38.2 C
Hyderabad
Monday, April 15, 2024
spot_img

ప్రజాకర్షక హామీలతో వైసీపీ మేనిఫెస్టో..!

       వైనాట్ 175, సిద్ధం అంటూ ఎన్నికలకు సమర శంఖం మోగించిన వైసీపీ.. మరో కీలక అడుగు వేసేందుకు రెడీ అయింది. ఈ నాలుగున్నరేళ్లలో ఏం చేశాం.. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అన్నది ప్రజల ముందు ఆవిష్క రించబోతోంది. ఈనెల 10న మేదరమెట్లలో జరగబోయే సిద్ధం సభ వేదికగా.. పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయబో తోంది. గతంలో ఇచ్చిన హామీలతో పోలిస్తే..ఈసారి రెట్టింపు వరాలను వైసీపీ అధినేత కురిపించబోతున్నట్లు తెలుస్తోంది.

     ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముహూర్తం ముంచుకు వస్తోంది. మరో వారం పది రోజుల్లో ఎన్నికల షెడ్యూలు రావచ్చన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. అయితే.. 2019లో తిరుగులేని మెజార్టీతో అధికారం దక్కించుకున్న వైసీపీ.. మరోసారి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం అవసరమైన అన్ని వ్యూహాలను ఓ పద్దతిగా అమలు చేసుకుంటూ పోతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలాగా సిద్ధం పేరుతో సభలను నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకోవడమే కాదు.. కేడర్‌నూ ఉత్తేజ పరుస్తోంది.

     ఓవైపు ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉండడంతో.. ఇప్పుడు మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది వైసీపీ. విపక్షాలు సూపర్ సిక్స్‌ పేరుతో ఇప్పటికే ప్రకటించిన పథకాలను మించిన విధంగా కొత్త కొత్త పథకాలను.. ఇంకా చెప్పాలంటే గతంతో పోలిస్తే రెట్టింపు వరాలను ప్రజలపై కురిపించేందుకు సీఎం జగన్ సిద్ధమైనట్లు సమాచారం. ఈనెల పదో తేదీన మేదరమెట్లలో జరిగే సిద్ధం సభలో ఈ మేరకు మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలిపారు పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి.

     అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారిన 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్న వైసీపీ.. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపొందించిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధానంగా మహిళలు, యువత, రైతులకు పెద్దపీట వేస్తూ వారికి ఎక్కువగా లబ్ది చేకూరేలా మేనిఫెస్టోకు సీఎం జగన్‌ తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో వైసీపీకి కలిసొచ్చిన పెన్షన్ పెంపు, అమ్మ ఒడి లాంటి పథకాలను కొనసాగిస్తూనే.. పించన్లు మరింత పెంచేలా కసరత్తు చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రతి ఏడాది విడతల వారీగా పింఛన్‌ కానుక పెంచుకుం టూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచాలని భావిస్తున్నారు.

     మేనిఫెస్టోలో పలు ప్రజారంజక పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసాను 15వేల నుంచి 25వేలకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆరోగ్య శ్రీ పరిధిని 20 లక్షలకు ఇప్పటికే పెంచారు. ఇక అమ్మ ఒడి 15వేల నుంచి 20వేలకు, వైఎస్సార్ చేయూత కింద చేసే సాయాన్ని 18వేల 500 నుంచి 20వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొత్త హామీలలో భాగంగా రెండు లక్షల దాకా రైతులకు రుణ మాఫీ, అలాగే డ్వాక్రా రుణమాఫీ హామీలు ఈసారి అత్యంత కీలకం కాబోతున్నాయని పార్టీ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి.

   ఇక, మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా ఈసారి మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది. అలాగే.. 400 రూపాయ లకే గ్యాస్ సిలిండర్ హామీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పేదలకు 20 లక్షల ఇళ్లు, విద్యార్థులకు ల్యాప్ టాప్స్, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఇలా మరిన్ని ప్రజాకర్షక హామీలతో మేనిఫెస్టోను వైసీపీ అధినేత..ఏపీ సీఎం జగన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తయారైన దానికి తుది మెరుగులు దిద్ది.. సిద్ధం సభలో ప్రకటించబోతున్నారు జగన్.

Latest Articles

ముగిసిన సీబీఐ కస్టడీ ….కవితను కలిసిన కేటీఆర్

ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. ఉదయం 10 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను సీబీఐ హాజరు పర్చనుంది. సీబీఐ అధికారుల బృందంలో మహిళా అధికారులు కవితను మూడు రోజుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్