వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సీట్లకు డిమాండ్ వుంది. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు చాలామంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఎంపీగా పోటీ చేయమంటే మాత్రం వద్దు బాబోయ్ అంటు న్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి, డాక్టర్ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనా మా చేసి ఇతర పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయమన్నా కూడా ససేమిరా అంటున్నారు.
తాజాగా రాజ్యసభ సభ్యుడు వైసీపీ సీనియర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీ ఎంపీగా పోటీ చేయించాలని సీఎం జగన్మో హన్ రెడ్డి నిర్ణయించారు. ఇదే విషయాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. అయితే వేమిరెడ్డి తాను ఎంపీగా పోటీ చేయాలంటే తాను సూచించిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. నెల్లూరు సిటీ తో పాటు కావలి, ఉదయగిరి వైసీపీ ఇన్చార్జిలను మార్చాలని వేమిరెడ్డి వైసీపీ అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారు. వేమిరెడ్డి కోరిన విధంగా ఇన్చార్జిలను మార్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ని నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించాలని సీఎం జగన్ ఇప్పటికే నిర్ణయించారు. అనిల్ యాదవ్ స్థానంలో తన భార్య వేమిరెడ్డి ప్రశాంతి కి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు ప్రభాకర్ రెడ్డి. అయితే తాజాగా నెల్లూరు సిటీ ఇన్చార్జిగా డిప్యూటీ మేయర్ ఖలీల్ ని ప్రకటించింది వైసిపి అధిష్టానం.
నెల్లూరు సిటీ ఇన్చార్జిగా తన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి టికెట్ ఇవ్వకపోగా డిప్యూటీ మేయర్ ఖలీల్ ను ఇన్చార్జిగా నియమించడంపై వేమిరెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలో కార్యక్రమాలను రద్దు చేసుకొని కుటుంబంతో సహా వేమిరెడ్డి ఢిల్లీ వెళ్లిపో యారు. దీంతో వేమిరెడ్డి వైసీపీని వీడే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. తాను చెప్పిన వారికి టికెట్ ఇవ్వకపోగా తన భార్యకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ ఆసక్తి చూపకపోవడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపటం లేదని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఒంగోలు ఎంపీ సీటు విషయంలో పార్టీ సీనియర్ నేత బాలినేని వ్యవహారం వైసిపి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సిట్టింగ్ ఎంపీ మాగుంటకు సిటీ ఇవ్వాలని బాలినేని పట్టుపడుతున్న అందుకు జగన్ నిరాకరిస్తున్నారు. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధిష్టానం పై అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవడం పార్టీ అధిష్టానం పై ఆగ్రహంగా ఉండటంతో ఆయన రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అధికార పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ ఇన్చార్జ్ ల మార్పులు చేర్పుల్లో భాగంగా కొద్దిమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపించాలని జగన్ భావించారు. అందులో భాగంగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని తిరుపతి పార్లమెంటు ఇన్చార్జిగా నియమించారు. దీంతో ఎమ్మెల్యే ఆదిమూలం వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టిడిపిలో చేరేం దుకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరామ్ ను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని వైసిపి అధిష్టానం ఆదేశించింది. కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు గుమ్మనూరు జయరాం ఆసక్తి చూపడం లేదు. దీంతో అక్కడ మరో అభ్యర్థిని తెరపైకి తీసుకువచ్చింది వైసిపి. మరో మంత్రి, నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణ స్వామి సైతం చిత్తూరు పార్లమెంటు ఇన్చార్జిగా నియమించారు జగన్. చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు. తనకు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని మంత్రి నారాయణ స్వామి సీఎం కి స్పష్టం చేశారు. దీంతో తిరిగి మళ్లీ నారాయణ స్వామికి జీడీ నెల్లూరు అసెంబ్లీ బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్.
పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని వచ్చే ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేయించాలని వైసీపీ భావించింది. ఆయన్ను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలంటూ సీఎం జగన్ ప్రతిపాదించారు. కానీ ఎంపీగా పోటీ చేసేందుకు తనకు ఆసక్తి లేదని పెనమలూరు అసెంబ్లీ బాధ్యతలు ఇవ్వాలని వైసీపీ ముందు ప్రతిపాదన పెట్టారు. అందుకు సీఎం జగన్ సిద్ధం గా లేకపోవడంతో ఎమ్మెల్యే పార్థసారథి టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని జగన్ కోరారు. గుంటూరు ఎంపీగా తాను పోటీ చేయలే నంటూ చెప్పిన శ్రీకృష్ణదేవరాయలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేల మార్పులు చేర్పులతో వైసీపీలో అసంతృప్తి పెల్లుబికింది. చాలామంది నేతలు వచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపటం లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎన్నికల నాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ వైసిపి వర్గాల్లో జరుగుతోంది.