భాజపా కూడా భీమవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. ఇదే గనక జరిగితే నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పదనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. అయితే మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఒకే సామాజికి వర్గం వారైతే ఎమ్మెల్యే గెలుపు మరింత కష్టం అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లలో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అడ్రెస్ గల్లంతయ్యింది. అయితే ఇటీవల వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నిల్లో కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దింపితే ఇక్కడ నాలుగు ముక్కలాటగా మారుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు భీమవరం రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద భీమవరం నియోజకవర్గంలో గెలుపు నీదా నాదా అంటూ ప్రధాన పార్టీల బరిలోకి దిగనున్నాయి . అయితే ప్రధాన పార్టీలు భీమవరం స్థానం ఎవరెవరికి దక్కనుందో వేచి చూడాలి. అలాగే నియోజవర్గం ప్రజలు గెలుపు ఎవరికి కట్టబెడతారనేది ప్రస్తుతానికి కోటి డాలర్ల ప్రశ్నే…..