వైనాట్ 175 అంటున్న వైసీపీకి ఎన్నికల వేళ షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న జగన్‌కు సొంత నేతలే కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. ప్రతిపక్షాలతో చేతులు కలిసి ప్రజాక్షేత్ర పోరుకు సై అంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు..? ఎందుకా షాక్‌లు..?
ఏపీలో ఎన్నికల పోరుతో రాజకీయాలు కాకరేపుతున్నాయి. జంపింగ్ జపాంగ్‌ల కాలం నడుస్తోంది. హైకమాండ్‌పై ఏమాత్రం అలకబూనినా.. పార్టీ కండువా మార్చేస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీ ఎంత చేసింది అనేది ముఖ్యం కాదు..మున్ముందు రాజకీయ భవిష్యత్తు ముఖ్యమంటూ ప్రత్యర్థి గట్టుకు చేరిపోతున్నారు. ఏం చెప్పినా, ఎంత చెప్పినా డోంట్ కేర్ అంటూ గుడ్‌బై చెప్పేస్తున్నారు. వైసీపీలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇది. ఎన్నికల వేళ సీఎం జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు పార్టీ నేతలు. అసంతృప్తులంతా ఒక్కొక్కరుగా వైసీపీని వీడి ప్రతిపక్షాలతో జత కడుతున్నారు.
అధికారమే లక్ష్యంగా మార్పులు చేర్పులపై ఫోకస్ పెట్టారు జగన్. అయితే అదే వ్యూహం వైసీపీ కొంప ముంచుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు వైసీపీ శిబిరం వీడి ప్రత్యర్థి పార్టీల్లోకి జంప్ అయ్యారు. ఇక తాజాగా అదే బాటలో సొంత గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు మాజీ మంత్రి, గుంటూరు జిల్లా అధ్యక్షులు డొక్యా మాణిక్య వరప్రసాద్. వైసీపీ అధిష్టానంపై అలకబూనిన డొక్కా.. గత కొంతకాలంగా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తాడికొండ ఇన్‌చార్జ్‌గా తొలగించడంపై అసహనంగా ఉన్నారు. దీంతో వైసీపీ ముఖ్య నేతలు బుజ్జగిస్తున్నా ఆయన మాత్రం అలక వీడలేదు. ఈ నేపథ్యంలోనే డొక్కా మాణిక్యంవైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన ఆయనకు పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది. ఆ తర్వాత ఆయన అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చు కున్నారు. కొద్ది కాల తర్వాత ఆయన వైసీపీ అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. పార్టీలో తనకు ప్రాధాన్యం కరువైందని, అధినేతను కలిసే పరిస్థితి కూడా లేదని వాపోయారు. ఈ క్రమంలోనే వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అయ్యారు.
ఇక అనంతపురం జిల్లా వైసీపీ కీలక నేత ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ కూడా తన పదవితోపాటు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా టీడీపీ కండువా కప్పుకోనున్నారన్న ప్రచారం సాగుతోంది. మాజీ పోలీసు అధికారి అయిన మహ్మద్ ఇక్బాల్ గత ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసి బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆయనకు వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. హిందూపురం ఇంచార్జ్‌గా కొనసాగారు. నాలుగేళ్ల వరకూ పని చేసిన తర్వాత ఆయన స్థానంలో దీపికను ఇంచార్జ్‌గా నియమించడంతోపాటు.. ఇక్బాల్ పేరును జగన్ మరెక్కడా పరిశీలనలోకి తీసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతప్తితో పార్టీ వీడినట్టు సమాచారం. హిందూపురం నియోజకవర్గంలో వర్గపోరు అధికం. ఈ క్రమంలోనే ఇక్బాల్‌ను తప్పించిన హైకమాండ్ స్థానికురాలు కానప్పటికీ బీసీ మహిళ కోటాలో దీపికకు సీటు ఇచ్చింది.ఆమె భర్త రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో.. రెండు వర్గాలుగా కలసి వస్తుందన్న ఎత్తుగడ వేసింది. ఇటీవలి కాలంలో ఇక్బాల్‌కు పార్టీ కార్యక్రమాలకూ పిలుపు రాకపోవడం,… పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆయన అవమానంగా భావించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ పదవిని వద్దనుకుని రాజీనామా చేశారని తెలుస్తోంది.
పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా వైసీపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కడపలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన హస్తంతో చేయి కలిపారు. అలాగే పార్టీ కీలక నాయకురాలైన కల్లి కృపారాణి సైతం వైసీపీని వీడారు. వైఎస్ షర్మిలను కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఇలా వరుసగా నేతలు పక్క పార్టీల వైపు చూస్తుండటంతో.. వైసీపీ అగ్ర నేతలు కలవరపడుతున్నారు. వలసలు ఎలా ఆపాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే,.. 175 ముచ్చట దేవుడెరుకు కానీ.. ఓటమి తప్పదన్నగుబులు మొదలైంది.


