ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురిని ఇంటికి తీసుకెళ్లి, దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమ పరువు తీసిందనే కోపంతో కన్న తల్లిదండ్రులే కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. తంజావూరు జిల్లాలోని పూవలూరుకు చెందిన నవీన్, ఐశ్వర్య ప్రేమించుకున్నారు. స్కూల్ నుంచి ప్రేమించుకున్న వీరిద్దరూ.. తర్వాత సొంత ఊరు నుంచి తిరువూరుకు వెళ్లి ఉద్యోగం చేస్తున్నారు.
నవీన్ తిరువూరుకు వెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత ఐశ్వర్యను కూడా మరో ప్రైవే టు కంపెనీలో చేర్పించాడు. ఇలా వీరిద్దరూ దాదాపు 20 నెలలుగా సహజీవనం చేశారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, వీరిద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో పెళ్లికి తమ పేరెంట్స్ అంగీకరిం చరని ఎవరికీ తెలియకుండా గతేడాది 31న ఐశ్వర్య, నవీన్‌ను పెళ్లి చేసుకుంది.
ఈ క్రమంలో ఐశ్వర్య తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐశ్వర్యను గుర్తించిన పోలీసులు ఆమె తల్లిదం డ్రులకు అప్పగించారు. దీంతో ఇంటికి తీసుకెళ్లిన వారు వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని, తమ పరువు తీసి అవమానించిందని కూతురిపై పెట్రోల్ పోసి నిప్పటించి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత తమ కూతురు ఆత్మ హత్య చేసుకున్నట్లు నమ్మించి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే, ఐశ్వర్యను హత్య చేసి చంపారంటూ నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఐశ్వర్య తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.


