నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకి నారాయణ్, సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, ఆశ్రిత వేముగంటి, శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణ్
కెమెరా: మది
ఎడిటర్: శ్రవణ్ కటికనేని
నిర్మాత: శివ మేక
రచన-దర్శకత్వం: మహి వి రాఘవ్
విడుదల: 8 ఫిబ్రవరి 2024
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎలక్షన్ ఫీవర్ నడుస్తోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక, పొత్తులు-ఎత్తులు వంటి అంశాలను రాజకీయ పార్టీలు మొదలు పెట్టేశాయి. వీటికి తోడు ఆయా పార్టీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా సినిమాలు కూడా రూపొందాయి. ఏపీ సీఎం జగన్‌కు సపోర్ట్‌గా వ్యూహం, యాత్ర-2 సినిమాలు రూపొందగా, ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా ‘రాజధాని ఫైల్స్’ అనే సినిమా కూడా రూపొందింది. అయితే రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమాకు సెన్సార్స్ సమస్యల వల్ల బ్రేక్ పడింది. కానీ మహి వి రాఘవ్ రూపొందించిన యాత్ర-2 సినిమా మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుకున్న టైమ్‌కు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2019లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా ‘యాత్ర’ సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ మహి వి రాఘవ్ ఇప్పుడు జగన్ పాదయాత్ర నేపథ్యంగా ‘యాత్ర-2’ సినిమాను నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా ఎలా ఉంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
కథ:
వైఎస్ రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) తన కొడుకు జగన్ (జీవా)ను 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా నిలబెడుతున్నానంటూ ప్రజలకు పరిచయం చేస్తూ ఈ కథ మొదలవుతుంది. ఆ తర్వాత.. ఎన్నికల్లో గెలవడం, వైఎస్సార్ సీఎం అవ్వడం.. సీఎం అయ్యాక వైఎస్ ప్రజలకు ఏం చేయాలనుకున్నారు అనేది చూపిస్తారు. ఆ తర్వాత ఆయన మరణించడం, మరణం తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘ఓదార్పు యాత్రను’ కాంగ్రెస్ అధిష్టానం ఆపేయమనడంతో జగన్ ప్రత్యేక పార్టీ పెట్టి, ఉప ఎన్నికల్లో గెలుస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య జగన్‌పై సీబీఐ దాడులు జరుగుతాయి. జగన్ అరెస్ట్ అవుతాడు. ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు (మహేష్ మంజ్రేకర్) సీఎం అవ్వడం, మొదటిసారి జగన్ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష నేతగా ఉండటం వంటి సంఘటనలు జరుగుతాయి. జైలు నుంచి బయటకు వచ్చిన జగన్… జనాలకు ఎలా దగ్గరయ్యాడు.. పాదయాత్రను పూర్తి చేసి 2019లో సీఎం ఎలా అయ్యాడు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
ఏపీ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. సామాన్య కార్యకర్త నుంచి ప్రజా నేతగా ఆయన ఎదిగిన క్రమం అందరికీ ఆదర్శనీయం. ఎన్నో పథకాలతో ప్రజల గుండెల్లో ఆయన చెరగని ముద్రవేశారు. ఆయన రాజకీయ వారసుడిగా జగన్మోహన్‌రెడ్డి వచ్చారు. తండ్రి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి వేరు పడి ప్రత్యేక పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే జగన్ సీఎం అవడానికి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర గురించి అందరికి తెలిసిందే.. అయితే ఆ యాత్ర చేపట్టడానికి గల ప్రధాన కారణం.. ఆ సమయంలో ఆయనకు ఎదురైన సంఘటనలు ఏంటి అనేది చాలా ఎమోషనల్‌గా చూపించారు డైరెక్టర్ మహి. ఎమోషన్స్ ఎంత పండించాలి? ఎలాంటి సన్నివేశాలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారనేది లెక్కలేసుకొని మరీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. రెగ్యులర్ బయోపిక్‌లా కేవలం కథను మాత్రమే చెప్పకుండా.. ప్రతి సన్నివేశాన్ని ఎమోషనల్‌గా చూపిస్తూ ప్రేక్షకులు కథలో లీనమయ్యేలా చేశారు. 2009 నుంచి 2019 వరకు ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలను తను అనుకున్న విధంగా చూపించగలిగారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రజలతో వైఎస్ జగన్ మమేకమైన తీరు, వారి కష్టాలను అవలోకనం చేసుకోవడం లాంటి అంశాలు ఆకట్టుకుంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే 2009 నుంచి 2019 వరకు జగన్ జర్నీలోని కీలకాంశాలను, తను నమ్మిన సంఘటనలను యాత్ర-2గా డైరెక్టర్ మహి వి రాఘవ్ తెర మీద చూపించారు. నందిగం సురేష్ క్యారెక్టర్ సినిమాలో ఒక హైలైట్ సీన్ అని చెప్పొచ్చు. అయితే ఆ క్యారెక్టర్‌కు జగన్ చెప్పిన డైలాగ్ ప్రకారం సెల్యూట్ చేసే సీన్ కూడా చూపించి ఉంటే ఇంకాస్త బెటర్‌గా ఉండేదనే ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటుల విశ్లేషణ:
ఈ సినిమాలో కథంతా వైఎస్సార్, వైఎస్ జగన్ పాత్రల చుట్టే తిరుగుతుంది. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి యాత్రలో ఎలా జీవించేశారో ఇందులో కూడా అలా జీవించారు. ఇక వైఎస్ జగన్‌గా జీవా కూడా అదరగొట్టేశాడు. తన నటనతో తొలి షాట్ నుంచే తెర మీద వైఎస్ జగన్‌నే చూస్తున్నామన్నంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు జీవా. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిగా కేతకి నారాయణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. తెరపై అచ్చం వైఎస్ భారతీలాగే కనిపించారు. సోనియా గాంధీ పాత్రలో సుజానే బెర్నెర్ట్ సరిగ్గా సరిపోయారు. లుక్ పరంగాను ఆమె సోనియా గాంధీని గుర్తు చేశారు. చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ కీలక నేత రెడ్డిగా శుభలేఖ సుధాకర్‌తో పాటు కొడాలి నాని పాత్రధారి, నందిగం సురేష్ పాత్రధారి తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతిక విశ్లేషణ:
సాకేంతిక పరంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. దర్శకుడు మహి వి రాఘవ్ గతంలో ‘యాత్ర’ సినిమాను ఎంతో ఎమోషనల్‌గా ఎవరినీ కించపర్చకుండా తెరకెక్కించారు. అయితే ‘యాత్ర-2’ విషయంలో కొంతమంది వ్యక్తులను కొద్దిమేర టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఒకరు గొప్ప అని చెప్పడానికి ఇంకొకరు తక్కువ అని చూపించకుండా ఉంటే బాగుండేది. కడపోళ్ల గురించి చెప్పే డైలాగులు మిగతా ప్రాంతాల వాళ్లను తక్కువ చేసేలా ఉంటాయి. అయితే మేకింగ్ పరంగా మహి వి రాఘవ్ తన మార్కును నిలబెట్టుకున్నారు. సినిమాను ఎంతో ఎమోషనల్‌గా, ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించడం సక్సెస్ అయ్యారు. ఇక సంతోష్ నారాయణన్ అందించిన పాటలు.. నేపథ్య సంగీతం సినిమాని మరో మెట్టు ఎక్కించాయి. ‘చూడు నాన్న..’పాటు హృదయాలను హత్తుకుంటుంది. పెంచలదాస్ పాడిన వైఎస్సార్ మరణం నేపథ్యంలో సాగే పాట అయితే కన్నీళ్లను తెప్పిస్తుంది. ‘తొలి సమరం’సాంగ్ వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానుల్లో జోష్‌ని నింపుతుంది. మది సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
చివరిగా.. నిజానిజాలను పక్కన పెడితే మేకింగ్ పరంగా మంచి ఎమోషనల్ మూవీ ‘యాత్ర-2’
రేటింగ్: 3/5
సినిమాలోని కీలక డైలాగులు:
జగన్ రెడ్డి కడపోడు సార్.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్
ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఆ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను’
నువ్వు మా వైఎస్సార్ కొడుకువన్న మాకు నాయకుడిగా నిలబడన్నా.. నేను విన్నాను-నేను ఉన్నాను
‘నాకు భయపడడం రాదయ్యా.. నేనేంటో, నా రాజకీయం ఏంటో మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్సార్ కొడుకుని’
చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాటని తపని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తు పెట్టుకుంటే చాలన్న’
‘పిల్లిని తీసుకెళ్ళి అడవిలో వదిలినా అది పిల్లే…పులిని బోనులో పెట్టినా అది పులే’