వైసీపీలో ఇంఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఏడో జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎడం బాలాజీని, కందుకూరుకు కటారి అరవిందా యాదవ్‌ను పార్టీ సమన్వయ కర్తలుగా అధిష్టానం నియమించింది. ఇప్పటికే ఆరు జాబితాలు ప్రకటించగా.. తాజాగా, ఏడో జాబితాలో కేవలం ఇద్దరు పేర్లు మాత్రమే ప్రకటించింది. పర్చూరు ఇంఛార్జీగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌ను పార్టీ తప్పించింది. అలాగే కందుకూరు ఇంఛార్జ్మహీధర్రెడ్డిని తప్పించింది. కాగా, ఇప్పటి వరకు ఆరు విడతల్లో 63 అసెంబ్లీ, 16 లోక్‌సభ సీట్లకు ఇంఛార్జు లను నియమించింది. ఇప్పటివరకు ఆరు జాబితాలు విడుదల చేసింది వైసీపీ అధిష్టానం. అనేక మార్పులు చేర్పులు చేసింది. పలువురు సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరించారు జగన్. కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా, కొందరు ఎంపీలు ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు. కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజక వర్గం ఇంఛార్జిగా ప్రస్తుతం ఆమంచి కృష్ణ మోహన్ ఉన్నారు. ఈ ఎన్నికల్లో తాను పర్చూరు నుంచి పోటీ చేయలేను అని వైసీపీ అధిష్టానంతో చెప్పారు కృష్ణమోహన్. చీరాల నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పర్చూరు నియోజక వర్గానికి కొత్త ఇంచార్జ్ ని ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ఎడం బాలాజీ గతంలోనూ పర్చూరు వైసీపీ ఇంచార్జిగా పని చేశారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తాజాగా సీఎం జగన్ ను కలిసి పర్చూరు గురించి చర్చించారు. ఈ క్రమంలో ఆయనను పర్చూరు వైసీపీ ఇంచార్జి గా నియమించారు.


